అమ్మను చంపి.. ఐఏఎఫ్ అధికారి ఆత్మహత్య
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. భారత వైమానిక దళంలో పనిచేసే ఓ అధికారి అనారోగ్యంతో బాధపడుతున్న కన్నతల్లిని పీకపిసికి చంపేసి.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పై నుంచి దూకి కింద పడి ఉన్న అతడిని ఇరుగుపొరుగులు గమనించి ఆస్పత్రిలో చేరచగా అక్కడ తీవ్ర గాయాలతో మరణించాడు. జగదేవ్ సింగ్ యాదవ్ (38) జోధ్‌పూర్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో జూనియర్ వారంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అతడు తన తల్లి సంతరా దేవి (70)తో కలిసి ఉంటున్నాడు. ఆమె చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
అతడొక్కడే తల్లిని చూసుకుంటుండగా, అతడి భార్య, పిల్లలు బెంగళూరులో ఉంటున్నారు. ఏమైందో తెలియదు గానీ, ఇంటిపై నుంచి దూకేసిన అతడికి చాలా ఫ్రాక్చర్లు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అతడి మరణవార్తను తల్లికి చెబుదామని ఇంటికి వెళ్తే.. అక్కడ ఆమె మంచం మీద చనిపోయి పడి ఉన్నట్లు పొరుగువారు చెప్పారు. ఆమె మంచం పక్కనే కంప్యూటర్ కేబుల్ పడి ఉందని, దాంతోనే అతడు తల్లిని చంపేసి ఉంటాడని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒంటరితనానికి తోడు తల్లి అనారోగ్యం చూసి తట్టుకోలేకనే అతడు ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని అంటున్నారు.