engineering and technology
-
వాడిన విరులూ పరిమళిస్తాయి
అమ్ముడుపోని పూలు ఏమవుతాయి? కొనేవాళ్ల కోసం ఎదురు చూసే సహనం పూలమ్మాయికి ఉంటుంది, కానీ పూలకు ఉండదు. రెక్కలు విచ్చుకోవడం, ఆ రెక్కలు వాలిపోవడంలో అవి వాటి సమయాన్ని క్రమం తప్పనివ్వవు. మార్పుకు నాంది పూలసాగు రైతుల జీవితాలను సువాసనభరితం చేస్తోందా? మొక్కనాటి, నీరు పెట్టి, ఎరువు వేసి పెంచిన మొక్కలు మొగ్గతొడిగితే ఆనందం. ఆ మొగ్గలు విచ్చేలోపు కోసి మార్కెట్‌కు చేర్చాలి. తెల్లారేటప్పటికి నగరంలోని మార్కెట్‌కు చేరాలంటే పూలను కోసే పని అర్ధరాత్రి నుంచి మొదలవ్వాలి. ఆ సమయంలో ΄పొలంలో పనికి వచ్చే వాళ్లు ఉండరు. వచ్చినా రెండింతల కూలి ఇవ్వాలి. సాగు ఖర్చులు, రవాణా ఖర్చులు, తన శ్రమ కలిపి ధర నిర్ణయించుకోవాలి. చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. మార్కెట్లో పూలు ఎక్కువై΄ోయి డిమాండ్ తగ్గిన రోజుల్లో పూలు కోయడానికిచ్చే కూలి కూడా గిట్టదని ఆ పూలను చెట్లకే వదిలేస్తుంటారు. ఇంజనీరింగ్ టెక్నాలజీతో పరిమళాలను మట్టిపాలు కాకుండా కాపాడుతున్నారు కేజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ సంయుక్త. తక్కువ ఖర్చులో ఆటోమేటిక్ ఇన్సెన్స్ మేకింగ్ మెషీన్‌కు రూపకల్పన చేశారామె. ఇంజనీర్ సమాజంలో మార్పు తీసుకువచ్చే చేంజ్‌మేకర్ కావాలనే ఆశయాన్ని ఆచరణలో పెట్టారామె. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో పరిశోధన చేస్తున్న సంయుక్త పర్యావరణహితమైన ఆవిష్కరణ కోసం గ్రామాల బాట పట్టారు. ఈ మెషీన్ రూపకల్పనకు దారి తీసిన కారణాలను సాక్షితో పంచుకున్నారామె.మహిళలతో ముందడుగు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను ‘‘2020లో స్థాపించాం. సమాజంలో అవసరమైన ఇంజనీరింగ్ ఆవిష్కరణల గురించి అధ్యయనం చేయడానికి 72 గ్రామాల్లో పర్యటించాం. మహిళలు, మగవాళ్లు, రైతులు, ఇతర వృత్తుల్లోని వారు, పిల్లలు, వృద్ధులు... ఇలా అన్ని కేటగిరీల వ్యక్తులతో మాట్లాడాం. అక్కడి సమస్యలు తెలిశాయి, అవసరాలు అర్థమయ్యాయి. వాటిని పరిష్కరించడానికి ఏం చేయాలనే స్పష్టత కూడా వచ్చింది. అన్నింటినీ మేం పరిష్కరించలేం, ప్రభుత్వాలు మాత్రమే చేయగలిగిన వాటిని వదిలేసి, మా స్థాయిలో పరిష్కరించగలిగే పన్నెండు ప్రాజెక్టుల జాబితా తయారు చేసుకున్నాం. వాటిలో మొదటిది అగరువత్తి తయారీ యంత్రం. అప్పటికి మార్కెట్లో ఉన్న అగరువత్తి మేకింగ్ మెషీన్ల ధర నాలుగైదు లక్షల్లో ఉంది. మేము అరవై వేలలో తయారు చేశాం. రైతుల దగ్గర వృథా అయ్యే పూలు, ఆలయాల దగ్గర అమ్ముడు కానివి, దేవునికి పెట్టి తీసిన పూలను సేకరించి అగరువత్తి, సాంబ్రాణి కడ్డీలు తయారు చేస్తున్నాం. స్థానిక మహిళలకు శిక్షణనిచ్చాం. వారే స్వయంగా నిర్వహించుకుంటున్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు వస్తే శిక్షణనిచ్చి, వాళ్లకు తగినట్లు మెషీన్ తయారు చేసిస్తాం’’ అన్నారు ్ర΄పొఫెసర్ సంయుక్త.తయారీ ఇలాగ...సేకరించిన పూల నుంచి రెక్కలను వేరు చేసి ఉప్పు నీటిలో కడిగి ఓ గంటసేపు ఎండలో పెడతారు. ఆ పూలను ΄పొడి చేస్తారు. పది కేజీల పూల నుంచి కేజీ ΄పొడి వస్తుంది. ఆటోమేటిక్ మెషీన్ కాబట్టి మెటీరియల్ పెట్టి సెట్ చేసి ఆ మహిళలు మరొక పని చేసుకోవచ్చు. గంటకు అగరువత్తులు 900, సాంబ్రాణి కడ్డీలైతే మూడు వందల వరకు చేయవచ్చు. రా మెటీరియల్ లభ్యత, మార్కెట్ అవసరాలను బట్టి ఇప్పుడు ఈ మహిళలు రోజుకో గంట పని చేస్తున్నారు. వర్షాకాలంలో పూలను ఎండబెట్టడం కష్టం, కాబట్టి ఆ రోజుల్లో గోమయం కడ్డీలను చేస్తారు. గ్రామాల్లో మహిళలు గోమయాన్ని వేసవిలో సేకరించి ఎండబెట్టి నిల్వ చేసి ఉంచుతారు. ఆసక్తి ఉన్న మహిళలు ఇంట్లోనే రోజుకో గంటసేపు పని చేసుకుని తాము ఉంటున్న అపార్ట్మెంట్, ఇరుగు΄పొరుగు ఇళ్లు, దగ్గరున్న ఆలయాలకు సప్లయ్ చేయవచ్చు. ఇందులో భారీ లాభాలను ఇప్పుడే ఆశించలేం. కానీ పర్యావరణహితమైన పని చేస్తున్నామనే సంతోషం ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యాపకంతో ఎకో వారియర్‌గా గుర్తింపు ΄పొందవచ్చు. – సంయుక్త, ఇన్సెన్స్ స్టిక్స్ మెషీన్ ఆవిష్కర్త -
ఇంజినీరింగ్ కాలేజీల ‘లీలలు’.. షోకాజ్ నోటీసులు జారీ!
