ప్రస్తుతం ప్రధానంగా థర్మల్, న్యూక్లియర్, హైడల్ విద్యుత్ తయారు చేస్తున్నాం వీటికి ప్రత్యామ్నాయంగా విద్యుత్ తయారీ చేపట్టాల్సిన అవసరం...
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ప్రస్తుతం ప్రధానంగా థర్మల్, న్యూక్లియర్, హైడల్ విద్యుత్ తయారు చేస్తున్నాం వీటికి ప్రత్యామ్నాయంగా విద్యుత్ తయారీ చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని టెక్ మహేంద్ర ఫంక్షన్ హెడ్ డా.అల్లా బక్ష్ నైకోడి అన్నారు. బంజారాహిల్స్‌లోని ముఫకంజా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సోమవారం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ రెనివేబుల్ ఎనర్జీ సోర్సెస్ (డబ్ల్యూపీఈఆర్‌ఎస్)’ అనే అంశంపై మూడు రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది.
సుల్తాన్-ఉల్-ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి జాఫర్ జావేద్, కళాశాల డెరైక్టర్ బషీద్ అహ్మద్, ప్రిన్సిపల్ డా.కేఎన్ కృష్ణన్ ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన నైకోడి తన ప్రసంగంలో సోలార్ ఎనర్జీని ఎలా వినియోగించుకోవచ్చో వివరించారు. సూర్యరశ్మితో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను నేరుగా వినియోగించుకోలేమని దాన్ని పవర్ ఎలక్ట్రానిక్స్ పరికరాల ద్వారా మలచుకొని గ్రిడ్‌కు ఎలా అనుసంధానం చేయవచ్చో సూచించారు.
జాఫర్ జావేద్ మాట్లాడుతూ సూర్యరశ్మితో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను విరివిగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో ఎన్నో లాభాలు సమకూరుతాయని విద్యుత్ సమస్యను తీర్చుకోవచ్చన్నారు. డెరైక్టర్ బషీర్ అహ్మద్ తన ప్రసంగంలో సూర్యరశ్మి ద్వారా వచ్చే విద్యుత్తుపై బాగా అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. ఈ నెల 29 వరకు జరిగే వర్క్‌షాప్‌లో రాష్ట్రం నలుమూలల నుంచి 15 కళాశాలల విద్యార్థులు, ఫ్యాకల్టీలు, పరిశ్రమల నిర్వాహకులు హాజరయ్యారు.