![మంచు తుపానుకు అమెరికా విలవిల - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/81392352598_625x300.jpg.webp?itok=JYFHNbAw)
మంచు తుపానుకు అమెరికా విలవిల
*20 రాష్ట్రాల్లో హిమపాతం ప్రభావం
* 8 లక్షల ఇళ్లలో అంధకారం
వాషింగ్టన్: అమెరికాను మంచు తుపాను మళ్లీ ముంచెత్తింది. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. అలబామా రాష్ట్రం నుంచి వర్జీనియా రాష్ట్రం వరకూ సుమారు 20 రాష్ట్రాల్లో మంచు ప్రభావం కనిపించింది. ముఖ్యంగా వాషింగ్టన్‌లో గురువారం భారీగా కురిసిన హిమపాతంతో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. వాషింగ్టన్‌లోని పలు ప్రాంతాల్లో 11 అంగుళాల మేర మంచు కురిసింది. గ్రిడ్ వైఫల్యం కారణంగా 8 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వాషింగ్టన్‌లోని చాలా చోట్ల అంధకారం నెలకొంది. దేశవ్యాప్తంగా 5000కుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఒక్క అట్లాంటాలోని హార్ట్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోనే సగానికిపైగా సర్వీసులు నిలిచిపోయాయి.
ఈశాన్య ప్రాంతమైన న్యూ ఇంగ్లండ్‌లో 18 అంగుళాల మేర మంచు కురిసింది. హిమపాతం కారణంగా ఉత్తర కరోలినా రాష్ట్రంలో చాలా చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. తుపాను ప్రభావం తగ్గే వరకూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దొని ఉత్తర కరోలినా గవర్నర్ ప్యాట్ మెక్‌క్రోరీ కోరారు. న్యూయార్క్, న్యూజెర్సీలను కూడా మంచు తుపాను తాకనుండటంతో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని వాతావరణ కేంద్రం సూచించింది. మంచు తుపానుకు ఇప్పటివరకూ 11 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటికే వరదలతో అతలాకుతలమైన బ్రిటన్‌లో గురువారం పెను గాలులు బీభత్సం సృష్టించాయి.