'ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదు'
లక్నో: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) రజతోత్సవ వేడుకల్లో పార్టీ నేత శివపాల్ సింగ్ యాదవ్ ఉద్వేగంగా మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ లో మూడు సార్లు సమాజ్ వాదీ పార్టీ అధికారాన్ని చేపట్టడానికి గల కారణం పార్టీ అధ్యక్షుడు ములాయాం సింగ్ యాదవ్ అని అన్నారు. సమస్యలను ఎదుర్కొవడంలో ములాయాం సమర్ధతే ఆయన్ను ఈ స్ధాయికి చేర్చిందని చెప్పారు.
పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేసేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని ఈ విషయాన్ని కార్యకర్తలకు సభాముఖంగా చెబుతున్నానని అన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన బాగుందని కితాబిచ్చారు. ఈ సర్కారులో గత నాలుగేళ్లుగా ప్రజలకు సేవ చేసినందుకు తనకు ఆనందంగా ఉందని తెలిపారు.
పార్టీ కోసం రక్తం ధారపోయడానికైనా తాను సిద్ధమని, తనను ముఖ్యమంత్రి చేయాల్సిన పనిలేదని చెప్పారు. తనను ఎంతగా అవమానించినా పర్లేదని అన్నారు. తాను ఎన్ని మంచి పనులు చేశానో తన ఆత్మకు తెలుసునని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అఖిలేశ్ బాగా పనిచేశారు. పీడబ్ల్యూ శాఖలో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించానట్లు పేర్కొన్నారు.
పార్టీ కోసం తనను తాను బలి చేసుకోవడానికైనా సిద్ధమని చెప్పారు. నేతాజీ చెప్పినట్లే పాలనను కొనసాగిస్తానని అన్నారు. తాను జనంలో నుంచి పుట్టిన నాయకుడినని చెప్పిన శివపాల్.. తన గురించి తప్పుడు ప్రచారం చేసే వారి గురించి జాగ్రత్త పడాలని కార్యకర్తలకు సూచించారు. తనను ఎన్నిసార్లు అవమానించినా, ఎన్నిసార్లు పదవి నుంచి తొలగించినా.. తాను చేసిన మంచి పనులు తన ఆత్మకు తెలుసునని అన్నారు.