అనంతపురం: ఇంజినీరింగ్ కళాశాలలు మాయ చేస్తున్నాయి. నిజనిర్ధారణ కమిటీ తనిఖీల్లో అధ్యాపకులు ద్విపాత్రాభినయం బయటపడింది. ఒక్కో అధ్యాపకుడి పేరు రెండు కళాశాలల్లో నమోదు కావడం నివ్వెరపరుస్తోంది. ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత ప్రమాణాలకు జేఎన్టీయూ (ఏ) యాజమాన్యం పెద్ద పీట వేస్తోంది. నిబంధనలు విస్మరిస్తూ, నామమాత్రంగా నడుపుతున్న కళాశాలలపై కన్నెర్ర చేస్తోంది. బోధన ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు తక్కువ అడ్మిషన్లతో నెట్టుకొస్తున్న 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు చేయడం యూనివర్సిటీ చరిత్రలో ప్రథమం. అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో వసతులు, విద్యార్థి – అధ్యాపక నిష్పత్తి, క్యాంపస్ పరిస్థితి, ఆటస్థలం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్ తదితర అంశాలను యూనివర్సిటీ ఏటా నిజనిర్ధారణ కమిటీల ద్వారా పరిశీలిస్తోంది. ఏ కళాశాలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే దానికి కమిటీ నివేదికే ప్రామాణికం. నివ్వెరపోయే వాస్తవాలు.. జేఎన్టీయూ అనంతపురం పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల గారడీని నిజనిర్ధారణ కమిటీ తమ పరిశీలనలో బహిర్గతం చేసింది. ఒకే కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుడి పేరు మరో ఇంజినీరింగ్ కళాశాలలోనూ నమోదైనట్లు గుర్తించింది. ఇలాంటివి 40 ఇంజినీరింగ్ కళాశాలల్లో బయటపడ్డాయి. ఒక అధ్యాపకుడు రెండు చోట్ల ఎలా పని చేస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆయా కళాశాలలకు షోకాజ్‌లు జారీ చేసింది. కొన్ని సబ్జెక్టుల్లో పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థుల కొరత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒకరి పేరునే రెండు, మూడు కళాశాలల్లో పనిచేస్తున్నట్లు ఆయా యాజమాన్యాలు చూపించాయి. మరో వైపు కొన్ని కళాశాలల్లో ఫ్యాకల్టీ నియమించుకోకుండా అర్హులైన అధ్యాపకుల పేర్లను మాత్రమే చూపించాయి. పది రోజుల్లో సరైన వివరణ ఇవ్వాలని షోకాజ్‌లో పేర్కొంది. -
పరిశోధన, ప్రయోగాల నిలయం ఏఎన్‌యూ
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని డాక్టర్ వైఎస్సార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యతోపాటు పరిశోధనలు, ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. పలు జాతీయ అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక కేంద్రాల్లో దేశ రక్షణ, సమాచార రంగాలతోపాటు సమాజ హిత పరిశోధనలు, ప్రయోగాలు కొనసాగిస్తోంది ఇక్కడ ఏర్పాటైన కొన్ని కేంద్రాల విశేషాలివీ.. మల్టీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రాడార్ సిమ్యులేటర్ ఈ ప్రాజెక్టును శ్రీహరికోటకు చెందిన షార్ ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కాలేజీకి అప్పగించింది. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశించజేసే సమయంలో ఉపగ్రహాల పార్ట్లు టార్గెట్ల వారీగా విడిపోయి భూమిమీద, సముద్రంలో ఏ ప్రాంతలో పడ్డాయనేది గుర్తించేందుకు ఇవి దోహదం చేస్తాయి. డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సీడీఎంఏ ట్రాన్స్ రిసీవర్ ఈ ప్రాజెక్టును డీఆర్డీఓ (డిఫెన్స్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కాలేజీకి అప్పగించింది. శత్రు దేశాలు మన దేశానికి సంబంధించిన రక్షణ, రహస్య సంభాషణలు ట్రాప్ చేయకుండా ఈ రిసీవర్ ప్రధానంగా ఉపయోగపడుతుంది. బిగ్ డేటా ఎనలిటిక్స్ సెంటర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సెంటర్లో సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఐఓటీ తదితర అంశాలపై పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆక్వా రైతులకు చెరువుల్లో వ్యర్థాల వల్ల తలెత్తే ఉష్ణ సాంద్రతను తెలియజేసే ప్రాజెక్టుతోపాటు గుడ్డి వాళ్ళు రోడ్డుపై నడిచేందుకు ఉపయోగపడే కళ్ళజోడును ఈ సెంటర్లో రూపొందించడం విశేషం. పలు సాంకేతిక అంశాలకు సంబంధించిన మరో నాలుగు ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఇక్కడి నుంచి రూసాకు పంపారు. శాటిలైట్ డేటా ఎనాలసిస్ అండ్ అప్లికేషన్ సెంటర్ ఇస్రో సహకారంతో 2014లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇస్రో(ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) సంస్థ మన దేశ సమాచార రంగంలో కీలకమైన ఐఆర్ఎన్ఎస్ఎస్ (ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్)కు సంబంధించిన, ఉపగ్రహాల హై ఫ్రీక్వెన్సీ స్ట్రక్చర్డ్ సిమ్యులేటర్ అనే ప్రత్యేక లైసెన్స్డ్ సాఫ్ట్‌వేర్‌పైనా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏఎన్‌యూలోనే అందుబాటులో ఉంది. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో త్రీడీ ఆటోమేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు ఫ్రాన్స్‌కు చెందిన దస్సాల్ట్ సంస్థతో ఉన్న ఎంఓయూలో భాగంగా ఏఎన్‌యూలో రూ.5 కోట్ల వ్యయంతో త్రీడీ ఆటోమేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఏపీలోని 62 ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు త్రీడీ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చేందుకు ఏఎన్‌యూ రాష్ట్ర స్థాయి నోడల్ సెంటర్‌గా కూడా కొనసాగుతోంది. వీఎల్‌ఎస్‌ఐలో పేటెంట్ స్థాయి పరిశోధనలు ఇంజినీరింగ్ కళాశాలలోని వీఎల్ఎస్ఐ(వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ ఎక్స్‌లెన్సీ సెంటర్)ను ఇన్టెల్ సాఫ్ట్వేర్ సంస్థ సహకారంతో ఏఎన్‌యూలో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో జరిగిన పరిశోధననలకు పేటెంట్ కూడా లభించింది. ఈ సెంటర్‌కు సుమారు ఐదు కోట్ల రూపాయల విలువైన సాఫ్ట్వేర్, పరికరాలను ఓ కంప్యూటర్ రంగ సంస్థ ఉచితంగా అందజేసింది. -
ఇంజనీరింగ్ అద్భుతం.. భారత్‌లోనే తొలి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్
న్యూఢిల్లీ: భారత్‌లోనే తొలి వర్టికల్ లిఫ్ట్ పంబన్ బ్రిడ్జ్ మార్చి 2022 నాటికి వినియోగంలోకి వస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ పేర్కొన్నారు. అరేబియన్ సముద్రంలో రామేశ్వర ద్వీపంలోని ప్రధాన భూభాగానికి అనుసంధానిస్తూ దాదాపు 2 కి.మీటర్ల పొడవైన రైల్వే వంతెనను ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ఉన్న 104 ఏళ్ల నాటి వంతెన స్థానంలో ఈ సరికొత్త టెక్నాలజీతో కూడిన పైకి లెగిసే వంతెనను ఏర్పాటు చేశారు. ఇది ఏవైనా చిన్నచిన్న షిప్‌లు వచ్చినప్పుడూ ఆటోమేటిక్‌గా ఆ వంతెన పైకి లెగిసి వాటికి దారి ఇస్తుంది. ఈ క్రమంలో రైల్వే శాఖ మంత్రి కూ యాప్‌లో కొత్త పంబన్ వంతెన ఫోటోలు షేర్ చేశారు. అంతేకాదు ఇది ఇంజనీరింగ్ అద్భుతం అని "ఈ డ్యూయల్-ట్రాక్ అత్యాధునిక వంతెన దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెనగా నిలుస్తుందన్నారు. -
బాబోయ్ ఇంజనీరింగ్ మాకొద్దు..
