Mendhar sector
-
భారత్‌పై పాక్ నకిలీ సర్జికల్ స్ట్రైక్స్..!
శ్రీనగర్: భారత సైన్యం సర్జికల్ దాడులతో ఒక్కసారిగా బెంబేలెత్తిన పాకిస్థాన్.. నిదానంగానైనా క్రూరత్వాన్ని బయటపెట్టుకుంటోంది. సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి కాల్పుల నియంత్రణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత సరిహద్దు భద్రతా దళాలపై వరుసగా కాల్పులు జరుపుతున్నది. అదే సమయంలో సరిహద్దు గ్రామాలపైనా పాశవిక దాడులకు తెగబడుతున్నది. జమ్ముకశ్మీర్ లోని మెంధార్ సెక్టార్ లో సోమవారం ఉదయం పాక్ రేంజర్లు 120 ఎంఎం, 82 ఎంఎం మోర్టార్లతో భీకర కాల్పులకు తెగబడ్డారు. సర్జికల్ దాడులు జరిగిన సెప్టెంబర్ 29 నుంచి సోమవారం(నవంబర్ 7)నాటికి పాకిస్థాన్ 101 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానిన్ని ఉల్లంఘించింది. మొంధార్ ఘటన 101వది కావడం గమనార్హం. ఇప్పటివరకు పాక్ జరిపిన దాడుల్లో 20 మందికిపైగా పౌరులు, జవాన్లు మరణించారు. మరోదిక్కు పాక్ సైన్యం సహకారంతో కశ్మీర్ లోకి చొరబడుతున్న ఉగ్రవాదులు కూడా భారత జవాన్లే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. వీటిని అణిచివేయడంలో చాలా చోట్ల భారత బలగాలు పైచేయి సాధించినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం చేదు అనుభవాలు తప్పడంలేదు. పాక్ నకిలీ సర్జికల్ దాడులు! ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రదాడికి సమాధానంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ల(దాడులకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులు తలదాచుకునే చోటు)పై సెప్టెంబర్ 29న భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్(లక్షిత దాడుల) చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్ దూకుడును ప్రపంచదేశాలన్నీ సమర్థించాయి కూడా. అయితే ఏడు దశాబ్ధాలుగా దాయాదిని గమనిస్తోన్న భారత్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పంజాబ్, గుజరాత్ సరిహద్దుల్లోని గ్రామాలను ఖాళీచేయించింది. సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలోని గ్రామాలు అన్నింటినీ దాదాపు ఖాళీచేయించిన భారత సైన్యం.. కశ్మీర్ లో మాత్రం ఆపని చేయలేదు. దీంతో పాక్ రేంజర్లు, ఉగ్రవాదులకు ఆ గ్రామాలు టార్గెట్ అయ్యాయి. శత్రుమూకలను ఛిద్రం చేయడంలో సైనిక పాటవానికి సంబంధించి గొప్పగా చెప్పుకునే సర్జికల్ స్ట్రైక్స్ అసలు ఉద్దేశాన్ని పక్కనపెట్టి పాకిస్థాన్.. భారత్ లోని సాధారణ ప్రజానీకంపై సర్జికల్ స్ట్రైక్స్(లక్షిత దాడులు) చేస్తుండటం గర్హనీయం. ఇటీవల ప్రధానమంత్రి అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కీలక భేటీలో పాకిస్థాన్ పై మరో సర్జికల్ స్ట్రైక్ చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆమేరకు ఇంకా ఆదేశాలు వెలువడనప్పటికీ కశ్మీర్ లోని సరిహద్దు గ్రామస్తుల తరలింపుపై కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
కాశ్మీరులో నేలకొరిగిన హైదరబాదీ వీర జవాన్
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ మరొక్క రోజు ఉందనగా.. హైదరాబాద్‌కు చెందిన ఓ వీర సైనికుడు జమ్ము కాశ్మీర్లో పాకిస్థానీ ముష్కరుల తూటాలకు నేలకొరిగాడు!! పూంఛ్ జిల్లాలో నియంత్రణరేఖ వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించడంతో లాన్స్‌నాయక్ మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ ప్రాణాలు కోల్పోయాడు. మెంధార్‌లోని హమీర్పూర్ ప్రాంతంలో పాక్ దళాలు ప్రయోగించిన మోర్టార్ స్ప్లింటర్ తగిలి ఫిరోజ్‌ఖాన్ మరణించినట్లు సైన్యం అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఫిరోజ్ మృతిపట్ల వైట్ నైట్ కోర్ కమాండర్ తీవ్ర సంతాపం తెలిపారు. మెంధార్ సెక్టార్లో సోమవారమంతా కాల్పులు జరుపుతూనే ఉన్న పాక్ దళాలు మంగళవారం కూడా వాటిని కొనసాగించాయి. మంగళవారం ఉదయం 9.30 గంటలకే కాల్పులు మొదలైనట్లు సైన్యం అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. చిన్న చిన్న ఆయుధాలు, ఆటోమేటిక్ ఆయుధాలు, మోర్టార్లతో తమపై దాడులు చేసినట్లు ఆయన వివరించారు. -
పాక్ మరోసారి కాల్పుల ఉల్లంఘన
భారత్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పాకిస్థాన్ దళాలు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు దిగుతుందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ ఆర్. కే. పాల్టా మంగళవారం ఇక్కడ వెల్లడించారు. నిన్న సాయంత్రం బాగా పొద్దుపోయిన తరువాత ఎల్ఓసీ సమీపంలోని పూంచ్ జిల్లాలోని మెందార్ సెక్టర్పై పాక్ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. దాంతో భారత దళాలు అప్రమత్తమైనాయి. ఎదురు దాడికి దిగాయా. దాంతో ఇరువైపులా 10 నిముషాల పాటు కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే పాక్ కాల్పుల వల్ల భారత్ భద్రత దళాలకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. 2003లో భారత్, పాక్ దేశాలు ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే ఇటీవల కాలంలో తరుచుగా పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. -
ఎల్ఓసీ వద్ద మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన
అమెరికా పర్యటనలో భాగంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ అయి తిరిగి స్వదేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్ చేరుకునే లోపు పొరుగుదేశం కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని మెందర్ సెక్టర్లో సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పాక్ భద్రతా దళాలు కాల్పులు నిన్న మధ్నాహ్యం జరిపాయని రక్షణ శాఖ ప్రతినిధి కెప్టెన్ ఎస్.ఎన్. ఆచార్య బుధవారం వెల్లడించారు. పాక్ దళాలు చిన్నపాటి ఆయుధాలతో భారత్ సరిహద్దు వెంబడి కాల్పులు జరిపాయని వివరించారు. అందుకు ప్రతిగా భారత్ కూడా ఎదురు దాడికి దిగిందని చెప్పారు. అయితే ఆ ఘటనలో ఇరువైపులా ఎటువంటి గాయాలు కానీ, ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. 2003లో భారత్, పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా చేసుకున్న కాల్పుల ఒప్పందాన్ని ఈ ఏడాది మొదటి నుంచి పాక్ తరచుగా ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల సరిహద్దుల వెంబడి కాల్పులు జరగకుండా ఉండేందుకు మరింత శ్రద్ధ వహిస్తామని యూఎస్ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య ప్రధానులు అంగీకరించారు. అయినా పాక్ కాల్పులకు తెగబడటం గమనార్హం.