భారత్పై పాక్ నకిలీ సర్జికల్ స్ట్రైక్స్..!
శ్రీనగర్: భారత సైన్యం సర్జికల్ దాడులతో ఒక్కసారిగా బెంబేలెత్తిన పాకిస్థాన్.. నిదానంగానైనా క్రూరత్వాన్ని బయటపెట్టుకుంటోంది. సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి కాల్పుల నియంత్రణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత సరిహద్దు భద్రతా దళాలపై వరుసగా కాల్పులు జరుపుతున్నది. అదే సమయంలో సరిహద్దు గ్రామాలపైనా పాశవిక దాడులకు తెగబడుతున్నది. జమ్ముకశ్మీర్ లోని మెంధార్ సెక్టార్ లో సోమవారం ఉదయం పాక్ రేంజర్లు 120 ఎంఎం, 82 ఎంఎం మోర్టార్లతో భీకర కాల్పులకు తెగబడ్డారు.
సర్జికల్ దాడులు జరిగిన సెప్టెంబర్ 29 నుంచి సోమవారం(నవంబర్ 7)నాటికి పాకిస్థాన్ 101 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానిన్ని ఉల్లంఘించింది. మొంధార్ ఘటన 101వది కావడం గమనార్హం. ఇప్పటివరకు పాక్ జరిపిన దాడుల్లో 20 మందికిపైగా పౌరులు, జవాన్లు మరణించారు. మరోదిక్కు పాక్ సైన్యం సహకారంతో కశ్మీర్ లోకి చొరబడుతున్న ఉగ్రవాదులు కూడా భారత జవాన్లే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. వీటిని అణిచివేయడంలో చాలా చోట్ల భారత బలగాలు పైచేయి సాధించినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం చేదు అనుభవాలు తప్పడంలేదు.
పాక్ నకిలీ సర్జికల్ దాడులు!
ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రదాడికి సమాధానంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ల(దాడులకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులు తలదాచుకునే చోటు)పై సెప్టెంబర్ 29న భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్(లక్షిత దాడుల) చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్ దూకుడును ప్రపంచదేశాలన్నీ సమర్థించాయి కూడా. అయితే ఏడు దశాబ్ధాలుగా దాయాదిని గమనిస్తోన్న భారత్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పంజాబ్, గుజరాత్ సరిహద్దుల్లోని గ్రామాలను ఖాళీచేయించింది. సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలోని గ్రామాలు అన్నింటినీ దాదాపు ఖాళీచేయించిన భారత సైన్యం.. కశ్మీర్ లో మాత్రం ఆపని చేయలేదు. దీంతో పాక్ రేంజర్లు, ఉగ్రవాదులకు ఆ గ్రామాలు టార్గెట్ అయ్యాయి.
శత్రుమూకలను ఛిద్రం చేయడంలో సైనిక పాటవానికి సంబంధించి గొప్పగా చెప్పుకునే సర్జికల్ స్ట్రైక్స్ అసలు ఉద్దేశాన్ని పక్కనపెట్టి పాకిస్థాన్.. భారత్ లోని సాధారణ ప్రజానీకంపై సర్జికల్ స్ట్రైక్స్(లక్షిత దాడులు) చేస్తుండటం గర్హనీయం. ఇటీవల ప్రధానమంత్రి అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కీలక భేటీలో పాకిస్థాన్ పై మరో సర్జికల్ స్ట్రైక్ చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆమేరకు ఇంకా ఆదేశాలు వెలువడనప్పటికీ కశ్మీర్ లోని సరిహద్దు గ్రామస్తుల తరలింపుపై కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.