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే యమ క్రేజ్. ఇలా చేరడం, అలా పూర్తి చేయడం, ఉద్యోగం తెచ్చుకోవడం అన్నట్టుగా పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంజనీరింగ్ విద్య పట్ల విద్యార్థుల్లో మోజు తగ్గుతోంది. ఏ ఐఐటీలోనో, ఎన్ఐటీలోనో... లేదంటే పేరున్న కాలేజీలోనో ఇంజనీరింగ్ చేస్తే ఓకే. లేకుంటే పెద్దగా ఉపయోగం లేదని విద్యార్థులు భావిస్తున్నారు. ముఖ్యంగా కంప్యూటర్ ఆధారిత కోర్సులు మినహా ఇతర వాటి జోలికెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఇక సివిల్, మెకానికల్ అంటేనే చాలామంది ఊహూ అంటున్నారు. ప్రత్యామ్నాయంగా బీబీఏ, ఎంబీఏ వంటి మేనేజ్మెంట్ కోర్సుల వైపు దృష్టి పెడుతున్నారు. దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ ఇంజనీరింగ్ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. చాలావరకు కాలేజీలు మూతపడుతున్నాయి. ఉన్న కాలేజీల్లోనూ డిమాండ్ ఉన్న బ్రాంచ్‌లనే నిర్వహిస్తున్నారు. ఫలితంగా తెలంగాణ సహా జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ సంఖ్య ఏటా పడిపోతోంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గణాంకాలే ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. సీట్లు భర్తీ అయ్యే పరిస్థితే లేదు 2014–15లో దేశవ్యాప్తంగా 31.8 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉంటే.. 2021–22 నాటికి ఇవి 23.6 లక్షలకు తగ్గాయి. అంటే దాదాపు 8.2 లక్షల సీట్లు తగ్గిపోయాయి. మరోవైపు మేనేజ్మెంట్ కోర్సుల్లో సీట్లు ఐదేళ్ళ క్రితం 3.74 లక్షలుంటే.. ప్రస్తుతం ఇవి 4.04 లక్షలున్నాయి. చాలా కాలేజీలు ఇంజనీరింగ్ సీట్లను తగ్గించుకుంటూ, మేనేజ్మెంట్ కోర్సుల సీట్లు పెంచుకుంటున్నాయి. తెలంగాణలోనూ పేరున్న కాలేజీలు మినహా మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి దినదిన గండంగానే ఉంది. గడచిన ఏడేళ్ళుగా దాదాపు 74 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే 20 కాలేజీలు బంద్ అయ్యాయి. జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణం. కొన్ని కాలేజీలను జిల్లాల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు మార్చుకున్నారు. 2014లో నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్‌లో 250 వరకూ కాలేజీలు పాల్గొన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న కౌన్సెలింగ్‌లో ఈ జాబితా 175కు చేరడం గమనార్హం. తాజాగా మరో నాలుగు కాలేజీలు మూత వేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సులు పెంచుకుంటే తప్ప కాలేజీలు మనుగడ సాగించే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సివిల్, మెకానికల్ బ్రాంచ్‌లలో 2 వేల సీట్లు కోత పెట్టారు. కంప్యూటర్ ఆధారిత కోర్సులైన ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్ బ్రాంచీల్లో 1,800 సీట్లు పెంచారు. అయినా 80 శాతం కాలేజీల్లో అన్ని బ్రాంచీల్లో సీట్లు భర్తీ అయ్యే పరిస్థితి కన్పించడం లేదు. 46.82 శాతం మందికే ఉద్యోగాలు! దేశవ్యాప్తంగా ఏటా 20 లక్షల మందికిపైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకొస్తున్నారు. వీరిలో సీఎస్సీ, ఎలక్ట్రానిక్స్ వాళ్ళే 60 శాతం ఉంటున్నారు. వీరితో పాటు ఇతర బ్రాంచ్‌ల వారికి సంబంధిత ఉద్యోగాలు లభించడం లేదు. ఇతరత్రా సాధారణ ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంటోంది. సీఎస్సీ, ఎలక్ట్రానిక్స్ గ్రూపుల్లో ఎప్పటికప్పుడు సాంకేతికత మారుతోంది. దీన్ని అందుకోవడానికి కొత్త కోర్సులు చేయాలి. ఇది పూర్తయ్యేలోగా పోటీ మరింత పెరుగుతోంది. సివిల్, మెకానికల్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ వైపుకు మళ్ళడం కష్టంగా ఉంది. ఆ రంగంలోనూ పూర్తిస్థాయిలో ఉపాధి లభించడం లేదు. ఇండియా స్కిల్స్ తాజా నివేదికల ప్రకారం ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 46.82 శాతం మందికే ఉద్యోగాలొస్తున్నాయని తేలింది. మార్కెట్‌కు కావాల్సిన స్కిల్స్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కొరవడటమే ఉపాధి అవకాశాలు సన్నగిల్లడానికి కారణంగా పేర్కొంది. అయితే మేనేజ్మెంట్ కోర్సులైన బీబీఏ, ఎంబీఏ పూర్తి చేసిన వారిలోనూ 46.59 శాతమే ఉపాధి పొందుతున్నారని తెలిపింది. ఈ కోర్సుల్లోనూ నాణ్యత పెరగాల్సిన అవసరాన్ని నివేదిక స్పష్టం చేసింది. ఆదరణ కొరవడిన సివిల్, మెకానికల్.. పరిశ్రమల్లో ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ రాజ్యమేలుతోంది. సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్ అనుసంధానమై పనిచేస్తున్నాయి. సివిల్, మెకానికల్ కోర్సులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లేవనే అభిప్రాయం బలపడుతోంది. ఫలితంగా ఈ కోర్సుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తెలంగాణలో తాజాగా నిర్వహించిన కౌన్సెలింగ్‌లో సీఎస్సీలో 38,796 సీట్లు అందుబాటులో ఉంటే, 37,073 (95.56 శాతం) భర్తీ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్‌లో 13,935 సీట్లు ఉంటే, 12,308 (88.32 శాతం) భర్తీ అయ్యాయి. ఈఈఈ, సివిల్, మెకానికల్ బ్రాంచ్‌ల్లో తక్కువ సీట్లే ఉన్నా.. వాటిల్లోనూ భర్తీ 50 శాతం మించలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యను సంస్కరించాల్సిన అవసరం ఉందని విద్యా రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
‘టెక్’ చదువుల్లో పరిశోధన అంతంతే!
దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీలు 10,989 పరిశోధనా కేంద్రాలు ఉన్న కాలేజీలు 907 సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో పరిశోధనలు జరగడం లేదు. ఎలాంటి కొత్త ఆవిష్కరణలూ రావడం లేదు. రీసెర్చ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం మొత్తుకుంటున్నా కూడా.. కాలేజీలు ఉన్న సిలబస్‌నే బట్టీకొట్టిస్తూ నడిపించేస్తున్నాయి. ఏదో నామమాత్రంగా సాధారణ చదువులకే పరిమితం అవుతున్నాయి. దీంతో ఇంజనీరింగ్ చదువు పూర్తిచేస్తున్న చాలా మందికి ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా మొత్తం 10,989 ఇంజనీరింగ్ కాలేజీలుంటే అందులో కేవలం 907 కాలేజీల్లో (8.25 శాతం) మాత్రమే పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక స్టార్టప్ పాలసీని అమలు చేస్తున్న కాలేజీలు 17 శాతానికి మించి లేవు. ఇలాంటి పరిస్థితుల కారణంగానే ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల్లో 57 శాతం మందికి ఉద్యోగాలు లభించడం లేదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) తమ నివేదికలో వెల్లడించింది. కేవలం 43 శాతం మంది ఇంజనీరింగ్ విద్యార్థులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నట్టు పేర్కొంది. హాజరు మినహాయింపు.. పరిశోధన, స్టార్టప్‌లను ప్రోత్స హించడం ద్వారా విద్యార్థులు సొంతంగా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని, మెరుగైన ఉద్యోగావకాశాలైనా లభిస్తాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా చెబుతున్నాయి. కానీ దీనిని అందిపుచ్చుకోవడంలో విద్యా సంస్థలు విఫలం అవుతున్నాయి. తెలంగాణలో కూడా 5- 10 శాతం విద్యా సంస్థల్లోనే స్టార్టప్ పాలసీ అమలవుతోంది. స్టార్టప్‌లపై పనిచేసే విద్యార్థులకు 10 శాతానికిపైగా హాజరు మినహాయింపు ఇచ్చినా.. కాలేజీలు ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహించడంలో వెనుకబడే ఉన్నాయి. 2019–20లో దేశవ్యాప్తంగా 10,989 ఇంజనీరింగ్ కాలేజీలు కొనసాగగా.. ఇందులో స్టార్టప్‌లకు అవసరమైన సదుపాయాలు ఉన్నవి 2013 మాత్రమే. వీటిలోనూ 1,869 కాలేజీల్లో మాత్రమే స్టార్టప్ పాలసీ అమలవుతోంది. వీటన్నింటిలో కలిపి 6,021 స్టార్టప్‌లు కొనసాగుతున్నాయని ఏఐసీటీఈ గుర్తించింది. ఇక 907 కాలేజీల్లో (8.25 శాతం) మాత్రమే పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర సర్కారు చెబుతున్నా.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో పరిశోధనలు, స్టార్టప్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నా.. కాలేజీలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. పేరున్న టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో వెనుకబడే ఉన్నాయి. 5 -10 శాతం కాలేజీలు మినహా మిగతా ఇంజనీరింగ్ కాలేజీలన్నింటిలో 95 శాతం ఫ్యాకల్టీని కేవలం బోధనకే పరిమితం చేస్తున్నారు. పరిశోధనలు, స్టార్టప్‌లను ప్రోత్సహించాలంటే సమయంతోపాటు ఆర్థిక తోడ్పాటు కూడా అవసరం. ఆ దిశగా కాలేజీలు చర్యలు చేపట్టడం లేదు. మెజారిటీ విద్యార్థులు తమకు ఎన్నో ఆలోచనలు ఉన్నా ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నారు. 5 వేల స్టార్టప్‌లు లక్ష్యంగా పాలసీ రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్ పాలసీని తీసుకువచ్చినా.. ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహించడంలో కాలేజీలు వెనుకంజలో ఉన్నాయి. అయితే రాష్ట్రంలోని రాష్ట్ర విద్యా సంస్థలు కాకుండా జాతీయ స్థాయి సంస్థల్లో మాత్రం పరిశోధనలు, స్టార్టప్‌లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇక ఇంజనీరింగ్ విద్యా సంస్థలు మినహా మిగతా రంగాల్లోని ప్రైవేటు సంస్థలు పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇచ్చి ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేశాయి. జేఎన్టీయూ, ఉస్మానియా వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మాత్రం వీహబ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసింది. వాటి పరిధిలోని కాలేజీల విద్యార్థులు కొద్దిమంది మాత్రం తమ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ఇంక్యుబేటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యాసంస్థలు పరిశోధనలు, స్టార్టప్‌లకు ప్రాధాన్యం ఇవ్వకపోయినా.. రాష్ట్ర సర్కారు మాత్రం స్టార్టప్‌లను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు మంత్రి కేటీఆర్ చొరవతో 5 వేల స్టార్టప్‌లు లక్ష్యంగా రాష్ట్ర ఐటీ శాఖ కసరత్తు చేస్తోంది. -
‘సీఎస్ఈ’ టాప్
