యువనటి మృతి కేసులో భర్త అరెస్ట్
గువాహటి: బాలీవుడ్ నటి, సింగర్ బిదిశా బెజ్బరువా అనుమానాస్పదమృతి కేసులో ఆమె భర్త నిశీత్ ఝాను గురుగ్రామ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిశీత్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అసోంకు చెందిన నటి బిదిశా బెజ్బరువా సోమవారం ఢిల్లీ శివారు ప్రాంతం గురుగ్రామ్లోని తన ఫ్లాట్లో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెది ఆత్మహత్యా, లేక హత్యా అనే కోణాల్లో విచారణ చేపట్టారు. ఆమెది ఆత్మహత్య కాదని, బిదిశా కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తంచేశారు.
బిదిశా స్వస్థలం గువాహటి కాగా టీనేజీ నుంచే అసోం నాటకాలు, సంగీత కార్యక్రమాలు చేయడం ద్వారా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల విడుదలైన ‘జగ్గా జాసూస్’ ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే గుజరాత్‌కు చెందిన నిశీత్ ఝాతో గతేడాది బిదిశా వివాహం జరిగింది. కానీ భర్త నిశీత్ ఫ్యామిలీ వేధింపులకు గురిచేయడంతో ఆ కుటుంబానికి నటి దూరంగా ఉంటున్నారు. భర్త నిశీత్ తో కలిసి జీవించాలని ఆమె భావించేవారు. ఇటీవల తన భర్త నిశీత్ తో కలిసి ఆమె టూర్‌కు వెళ్లినట్లు సమాచారం. అంతలోనే గొడవ ఏదైనా జరిగి ఆమె సూసైడ్ చేసుకున్నారా.. ప్లాన్ ప్రకారం హత్య చేశారా అనే విషయం విచారణలో తేలుతుందన్నారు.