న్యూఢిల్లీ: ‘ఇద్దరం అఖిల భారత సర్వీసు అధికారులమే.. కానీ వేతనాల్లో, పదోన్నతుల్లో వివక్ష ఎందుకు?’ అంటూ ఐఏఎస్‌యేతర అధికారులు గళమెత్తుతున్నారు. తమకూ ఐఏఎస్‌లతో సమానంగా వేతనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఇది హాట్‌టాపిక్‌గా మారింది. ఐఏఎస్‌లూ వెనక్కి తగ్గడం లేదు. తమ ప్రతిభ, పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఉండాల్సిందేనంటున్నారు. ఇప్పుడున్న విధానాన్నే కొనసాగించాలని, తమను మిగతా సర్వీసు అధికారులతో సమానంగా పరిగణించ రాదంటూ 200 మంది ఐఏఎస్ అధికారుల బృందం సిబ్బంది వ్యవహారాల శాఖకు లేఖ రాసింది. జాయింట్ సెక్రటరీ పోస్టును ఐఏఎస్ అధికారులు కేవలం 11 ఏళ్ల అనుభవంతో పొందుతారు. కానీ ఓ ఐఆర్‌ఎస్ అధికారికి ఆ పోస్టు దక్కాలంటే 13 ఏళ్లు ఎదురుచూడాల్సిందే.