న్యూఢిల్లీ: బొగ్గు గనుల కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఈ కేసులో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను ప్రశ్నించాలని భావిస్తే.. అందుకు లాంఛనంగా కోరవచ్చని.. ప్రధాని సీబీఐకి అందుబాటులోకి వస్తారని కేంద్రమంత్రి కమల్‌నాథ్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం సీఎన్‌ఎన్-ఐబీఎన్ చానల్‌లోని డెవిల్స్ అడ్వొకేట్ కార్యక్రమంలో కరణ్‌థాపర్ అడిగిన ప్రశ్నకు పైవిధంగా బదులిచ్చారు. ‘సీబీఐ చట్టం పరిధిలో ఎవరినైనా ప్రశ్నించవచ్చు. ప్రధాని చట్టం పరిధిలోనే ఉన్నారు. ఆయనను ప్రశ్నించాలని సీబీఐ భావిస్తే.. ప్రధాని అందుబాటులోకి వస్తారు’ అని కమల్‌నాథ్ వ్యాఖ్యానించారు. బొగ్గు గనుల కేటాయింపుల విషయంలో ప్రధాని దాచిపెట్టటానికి ఏమీ లేదన్నారు.
బొగ్గు శాఖలో పలు ఫైళ్ల అదృశ్యం విషయంలో ప్రధానిని కేంద్ర మంత్రి గట్టిగా సమర్థించారు. కనిపించకుండా పోయిన ఫైళ్లలో తప్పులేమీ లేవన్నారు. ఫైళ్లు దొరకవన్న నిర్ధారణ జరిగిన తర్వాతే అవి అదృశ్యమయ్యాయని చెప్పొచ్చన్నారు. కనిపించకుండాపోయిన ఫైళ్లలో ఆ తర్వాత కొన్ని ఫైళ్లు దొరికాయని, మున్ముందు ఇంకా దొరుకుతాయన్నారు. సీబీఐ దర్యాప్తును ప్రభుత్వం అడ్డుకుంటోందనే భావనను మీడియానే సృష్టించిందని నిందించారు. ప్రధానికి నాయకత్వ గుణాలు లేవనే అభిప్రాయాన్నీ మీడియానే సృష్టించిందన్నారు. సమాచార హక్కు చట్టం పరిధి నుంచి పార్టీలను మినహాయించేందుకు ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరిస్తుందని, ఈ బిల్లును స్థాయీ సంఘానికి పంపినట్లు కమల్‌నాథ్ చెప్పారు.
సీబీఐ కోరితే ప్రధాని రెడీ
Published Mon, Sep 9 2013 2:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
Advertisement
Advertisement