నోట్ల రద్దు: కంపెనీలపై భారీగానే ఎఫెక్ట్!
Published Tue, Nov 15 2016 6:57 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం, మూడో క్వార్టర్ లాభాలపై భారీ గండి కొట్టనుందని తెలుస్తోంది. ముఖ్యంగా రిటైల్ ట్రేడ్లో భాగమై ఉన్న కార్పొరేట్లకు ఇది పెద్ద చేదుగానే మిగలనుందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ) మంగళవారం వెల్లడించింది. రిటైల్ ట్రేడ్లో భాగమై ఉన్న కొన్ని కంపెనీలు ఈ నవంబర్లో భారీగానే ప్రభావితం కానున్నాయని, దీనిలో ఎలాంటి సందేహం లేదని సీఐఐ ప్రెసిడెంట్ నౌషాద్ ఫోర్బ్స్ అభిప్రాయం వ్యక్తంచేశారు. వెంటనే చాలినంత నగదు చలామణిలోకి వస్తే, ఈ సమస్య నుంచి త్వరగా బయటపడే అవకాశాలుంటాయని తెలిపారు. ఒకవేళ ప్రస్తుతం నెలకొన్న నగదు లేమి, వచ్చే నెలలో కూడా ఇలానే కొనసాగితే, మూడో త్రైమాసిక ఫలితాలపై భారీగా ఎఫెక్ట్ చూపనున్నట్టు ఆందోళన వ్యక్తంచేశారు.
వ్యాపారాలకు తగినంత నగదు అందుబాటులో ఉండేలా కరెంట్ అకౌంట్స్ నుంచి వారానికి విత్డ్రా చేసుకునే పరిమితిని రూ.50వేల నుంచి పెంచాలని నౌషాద్ కేంద్రానికి విన్నపించుకున్నారు. లేకపోతే చాలామంది ప్రజలకు ఇది తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు వేతనాలు చెల్లించడానికి , వివిధ ఖర్చులను భరించడానికి వారు కరెంట్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకునే పరిమితిని వారానికి రూ.50వేలకు ప్రభుత్వం పెంచింది. కాగ, మూడు నెలల ముందే వారు ఈ ఖాతాను తెరిచి ఉండాలని ప్రభుత్వం తెలిపింది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య సరియైనదిగా తాము భావిస్తున్నామని, కానీ స్వల్పకాలికంగా ప్రజలు తీవ్ర అసౌకర్యాలు భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
Advertisement