వరల్డ్‌ కప్‌ మిస్‌.. విజేత ఇంగ్లండ్‌ | icc womens world cup, england wins the trophy | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ కప్‌ మిస్‌.. విజేత ఇంగ్లండ్‌

Published Sun, Jul 23 2017 10:31 PM | Last Updated on Tue, Sep 19 2017 1:15 PM

వరల్డ్‌ కప్‌ మిస్‌.. విజేత ఇంగ్లండ్‌

వరల్డ్‌ కప్‌ మిస్‌.. విజేత ఇంగ్లండ్‌

- ఫైనల్స్‌లో 9 పరుగుల తేడాతో ఇండియా ఓటమి
- నాలుగోసారి ప్రపంచ విజేతగా ఇంగ్లండ్‌
- భారత మహిళకు అభినందనల వెల్లువ

లండన్‌:
బ్రిటిష్‌ గడ్డపై జయకేతనం ఎగరేయాలనుకున్న భారత్‌ తృటిలో అవకాశాన్ని చేజార్చుకుంది. మహిళల వన్డే వరల్డ్ కప్‌ ట్రోఫీని ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు చేజిక్కించుకుంది.

‘క్రికెట్‌ మక్కా’  లార్డ్స్‌ వేదికగా ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌ పోరులో టీమిండియాపై ఇంగ్లండ్‌ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్రిటీష్‌ జట్టు విసిరిన 229 పరుగులను ఛేధించేక్రమంలో ఇండియా 48.4 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్‌ ప్రపంచ విజేత కావడం ఇది నాలుగోసారి కావడం విశేషం. కప్‌ గెలవలేకపోయినా సిరీస్‌ ఆద్యంతం అద్భుతంగా ఆడిన భారత మహిళలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఊరించి.. ఉసూరుమనిపించారు
229 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా పూర్తిచేయగలదనిపించిన ఇండియా ఆఖరి ఓవర్లలో ఉసూరుమనిపించింది. 86 పరుగులతో వీరవిహారం చేసిన ఓపెనర్‌ రౌత్‌ 4వ వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత టీమిండియా పేకమేడలా కూలిపోయింది. మరో ఓపెనర్‌ మంధనా డకౌట్‌ కాగా, కెప్టెన్‌ మిథాలీ 17 పరుగులు మాత్రమే చేసింది. సెమీస్‌లో రికార్డు స్కోరు సాధించిన హర్మీత్‌ కౌర్‌ (51), ఐదో స్థానంలో వచ్చిన కృష్ణమూర్తి (35)లు తమ వంతు పరుగులు చేశారు. అయితే లోయర్‌ మిడిలార్డర్‌ దారుణంగా విఫలం చెందడం, టెయిలెండర్లు నిమిషాల్లోనే పెవిలియన్‌కు దారిపట్టడంతో ఇండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ ష్రబ్‌షోల్‌ ఏకంగా 6 వికెట్లు పగడొట్టి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మరో బౌలర్‌ హార్ట్లే 2 వికెట్లు సాధించింది.

 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ను భారత్ కట్టడి చేసి సాధారణ స్కోరుకే పరిమితం చేసింది. ఇంగ్లండ్ క్రికెటర్లలో ఓపెనర్లు విన్ ఫీల్డ్డ్(24), బీమాంట్(23)లు ఫర్వాలేదనిపించగా, సారా టేలర్(45), స్కీవర్(51)లు రాణించారు.  చివర్లో బ్రంట్(34), జెన్నీ గన్(25 నాటౌట్)లు బాధ్యతాయుతంగా ఆడటంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 228 పరుగులు చేసింది. భారత బౌలర్లలో గోస్వామి మూడు వికెట్లు సాధించగా, పూనమ్ యాదవ్ రెండు వికెట్లు లభించాయి. ఇక గైక్వాడ్ ఒక వికెట్ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement