రైలు మిస్సయితే.. సొమ్ము రాదు
నిబంధనలను మార్చిన రైల్వేబోర్డు
మార్చి 1 నుంచే అమలు
న్యూఢిల్లీ: రైలు ప్రయాణానికి టికెట్లు రిజర్వు చేసుకున్న ప్రయాణికులు.. సమయానికి రైలు ఎక్కకపోతే ఇక వారు ఆ టికెట్ సొమ్మును వదులుకోవాల్సిందే! ఇప్పటివరకూ రైలు వెళ్లిపోయిన రెండు గంటల లోపు వరకూ ప్రయాణికులు తమ టికెట్‌ను రద్దు చేసుకునే అవకాశం ఉంది. ఇలా రద్దు చేసుకుంటే టికెట్ సొమ్ములో సగం (50 శాతం) తిరిగి ఇచ్చేవారు. కానీ.. ఇకపై ఈ వెసులుబాటును రద్దుచేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అంటే.. రైలు బయల్దేరిన తర్వాత టికెట్లు రద్దు చేసుకోవటానికి వీలుండదు. అలాగే.. ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది ఒక బృందంగా ప్రయాణానికి టికెట్లు తీసుకున్నపుడు.. వారిలో ఎవరైనా చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నా కూడా అలాంటి వారి టికెట్లను రద్దు చేయటం కూడా కుదరదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధనలను మార్చి 1 నుంచి అమలు చేయాలని రైల్వే బోర్డు దేశ వ్యాప్తంగా సర్క్యులర్లు జారీచేసింది.
బీహార్‌లో ఎల్‌జేపీకి ఏకైక ఎమ్మెల్యే గుడ్‌బై
పాట్నా: లోక్‌సభ ఎన్నికల్లో ఎల్‌జేపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చన్న సంకేతాల నేపథ్యంలో బీహార్ అసెంబ్లీలో ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే జకీర్ హుస్సేన్‌ఖాన్ బుధవారం తన పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మతతత్వ బీజేపీతో పొత్తుకు ఎల్‌జేపీ సిద్ధమవుతున్నందుకు నిరసనగానే ఈ చర్య చేపట్టినట్లు చెప్పారు.