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్–2020 రెండో విడత కౌన్సెలింగ్‌లో 51 వేల మందికిపైగా విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. ఎక్కువ ఉపాధి అవకాశాలున్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)కే అధిక శాతం మంది మొగ్గు చూపారు. మొదటి ప్రాధాన్యత ఆప్షన్‌గా సీఎస్‌ఈనే నమోదు చేసుకున్నారు. తరువాత స్థానాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ కోర్సులకు ప్రాధాన్యతనిచ్చారు. తొలి విడతలో సీట్లు కేటాయింపు పొందిన వారు కూడా రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. తాము కోరుకున్న కాలేజీలో ఆశించిన కోర్సులో సీటు దక్కనివారు రెండో విడత కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 90 శాతం మంది కంప్యూటర్ సైన్సుకే మొదటి ఆప్షన్ ఇచ్చారు. నేడు సీట్ల కేటాయింపు ఏపీ ఎంసెట్–2020 పరీక్షలో 1,29,880 మంది అర్హత సాధించగా 91,090 మంది సర్టిఫికెట్ల పరిశీలనకు రిజిస్టర్ చేసుకున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 90,206 మంది అర్హులుగా తేలారు. వెబ్ ఆప్షన్ల నమోదుకు 85,295 మంది పాస్‌వర్డ్‌లను జనరేట్ చేసుకున్నారు. రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు చివరి తేదీ అయిన ఈనెల 23వ తేదీ రాత్రి వరకు 51,731 మంది వరకు ఆప్షన్లను నమోదు చేశారు. చివరి రోజు 14,243 మంది ఆప్షన్లను నమోదు చేసుకున్నారు. వీరికి సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత సీట్లు కేటాయించనున్నారు. మిగిలిన సీఎస్ఈ సీట్లు 1,372 వెబ్ ఆప్షన్లలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సుకే ప్రాధాన్యతనిస్తూ ఆప్షన్లు ఇచ్చారు. అయితే సీఎస్ఈ సీట్ల అందుబాటు అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో కలిపి సీఎస్ఈ సీట్ల సంఖ్య 22,672 కాగా మొదటి విడతలోనే 21,300 సీట్లు భర్తీ అయ్యాయి. కేవలం 1,372 సీట్లు మాత్రమే రెండో విడత కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా తొలి విడతలో సీట్లు పొంది వేర్వేరు కారణాలతో రద్దు అయిన కొన్ని సీట్లు కలవనున్నాయి. మిగులు సీట్లన్నీ ఇతర విభాగాల్లోనే.. మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే ప్రముఖ కాలేజీల్లోని సీఎస్ఈ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఎంసెట్–2020 ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లు 1,03,766 ఉండగా 72,867 సీట్లు మొదటి విడతలో భర్తీ అయ్యాయి. 30,899 సీట్లు రెండో విడతకు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ సైన్సు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ తదితర కోర్సుల సీట్లు 85 శాతానికి పైగా భర్తీ కాగా తక్కిన విభాగాల్లోని సీట్లే ఎక్కువగా మిగిలాయి. అవి కూడా ప్రైవేట్ కాలేజీల్లోని సీట్లే అధికంగా ఉన్నాయి. -
నైపుణ్యముంటే.. కొలువుకు కొదవలేదు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో విద్యనభ్యసించి నైపుణ్యం కనబరిచిన వారికి ఉద్యోగ అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాలను చూస్తే ఈవిషయం స్పష్టమవుతుంది. ఆ గణాంకాల ప్రకారం గత ఏడాదిలో దేశంలోని వివిధ విద్యాసంస్థల్లో చదివిన వారిలో 7.77 లక్షల మందికి ప్లేస్‌మెంట్స్ లభించాయి. వీటిలో అత్యధికం ఇంజనీరింగ్ తదితర టెక్నాలజీ కోర్సులలోని వారికే దక్కాయి. టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న వారికి కరోనా కాలంలోనూ కొలువులకు కొదవలేదని నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నియామకాల సరళి కూడా దీనిని స్పష్టం చేస్తోంది. గతంలో కన్నా 20 శాతం పెరుగుదలతో ప్యాకేజీ ఆఫర్లు అందాయని ఆ గణాంక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐఐటీ విద్యార్థులు అంతర్జాతీయంగానే కాదు, దేశీయంగానూ అత్యధిక వేతన ప్యాకేజీలు అందుకుంటున్నారు. ఈ సంవత్సరం దేశీయ సంస్థలలో ముఖ్యంగా క్లౌడ్ ఆధారిత టెక్ సంస్థలు అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నాయి. ఆర్అండ్డీ విభాగాల్లో ఐఐటీ గ్రాడ్యుయేట్లకు అధిక డిమాండ్ ఉంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనాలసిస్ వంటి వాటిలో నైపుణ్యాలున్న విద్యార్థులకు అధిక ప్యాకేజీలను ఇవ్వడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా కారణంగా క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలు ఆన్లైన్లో వర్చువల్‌గా నిర్వహిస్తున్నారు. అ‘ధర’గొడుతున్న ప్యాకేజీలు ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ముంబై, ఐఐటీ ఖరగ్‌పూర్ సహా ఇతర ఐఐటీల విద్యార్థులు అంతర్జాతీయ ఆఫర్లను ఎక్కువగా అందుకుంటున్నారు. ఆయా ఐఐటీలు వెలువరిస్తున్న గణాంకాల ప్రకారం.. అంతర్జాతీయ సంస్థల ఆఫర్లలో డచ్ సంస్థ ఆప్టివర్ ఈ ఏడాది ఐఐటీ ముంబైలో చేపట్టిన డ్రైవ్‌లో గరిష్టంగా 1.39 కోట్ల ప్యాకేజీని ఇచ్చింది. సోనీ సంస్థ (జపాన్) రూ. 