కాశ్మీరులో నేలకొరిగిన హైదరబాదీ వీర జవాన్
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ మరొక్క రోజు ఉందనగా.. హైదరాబాద్కు చెందిన ఓ వీర సైనికుడు జమ్ము కాశ్మీర్లో పాకిస్థానీ ముష్కరుల తూటాలకు నేలకొరిగాడు!! పూంఛ్ జిల్లాలో నియంత్రణరేఖ వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించడంతో లాన్స్నాయక్ మహ్మద్ ఫిరోజ్ఖాన్ ప్రాణాలు కోల్పోయాడు. మెంధార్లోని హమీర్పూర్ ప్రాంతంలో పాక్ దళాలు ప్రయోగించిన మోర్టార్ స్ప్లింటర్ తగిలి ఫిరోజ్ఖాన్ మరణించినట్లు సైన్యం అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
హైదరాబాద్కు చెందిన ఫిరోజ్ మృతిపట్ల వైట్ నైట్ కోర్ కమాండర్ తీవ్ర సంతాపం తెలిపారు. మెంధార్ సెక్టార్లో సోమవారమంతా కాల్పులు జరుపుతూనే ఉన్న పాక్ దళాలు మంగళవారం కూడా వాటిని కొనసాగించాయి. మంగళవారం ఉదయం 9.30 గంటలకే కాల్పులు మొదలైనట్లు సైన్యం అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. చిన్న చిన్న ఆయుధాలు, ఆటోమేటిక్ ఆయుధాలు, మోర్టార్లతో తమపై దాడులు చేసినట్లు ఆయన వివరించారు.