
బిగ్‌బాస్: క్రిటిక్‌గా వెళ్లి సెలబ్రిటీగా వచ్చాను!
- బిగ్‌బాస్ నుంచి మహేశ్ కత్తి ఔట్.. నేడు మరొకరు కూడా..
ఆసక్తిగా సాగుతున్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో శనివారం ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర ఘట్టాలు చోటుచేసుకున్నాయి. ఈ షో నుంచి సినీ విమర్శకుడు మహేశ్ కత్తిని ఎలిమినేట్ చేస్తున్నట్టు హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించాడు. ఇక, హౌజ్ కొత్త కెప్టెన్ ఎన్నికైన శివబాలాజీ ఎలిమినేషన్ ప్రాసెస్ నుంచి తప్పించుకోగా.. ఇప్పటికే మిగతా సభ్యులైన హరితేజ, కల్పన, దీక్షాపంత్‌లపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. ఈ ముగ్గురిలో మరొకరిని కూడా ఎలిమినేట్ చేయబోతున్నట్టు ప్రకటించి ట్విస్టు ఇచ్చాడు ఎన్టీఆర్. ఈ వారం ఎలిమినేట్ అయ్యే మరో కంటెస్టెంట్ ఎవరనేది ఆదివారం ఎపిసోడ్‌లో తెలియనుంది. అంతేకాదు మరో సెలబ్రిటీ కూడా బిగ్‌బాస్ హౌజ్‌లోకి రాబోతున్నట్టు టీజర్ వదిలి ఆసక్తిని పెంచారు షో నిర్వాహకులు. హౌజ్‌లోకి రాబోతున్న కొత్త సెలబ్రిటీ ఎవరో నేడు తెలియనుంది.
ఇక త్వరలోనే తన బిగ్‌బాస్ అనుభవాలను పంచుకోనున్నట్టు ఫేస్‌బుక్‌లో ఫిలీం క్రిటిక్ మహేశ్ కత్తి వెల్లడించారు. 'జీవించదగ్గ కాల్పనిక వాస్తవం-బిగ్ బాస్. నేను బయటికి వచ్చాను. చాలా అనుభవంతో. చాలా ఆలోచనలతో. త్వరలో పంచుకుంటాను. "వాస్తవానికి నిజానికీ మధ్య...50 లక్షలాట"' అంటూ ఆయన కామెంట్ పెట్టారు. ఫిలిం క్రిటిక్‌గా బిగ్‌బాస్ హౌజ్‌లోకి ప్రవేశించిన తాను సెలబ్రిటీగా బయటకు వచ్చినట్టు కనిపిస్తున్నదని, ఎయిర్‌పోర్టు వద్ద ఎంతోమంది సెల్ఫీలు కావాలంటూ తనను కోరారని, ఇది తనకు ఎప్పుడూ జరగలేదని మహేశ్ కత్తి ఫేస్‌బుక్‌లో తెలిపారు.