1.14 కోట్లు, హోండా –ఆర్‌అండ్‌డి (జపాన్) రూ. 57.85 లక్షలు, తైవాన్ సెమీకండక్టర్ తయారీ సంస్థ రూ. 53.52 లక్షలు, క్వాల్కమ్ రూ. 46.41 లక్షలు, వరల్డ్‌క్వాంట్ రూ. 39.70 లక్షలు, మోర్గాన్ స్టాన్లీ రూ. 37.25 లక్షలు, ఉబెర్ రూ.35.38 లక్షలు, ఎన్ఇసి (జపాన్) రూ. 34.73 లక్షలు ప్యాకేజీని ఇచ్చాయి. ⇔ ఐఐటీ రూర్కీ విద్యార్థులలో గరిష్ట వేతనం ఈ ఏడాది రూ. 80 లక్షల వరకు వచ్చింది. గత ఏడాదిలో రూ. 60 లక్షలు మాత్రమే. జాతీయ సంస్థలతో పాటు ఏడు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ నియామక డ్రైవ్ చేపట్టాయి. ఇక్కడ 484 మందికి మంచి ఆఫర్లు వచ్చాయి. ⇔ ఐఐటి గువహటి విద్యార్థికి గత ఏడాదిలో గరిష్ట వేతనం రూ. 52 లక్షలు కాగా ఈ ఏడాది రూ. 70 లక్షల వరకు పెరిగింది. ఈసారి నాలుగు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ ప్లేస్మెంట్స్ను నిర్వహించాయి. 353 మందికి ప్లేస్మెంట్లు వచ్చాయి. ⇔ ఐఐటీ కాన్పూర్‌లో ఈ ఏడాది చేపట్టిన ప్లేస్మెంట్సులో అత్యధిక దేశీయ ఆఫర్ రూ. 82 లక్షలు. గతేడాది కన్నా ఇది 32 శాతం ఎక్కువ. దేశీయ ప్యాకేజీల్లోనూ పెరుగుదల ఈ ప్లేస్మెంట్ సీజన్లో ఐఐటీ విద్యార్థులకు అంతర్జాతీయ సంస్థల ఆఫర్లను మించి దేశీయ టెక్ సంస్థలు వేతనాలు ప్రకటిస్తుండడం విశేషం. గతంతో పోలిస్తే 30 నుంచి 35 శాతం అధికంగా వేతనాలు పెరిగాయి. మద్రాస్, రూర్కీ, గువహటి తదితర ఐఐటీల్లో దేశీయ సంస్థలు ప్రకటించిన వేతనాలు అంతర్జాతీయ ప్యాకేజీలను దాటాయి. విదేశాలకు వెళ్లేకన్నా దేశంలోనే ఉంటూ అంతకన్నా ఎక్కువ సంపాదించే అవకాశం ఉండటంతో దేశీయ కంపెనీలవైపు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. మైక్రోసాఫ్ట్, ఉబర్ వంటి సంస్థలతో పోటీపడుతూ.. ఎమ్టీఎక్స్ గ్రూప్, క్వాంట్‌బాక్స్ రీసెర్చ్, గ్రావిటన్ వంటి సంస్థలు టెక్ విద్యార్థులకు రూ. 70 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నాయి. ఏఐసీటీ ఈ గణాంకాల ప్రకారం ఆయా విభాగాలలో ప్లేస్మెంట్లు దక్కిన వారి సంఖ్య.. విభాగం దేశంలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ 649 ఆర్కిటెక్చర్ ప్లానింగ్ 2,184 డిజైన్ 104 ఇంజనీరింగ్, టెక్నాలజీ 6,05,297 మేనేజ్మెంటు 1,15,599 ఎంసీఏ 17,219 ఫార్మసీ 33,428 హోటల్ మేనేజ్మెంటు 2,555 మొత్తం 7,77,035 గత ఐదేళ్లలో ప్లేస్మెంట్సు ఇలా 2015–16 7,01,527 2016–17 7,22,868 2017–18 7,15,918 2018–19 7,94,815 2019–20 7,77,035 ఏపీలో గత ఐదేళ్లలో ఇలా 2015–16 56,359 2016–17 60,404 2017–18 61,431 2018–19 75,028 2019–20 74,204 నైపుణ్యమే ప్రధానం.. కరోనా తరువాత ప్రపంచం డిజిటల్ యుగంలోకి చొచ్చుకుపోతోంది. 3డీ ప్రింటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్సెస్‌లే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో నైపుణ్యం, విభిన్నమైన ఆలోచనలు, సృజనాత్మకత ఉన్న వారికి ఎక్కువ అవకాశాలు దక్కుతాయి. ప్లేస్మెంట్ ఇచ్చే సంస్థలు ఇకపై విద్యా సంస్థలకు ప్రాధాన్యమిచ్చే పరిస్థితి ఉండదు. విద్యార్థుల్లోని నైపుణ్యాలనే పరిగణనలోకి తీసుకుంటాయి. ప్రస్తుతం పలు డిజిటల్ సైట్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిద్వారా నైపుణ్యాలు పెంపొందించుకొనే వారికి అవి స్కోర్లు ఇస్తున్నాయి. ఆ స్కోర్లు బాగా ఉన్న వారిని కంపెనీలు ఆన్లైన్లోనే పరీక్షించి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. రానున్న కాలంలో క్యాంపస్ ఎంపికలు ఉండకపోవచ్చు. – ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి, ఉపకులపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం సామర్థ్యాలు పెంచుకోవాలి ఐఐటీల్లో చదివే విద్యార్థులలోనే కాకుండా ఇతర కాలేజీ విద్యార్థుల్లో కూడా మంచి తెలివి తేటలుంటాయి. విద్యార్థులు ఆత్మస్థయిర్యంతో నైపుణ్యాలను వ్యక్తపరిచే సామర్థ్యాలు అలవర్చుకోవాలి. నైపుణ్యముంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. విద్యార్థులకు మార్కులు, ర్యాంకులే కాకుండా మారుతున్న ప్రపంచానికి అవసరమైన పరిజ్ఞానం, నైపుణ్యాలను వారికి నేర్పిస్తున్నాం. కరోనా సమయంలోనూ శిక్షణ ఇవ్వడంతో మంచి అవకాశాలు విద్యార్థులకు వచ్చాయి. – డాక్టర్ వి.మధుసూదనరావు, రెక్టార్, వీ.ఎం.రావు, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విశాఖపట్నం -
టాప్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఐఐఎస్సీ!
లండన్: బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) విద్యారంగంలో భారత ప్రతిష్ఠను అంతర్జాతీయంగా చాటింది. ఇంజినీరింగ్, టెక్నాలజీ విద్యలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 100 యూనివర్సిటీల్లో ఐఐఎస్సీ చోటు సపాందించింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎచ్ఈ) ర్యాంకింగ్స్ ఫర్ ఇంజినీరింగ్, టెక్నాలజీ జాబితాలో ఐఐఎస్సీ 99వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికా విశ్వవిద్యాలయాలే అత్యధికంగా చోటు సంపాదించాయి. అమెరికాకు చెందిన స్టాన్‌ఫర్డ్, కాల్టెక్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొదటి మూడు ర్యాంకులు సాధించాయి. దేశంలో పేరొందిన ఐఐటీలకు కూడా ఇటీవల అంతర్జాతీయ విశ్వవిద్యాలయ ర్యాంకులు పెద్దగా రాని విషయం తెలిసిందే. 'ఈ ఏడాది విజయగాథ భారత్‌దే అవుతుంది. ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్, టెక్నాలజీ ర్యాంకింగ్స్‌లో తొలిసారి భారత యూనివర్సిటీ చోటు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని అత్యుత్తమ యూనివర్సిటీలకే ఈ ర్యాంకింగ్ లభిస్తుంది' అని టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎచ్ఈ) వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్ ఎడిటర్ ఫిల్ బాటీ తెలిపారు. 'హైటెక్ రంగాలైన ఐటీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ సెక్టర్లతోపాటు, సంప్రదాయ రంగమైన ఉక్కు ఉత్పత్తిలోనూ భారత ఇంజినీరింగ్, సాంకేతిక శక్తిని ప్రపంచానికి చాటుతూనే ఉంది. అదేవిధంగా భారత్‌కు చెందిన కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, టాటా, మిట్టల్ కంపెనీలతోపాటు భారతీయులు నడిపిస్తున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు ప్రపంచానికి భారత శక్తిని చాటుతున్నాయి' అని ఆయన చెప్పారు. -
టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
నేటి తరం విద్యార్థులు ముఖ్యంగా నాలుగు అంశాల్లో నైపుణ్యాలు సాధించాలి.అవి సింథసిస్(సమన్వయం), ఇంటర్నేషనలైజేషన్, సాఫ్ట్‌స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్. ‘ఇంజనీరింగ్, టెక్నాలజీ.. దశాబ్దాలుగా ఎవర్గ్రీన్ రంగాలు. నేటికీ ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయి. అకడమిక్స్ పరంగానూ ఎంతో క్రేజ్ కలిగిన విభాగాలివి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో మేక్ ఇన్ ఇండియా.. అంతర్జాతీయంగా గ్లోబల్ దృక్పథం కారణంగా.. ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో సమీప భవిష్యతలో మరింత డిమాండ్ ఏర్పడనుంది. ఆ మేరకు మానవ వనరుల అవసరం ఉంటుంది. విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు మహీంద్రా ఎకోల్ సెంట్రేల్ డెరైక్టర్ ప్రొఫెసర్ సంజయ్ జి.ధాండే. 12ఏళ్లు ఐఐటీ-కాన్పూర్ డెరైక్టర్‌గా పనిచేయడంతోపాటు ఐఐటీ-రాజస్థాన్ ఫౌండర్ డెరైక్టర్‌గా, ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహా మండలి సభ్యులుగా వ్యవహరించిన ప్రొఫెసర్ సంజయ్ జి.ధాండేతో గెస్ట్‌కాలం.. జాతీయ స్థాయిలో ప్రస్తుతం అమలవుతున్న విధానాలను పరిగణనలోకి తీసుకుంటే ఇంజనీరింగ్ నిపుణులకు ఉజ్వల భవిష్యత్తు ఖాయం. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియాతో రానున్న ఐదేళ్లలో ఉత్పత్తి రంగం మరింత వృద్ధి చెందనుంది. ఈ కార్యక్రమం సమర్థంగా అమలైతే ప్రస్తుతం జీడీపీలో 17 శాతంగా ఉన్న ఉత్పత్తి రంగం వాటా 25 శాతానికి పెరగనుంది. అంటే.. కొత్త ఉత్పత్తులు, పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది. ఇది ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఇతరులతో సమన్వయంతో పనిచేయాలి: అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే.. నేటి తరం విద్యార్థులు ముఖ్యంగా నాలుగు అంశాల్లో నైపుణ్యాలు సాధించాలి. అవి సింథసిస్(సమన్వయం), ఇంటర్నేషనలైజేషన్, సాఫ్ట్‌స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్. కారణం.. ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్పత్తి రంగంలో పలు విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇతరులతో సమన్వయంతో ముందుకు సాగడం చాలా అవసరం. అలాగే అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కార్యకలాపాలపై అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు ఒక ఉత్పత్తికి సంబంధించి విశ్లేషించే నైపుణ్యాలు ఉంటే విధుల్లో సమర్థంగా రాణించగలుగుతారు. టీంలో పనిచేసేటప్పుడు కమ్యూనికేషన్, సాఫ్ట్‌స్కిల్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది. కరిక్యులం.. ఆర్ అండ్ డీ: విద్యార్థులకు నైపుణ్యాలు అలవడాలంటే కరిక్యులంను పరిశ్రమల్లో ఉద్యోగాలు లభించే నైపుణ్యాలను అందించేలా రూపొందించాలి. సమీప భవిష్యత్తులో సదరు రంగంలో రానున్న మార్పులు అంచనా వేసి ఆ మేరకు శిక్షణ ఇచ్చేలా కరిక్యులం రూపొందించాలి. అప్పుడే విద్యార్థులు అధునాతన పరిజ్ఞానంతో జాబ్ మార్కెట్లో రాణించగలరు. మన దేశంలో ఇటీవల కాలంలో ఇన్స్టిట్యూట్ల పరంగా ఆర్ అండ్ డీపై అవగాహన పెరుగుతుండటం ఆహ్వానించదగిన పరిణామం. ఇన్స్టిట్యూట్లు ఆర్ అండ్ డీ దృక్పథంతోపాటు పరిశ్రమ వర్గాలు కోరుకునే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. గత కొన్నేళ్లుగా కార్పొరేట్ సంస్థలు సొంతంగా ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఆర్ అండ్ డీ, పరిశ్రమలకు అనువుగా రాణించడం కోసమే! గ్లోబల్ దృక్పథం కావాలి: విద్యార్థులు లోకల్, ఇంటర్నేషనల్ అనే కోణంలో ఆలోచించడం మానేయాలి. పూర్తిగా ‘గ్లోబల్’ దృక్పథంతో నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలి. ఇప్పుడు కంపెనీల పరంగా లోకల్, ఇంటర్నేషనల్ అనే హద్దులు చెరిగిపోయాయి. పెద్ద కంపెనీలు అన్నీ వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఎంఎన్సీలుగా పరిగణనలో ఉన్నాయి. ఎంఎన్‌సీలు అంటే మన దేశంలో ఉన్న విదేశీ సంస్థలుగానే భావిస్తాం. కానీ ఇతర దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మన దేశంలోని సంస్థలు కూడా ఎంఎన్‌సీలే. ఉదాహరణకు టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలకు ఇతర దేశాల్లో సర్వీస్ డెలివరీ సెంటర్స్ ఉన్నాయి. మన దేశంలోని సంస్థలో పనిచేస్తున్నా, విదేశాల్లోని కంపెనీలో చేరినా.