క్రికెట్ వరల్డ్ కప్: భారత్ దూకుడు..
- మహిళల ప్రపంచకప్‌లో శ్రీలంకను ఓడించిన టీమిండియా
- వరుసగా నాలుగు విజయాలతో మిథాలి సేన దూడుకు
డెర్బీ: ఐసీసీ మహిళల ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా వరుసగా నాలుగో విజయం సాధించింది. బుధవారం డెర్బీలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 16 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ విసిరిన 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడిన లంక.. 47.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 216 పరుగులు మాత్రమే చేసింది.
శ్రీలంక బ్యాటింగ్ విమన్స్‌లో సురాంగిక 61(75 బంతుల్లో), సిరివర్ధనే37(63 బంతుల్లో) తప్ప మిగతావారంతా అవసరమైన మేరకు రాణించలేదు. ఓపెనర్ హన్సిక 29, జయాంగని 25, వీరక్కోడి 21 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా, బిస్త్, శర్మలు చెరో వికెట్ నేలకూల్చారు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 232 పరుగులు సాధించింది. భారత్ బ్యాటింగ్ ఉమెన్ లో దీప్తీ శర్మ(78), కెప్టెన్ మిథాలీ రాజ్ (53)లు రాణించారు. ఇక చివర్లో వేద కృష్ణమూర్తి(29), హర్మన్ ప్రీత్ కౌర్(20) లు దాటిగా ఆడటంతో భారత్ 200 పై చిలుకు పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో శ్రీపాలి విరొక్కడే 3 వికెట్లు తీయగా రణవీర(2), కాంచన, గుణరత్నే చెరో వికెట్ పడగొట్టారు.
తర్వాతి మ్యాచ్ సౌతాఫ్రికాతో..
వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌లో దిగ్గజ సౌతాఫ్రికా జట్టుతో తలపడనుంది. జులై 8న (శనివారం) లీసెస్టర్ వేదికగా భారత్-సఫారీలు పోటీపడనున్నాయి.
పాకిస్తాన్ మళ్లీ ఢమాల్
గత మ్యాచ్‌లో టీమిండియా చేతిలో చిత్తైన పాకిస్తాన్ బుధవారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారీ తేడాతో ఓటమిపాలైంది. పాక్‌పై ఆసీస్ 159 పరుగుల తేడాతో విజయం సాధించింది.