లండన్: బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) విద్యారంగంలో భారత ప్రతిష్ఠను అంతర్జాతీయంగా చాటింది. ఇంజినీరింగ్, టెక్నాలజీ విద్యలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 100 యూనివర్సిటీల్లో ఐఐఎస్సీ చోటు సపాందించింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎచ్‌ఈ) ర్యాంకింగ్స్ ఫర్ ఇంజినీరింగ్, టెక్నాలజీ జాబితాలో ఐఐఎస్సీ 99వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికా విశ్వవిద్యాలయాలే అత్యధికంగా చోటు సంపాదించాయి. అమెరికాకు చెందిన స్టాన్‌ఫర్డ్, కాల్‌టెక్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొదటి మూడు ర్యాంకులు సాధించాయి. దేశంలో పేరొందిన ఐఐటీలకు కూడా ఇటీవల అంతర్జాతీయ విశ్వవిద్యాలయ ర్యాంకులు పెద్దగా రాని విషయం తెలిసిందే.
'ఈ ఏడాది విజయగాథ భారత్‌దే అవుతుంది. ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్, టెక్నాలజీ ర్యాంకింగ్స్‌లో తొలిసారి భారత యూనివర్సిటీ చోటు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని అత్యుత్తమ యూనివర్సిటీలకే ఈ ర్యాంకింగ్ లభిస్తుంది' అని టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎచ్‌ఈ) వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్ ఎడిటర్ ఫిల్ బాటీ తెలిపారు. 'హైటెక్ రంగాలైన ఐటీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ సెక్టర్లతోపాటు, సంప్రదాయ రంగమైన ఉక్కు ఉత్పత్తిలోనూ భారత ఇంజినీరింగ్, సాంకేతిక శక్తిని ప్రపంచానికి చాటుతూనే ఉంది. అదేవిధంగా భారత్‌కు చెందిన కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, టాటా, మిట్టల్ కంపెనీలతోపాటు భారతీయులు నడిపిస్తున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు ప్రపంచానికి భారత శక్తిని చాటుతున్నాయి' అని ఆయన చెప్పారు.
టాప్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఐఐఎస్సీ!
Published Thu, Nov 12 2015 6:44 PM | Last Updated on Sun, Sep 3 2017 12:23 PM
Advertisement
Advertisement