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పనిచేసేలా విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకోవాలి. ప్రాథమిక అంశాలకు ప్రాధాన్యమివ్వాలి: ఇంజనీరింగ్‌కు సంబంధించి పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం.. ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగడం. ఉదాహరణకు ఇటీవల కాలంలో డిజిటల్ ఫ్యాబ్రికేషన్, 3-డి ప్రింటింగ్ వంటి వాటి ప్రాముఖ్యత పెరుగుతోంది. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే విద్యార్థులు తమ కోర్ సబ్జెక్ట్‌లకే పరిమితం కాకుండా.. సరికొత్త టెక్నాలజీలో నైపుణ్యాలు పొందేలా శిక్షణ తీసుకోవాలి. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో ఆవిష్కరణలకు కీలకమైన ప్రాథమిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవడం విద్యార్థుల్లో సమస్యగా మారింది. ఇంజనీరింగ్ ఔత్సాహిక, ఇప్పటికే ఈ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ విషయాన్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. స్వీయ లెర్నింగ్‌తో..: మంచి కాలేజీలో చేరితేనే మెరుగైన నైపుణ్యాలు లభిస్తాయి అనే అపోహను వీడండి. కాలేజ్/ఇన్స్టిట్యూట్ స్థాయి ఏదైనా.. ఇంజనీరింగ్ వంటి కోర్సులో స్వీయ ఆసక్తితో, సొంతగా నేర్చుకోవడం ద్వారా నైపుణ్యాలను పెంచుకోవచ్చు. తరగతి గదిలో ప్రొఫెసర్ ఒక అంశం చెబితే దానికి అనుసంధానంగా ఉన్న ఇతర అంశాలపై పరిజ్ఞానం పొందేందుకు విద్యార్థి సొంతగా కృషి చేయాలి. దాంతోపాటు ప్రొఫెసర్లు చేసే పరిశోధనల్లో పాల్గొనేలా వ్యవహరించాలి. ఒక బ్రాంచ్‌లో చేరిన విద్యార్థులు తమ బ్రాంచ్‌లోని కోర్సులకే పరిమితం కాకుండా.. ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌తో ముందుకు సాగాలి. అప్పుడే ఎలాంటి కాలేజీలో చేరినా.. భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన పని ఉండదు!! -
నేటి ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : గురువారం జరిగే ఎంసెట్-2014 నిర్వహణకు వరంగల్ రీజినల్ పరిధిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రీజినల్ కోఆర్డినేటర్, కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసులు తెలిపారు. ఇంజనీరింగ్‌కు 14,323 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, ఇందుకు 23 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షకు 36 మంది అబ్జర్వర్లను నియమించామన్నారు. మధ్యాహ్నం 2-30గంటల నుంచి సాయంత్రం 5-30 గంటల వరకు మెడిసిన్, అగ్రికల్చర్‌కు ప్రవేశ పరీక్ష జరుగుతుందని, 6,669మంది అభ్యర్థులు పరీక్షను రాయబోతున్నారన్నారు. ఈ పరీక్ష నిర్వహణకు 10 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 18మంది అబ్జర్వర్లను నియమాకం చేశామని చెప్పారు. ఆయా పరీక్షలకు నిర్ధేశించిన విధంగా ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షాకేంద్రాలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఇంజనీరింగ్ పరీక్షా కేంద్రాలు ఇవే.. కేయూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, వరంగల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్ (విట్స్), చైతన్య డిగ్రీ కాలేజీ, ఏవీవీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, న్యూసైన్స్ డిగ్రీ కాలేజీ, న్యూసైన్స్ డిగ్రీ పీజీ కాలేజీ, ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, సుమతిరెడ్డి ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, ఎల్బి పీజీ కాలేజీ, ఎల్యూజీ కాలేజీ, జయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్, కాకతీయ మెడికల్ కాలేజీ, సీకెఎం, కాకతీయ కాలేజీ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, మాస్ట ర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, ఎస్వీఎస్ కాలేజీ, కాకతీ య ప్రభుత్వ కాలేజీ, వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, యూనివర్సిటీ కాలేజీ(హ్యూమనిటీస్ బిల్డింగ్), సహారా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ మెడిసిన్ అండ్ అగ్రికల్చర్ పరీక్షా కేంద్రాలు వరంగల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్(విట్స్), చైతన్య డిగ్రీకాలేజీ, ఏవీవీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, ఎల్బీ పీజీ కాలేజీ, ఎల్బి యూజీ కాలేజీ, కాకతీయ మెడికల్ కాలేజీ, కాకతీయ ప్రభుత్వ కాలేజీ, వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, శ్రీ గాయత్రి డిగ్రీ కాలేజీ, సహారా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి. -
సోలార్ విద్యుత్‌తో లాభాలు భలే!
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ప్రస్తుతం ప్రధానంగా థర్మల్, న్యూక్లియర్, హైడల్ విద్యుత్ తయారు చేస్తున్నాం వీటికి ప్రత్యామ్నాయంగా విద్యుత్ తయారీ చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని టెక్ మహేంద్ర ఫంక్షన్ హెడ్ డా.అల్లా బక్ష్ నైకోడి అన్నారు. బంజారాహిల్స్‌లోని ముఫకంజా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సోమవారం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ రెనివేబుల్ ఎనర్జీ సోర్సెస్ (డబ్ల్యూపీఈఆర్ఎస్)’ అనే అంశంపై మూడు రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది. సుల్తాన్-ఉల్-ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి జాఫర్ జావేద్, కళాశాల డెరైక్టర్ బషీద్ అహ్మద్, ప్రిన్సిపల్ డా.కేఎన్ కృష్ణన్ ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన నైకోడి తన ప్రసంగంలో సోలార్ ఎనర్జీని ఎలా వినియోగించుకోవచ్చో వివరించారు. సూర్యరశ్మితో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను నేరుగా వినియోగించుకోలేమని దాన్ని పవర్ ఎలక్ట్రానిక్స్ పరికరాల ద్వారా మలచుకొని గ్రిడ్‌కు ఎలా అనుసంధానం చేయవచ్చో సూచించారు. జాఫర్ జావేద్ మాట్లాడుతూ సూర్యరశ్మితో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను విరివిగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో ఎన్నో లాభాలు సమకూరుతాయని విద్యుత్ సమస్యను తీర్చుకోవచ్చన్నారు. డెరైక్టర్ బషీర్ అహ్మద్ తన ప్రసంగంలో సూర్యరశ్మి ద్వారా వచ్చే విద్యుత్తుపై బాగా అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. ఈ నెల 29 వరకు జరిగే వర్క్‌షాప్‌లో రాష్ట్రం నలుమూలల నుంచి 15 కళాశాలల విద్యార్థులు, ఫ్యాకల్టీలు, పరిశ్రమల నిర్వాహకులు హాజరయ్యారు.