జైలులో నన్ను కొట్టారు: స్టాలిన్
చెన్నై: జైలులో తాను దెబ్బలు తిన్నానని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ఎమర్జెన్సీ రోజుల్లో తనకెదురైన చేదు అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు తనను చెన్నై సెంట్రల్ జైలులో పెట్టారని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి మురసోలి మారన్ తో పాటు 125 మంది డీఎంకే కార్యకర్తలను జైలులో వేశారని తెలిపారు. ఆ సమయంలో జైలు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు జీవితఖైదీలు తమను కొట్టేవారని గుర్తు చేసుకున్నారు.
తన చేతిపై ఉన్న గాయం గుర్తు ఆనాడు తమపై జరిగిన హింసాకాండకు సాక్ష్యమని డీఎంకే పత్రిక 'మురసోలి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అప్పటి డీఎంకే ఎంపీ చిట్టిబాబు జోక్యంతో తాము బతికి పోయామని తెలిపారు. జైలులో తిన్న దెబ్బల కారణంగానే తర్వాత చిట్టిబాబు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తాము ఏడాది జైలుశిక్ష అనుభవించామని, మూడు నెలల పాటు తమను హింసించారని స్టాలిన్ వెల్లడించారు.