బాంబులు పెట్టింది నేనే | I have planted the bombs, says Yasin Bhatkal | Sakshi
Sakshi News home page

బాంబులు పెట్టింది నేనే

Published Mon, Sep 2 2013 9:07 AM | Last Updated on Fri, Sep 28 2018 4:46 PM

బాంబులు పెట్టింది నేనే - Sakshi

బాంబులు పెట్టింది నేనే

హైదరాబాద్/న్యూఢిల్లీ: బాంబులతో దారుణ మారణకాండకు పాల్పడి, హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో 17 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నది తానేనని ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ అంగీకరించాడు. ఆ ఘటనలో వాడిన బాంబులను తయారు చేయడంతో పాటు, తానే స్వయంగా అమర్చానని భత్కల్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. 2008 నుంచి దేశవ్యాప్తంగా జరిగిన వివిధ పేలుళ్లకు పాల్పడింది కూడా తానేనని అంగీకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడాల్సిందిగా పాకిస్థాన్‌లో ఉన్నవారి నుంచి తనకు ఆదేశాలు అందినట్లు  చెప్పాడు. ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట బాంబు పేలుళ్లలో 17 మంది మరణించగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
 
ఈ పేలుళ్లకు పాల్పడ్డ భత్కల్‌ను భారత్-నేపాల్ సరిహద్దుల్లో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం భత్కల్‌తో పాటు మరో ఉగ్రవాది తబ్రేజ్‌ను బీహార్ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), నిఘా సంస్థల సిబ్బంది విచారించారు. ఆ విచారణలో ‘దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు ఎలా రెక్కీ నిర్వహించిందీ? బాంబులను తయారుచేసి స్వయంగా ఎలా పేలుళ్లకూ పాల్పడిందీ?’ తదితర విషయాలను భత్కల్ వెల్లడించినట్లు తెలుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల ప్రాంతాన్ని, అక్కడి ఆధారాలను పరిశీలించిన రాష్ర్ట ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులు అప్పట్లోనే పలు కీలక విషయాలను వెల్లడించారు. రెండు బాంబులూ స్థానికంగానే తయారయ్యాయని, నిపుణులే వాటిని తయారుచేసి ఉంటారని కూడా గుర్తించారు. బాంబుల తయారీకి ఉపయోగించిన పదార్థాలన్నీ స్థానికంగా సేకరించుకున్నట్లు కూడా తేలింది.
 
అత్యంత నైపుణ్యంతో ఎక్కువ నష్టం కలిగించేలా ఆ బాంబులను రూపొందించారు. అయితే.. ఆ బాంబుల తయారీకి పేలుడు పదార్థాల సేకరణలో స్థానికంగా భత్కల్‌కు ఎవరు సహకరించారు? భత్కల్ హైదరాబాద్‌లో ఎక్కడ షెల్టర్ తీసుకున్నాడు? తదితర విషయాలు భత్కల్‌ను ఎన్‌ఐఏ కస్టడీలోకి తీసుకుని విచారిస్తే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. యాసిన్ భత్కల్ అరెస్టు సమయంలో రెండు ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈమెయిళ్ల డీకోడింగ్ తలనొప్పే

పేలుళ్ల సమయంలో మాత్రమే బినామీ అడ్రస్‌ల ద్వారా తీసుకున్న సిమ్‌కార్డులతో సెల్‌ఫోన్లు ఉపయోగించే భత్కల్.. సాధారణ సమయంలో తన మాడ్యుల్‌తో ఈ-మెయిళ్ల ద్వారానే సంబంధాలు నెరిపేవాడని తేలింది. హైదరాబాద్‌లోని కొందరితో కూడా ఈ-మెయిళ్ల ద్వారానే సంప్రదింపులు జరిపినట్లు భత్కల్ అంగీకరించినట్లు తెలిసింది. కానీ, ‘కోడ్’ల రూపంలో ఉన్న ఆ మెయిళ్లను ‘డీకోడ్’ చేయడం అధికారులకు సమస్యగా మారినట్లు సమాచారం. ‘డీకోడ్’ చేయగలిగితే దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు సహకరించిన స్థానికులెవరనేది గుర్తించడం సాధ్యమవుతుందని అంటున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా జరిగిన పలు పేలుళ్లకు తానే బాంబులను తయారు చేసినట్లు కూడా భత్కల్ బీహార్ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. బాంబుల నమూనాలు, ఆకారాల్లో మార్పులు చేస్తూ అధికారులను బురిడీ కొట్టించానన్నాడు. బాంబుల తయారీలో వంద మంది యువకులకు శిక్షణ ఇచ్చాననీ భత్కల్ వెల్లడించినట్లు సమాచారం.
 
నేపాల్ ద్వారానే..

భారత్-నేపాల్‌ల మధ్య వీసా అవసరం లేకుం డా సులువుగా ప్రయాణించగల అవకాశాన్ని తాము ఉపయోగించుకున్నట్లు భత్కల్ చెప్పాడు. ఇరు దేశాల మధ్య తనతో పాటు మరో ఉగ్రవాది అసదుల్లా అక్తర్ తరచూ ప్రయాణించేవారమన్నాడు. తన సోదరులు ఇక్బాల్, రియాజ్ భత్కల్‌లు ఇండియాకు వచ్చేవారు కాదని, ఇక్బాల్ మాత్రం నేపాల్‌కు వచ్చే వాడనీ చెప్పాడు. అక్కడి నుంచి పాకిస్థాన్‌లోని వారితో శాటిలైట్ ఫోన్లద్వారా మాట్లాడేవారమన్నాడు.అంతేగాకుండా దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల కోసం బీహార్ యువకులను పెద్ద సంఖ్యలో ఇండియన్ ముజాహిదీన్‌లో చేర్చినట్లు భత్కల్ చెప్పారని సమాచారం.
 
అందుకే పాత సైకిళ్లు...
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు, 2010 పుణెలో జర్మన్ బేకరీ పేలుళ్లకూ సైకిళ్లనే ఉపయోగించినప్పటికీ.. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు భత్కల్ చెప్పినట్లు తెలిసింది. పుణె పేలుళ్లలో కొత్త సైకిళ్లను వాడటంతో ఛాసిన్ నంబరు ఆధారంగా వాటిని కొనుగోలు చేసినవారిని దర్యాప్తు అధికారులు గుర్తిం చారు. అందువల్ల దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు మాత్రం రెండూ పాత సైకిళ్లనే ఉపయోగించామన్నాడు. దిల్‌సుఖ్‌నగర్ పేలు ళ్ల తర్వాత అధికారులు రెండు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నప్పటికీ బాగా పాతవి కావడంతో అవి ఎక్కడివి? ఎవరు కొనుగోలుచేశారు? అనేవి గుర్తించలేకపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement