![ఇండో-పాక్ వార్ వన్‌సైడే: చికాగో బాబాయ్](/styles/webp/s3/article_images/2017/09/5/71496118609_625x300.jpg.webp?itok=LPM3EscI)
ఇండో-పాక్ వార్ వన్‌సైడే: చికాగో బాబాయ్
రియాద్: ఇండియా- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా స్టాండ్స్‌లో అతను ఉండాల్సిందే. తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో నెలవంక గుర్తుండే పాక్ జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ ఆయన చేసే సందడి మ్యాచ్‌కు అదనపు ఆకర్షణ. దాయాదిపై పోరులో పాక్ ఆటగాళ్లను ఉత్తేజపరుస్తూ.. తెల్లగడ్డంతో చిరునవ్వులు చిందించే మొహమ్మద్ బషీర్ అలియాస్ చాచా చికాగో(చికాగో బాబాయ్) తాజా ప్రకటన సంచలనంగా మారింది. పాక్ వీరాభిమానిగా పేరుతెచ్చుకున్న ఆయన.. ఇండియాకు వత్తాకు పలకండం పాకిస్థానీ క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రస్తుత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాంగంగా బర్మింగ్‌హోమ్‌లో జూన్ 4న జరగనున్న ఇండో-పాక్ మ్యాచ్ ఫలితాన్ని బషీర్ ముందే చెప్పేశాడు. ‘వార్ వన్ సైడే! ధోనీ, కోహ్లీ, యువరాజ్ లాంటి ఉద్ధండుల్ని ఢీకొట్టే సత్తా పాకిస్థాన్‌కు లేదు’ అని తేల్చిచెప్పాడు. కుటుంబంతో కలిసి మక్కా పర్యటనలో ఉన్న తాను.. జూన్ 4నాటి మ్యాచ్‌కు హాజరుకాబోనని చెప్పాడు. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన మొహమ్మద్ బషీర్.. అమెరికాలోని చికాగోలో రెస్టారెంట్ యజమానిగా స్థిరపడ్డారు. 2011 నుంచి ఇండియా-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన అన్ని మ్యాచ్‌లకు హాజరైన ఆయన తనదైన శైలిలో సందడిచేస్తూ ఇరుదేశాల ప్రేమాభిమానాలను పొందాడు
‘నిన్ననే సుధీర్ చౌదరీ(సచిన్ వీరాభిమాని) ఫోన్ చేసి ‘మ్యాచ్‌కు వస్తున్నావా?’ అని అడిగాడు. పరిస్థితి వివరించి రావడంలేదని చెప్పా. అయినా ఇండో-పాక్ మ్యాచ్ అంటే ఒకప్పుడున్నంత మజా ఇప్పుడు లేదు. పాక్ టీమ్ క్రమంగా బలహీనపడింది. అదే సమయంలో టీమిండియా బలపడింది. ఇండియాను ఢీకొట్టే సత్తా మావాళ్లకులేదు’ అని బషీర్ అన్నారు.
సౌదీ అరేబియాలో ఫుట్‌బాల్ హవా ఉంటుందని, క్రికెట్ మ్యాచ్‌లు కూడా ప్రసారం కావని బషీర్ చెప్పారు. ‘బర్మింగ్‌హోమ్ వెళ్లలేకపోయినా మ్యాచ్‌ను చూడకుండా ఉండలేను. ఇక్కడ(సౌదీలో) క్రికెట్ మ్యాచ్‌లు ప్రసారంకావు. కాబట్టి ఇంటర్నెట్‌లో చూస్తా’ అన్నారు బషీర్ అలియాస్ చికాగో చాచా. అన్నట్లు చాచా.. ఎమ్మెస్ ధోనీకి కూడా వీరాభిమానే.