bashir ahmed
-
సోలార్ విద్యుత్‌తో లాభాలు భలే!
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ప్రస్తుతం ప్రధానంగా థర్మల్, న్యూక్లియర్, హైడల్ విద్యుత్ తయారు చేస్తున్నాం వీటికి ప్రత్యామ్నాయంగా విద్యుత్ తయారీ చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని టెక్ మహేంద్ర ఫంక్షన్ హెడ్ డా.అల్లా బక్ష్ నైకోడి అన్నారు. బంజారాహిల్స్‌లోని ముఫకంజా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సోమవారం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ రెనివేబుల్ ఎనర్జీ సోర్సెస్ (డబ్ల్యూపీఈఆర్ఎస్)’ అనే అంశంపై మూడు రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది. సుల్తాన్-ఉల్-ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి జాఫర్ జావేద్, కళాశాల డెరైక్టర్ బషీద్ అహ్మద్, ప్రిన్సిపల్ డా.కేఎన్ కృష్ణన్ ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన నైకోడి తన ప్రసంగంలో సోలార్ ఎనర్జీని ఎలా వినియోగించుకోవచ్చో వివరించారు. సూర్యరశ్మితో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను నేరుగా వినియోగించుకోలేమని దాన్ని పవర్ ఎలక్ట్రానిక్స్ పరికరాల ద్వారా మలచుకొని గ్రిడ్‌కు ఎలా అనుసంధానం చేయవచ్చో సూచించారు. జాఫర్ జావేద్ మాట్లాడుతూ సూర్యరశ్మితో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను విరివిగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో ఎన్నో లాభాలు సమకూరుతాయని విద్యుత్ సమస్యను తీర్చుకోవచ్చన్నారు. డెరైక్టర్ బషీర్ అహ్మద్ తన ప్రసంగంలో సూర్యరశ్మి ద్వారా వచ్చే విద్యుత్తుపై బాగా అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. ఈ నెల 29 వరకు జరిగే వర్క్‌షాప్‌లో రాష్ట్రం నలుమూలల నుంచి 15 కళాశాలల విద్యార్థులు, ఫ్యాకల్టీలు, పరిశ్రమల నిర్వాహకులు హాజరయ్యారు. -
మామూళ్ల ‘మత్తు’
పత్తికొండ అర్బన్, న్యూస్‌లైన్: మామూళ్ల మత్తు పరాకాష్టకు చేరింది. పంపకాల్లో తేడా అధికారుల మధ్య గొడవకు దారితీసింది. ఏడాది క్రితం ఎక్సైజ్ శాఖ వసూళ్ల బాగోతం రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు పోలీసు అధికారులు, సిబ్బందిని ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సిబ్బందిలో మార్పు కరువైంది. వాతావరణం కాస్తా చల్లబడినట్లు కనిపించడంతో మళ్లీ చేయి చాచడం మొదలు పెట్టేశారు. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం కాస్తా పత్తికొండ ఎక్సైజ్ స్టేషన్లో రచ్చకెక్కింది. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో స్థానిక స్టేషన్లో ఒక్కసారిగా గందరగోళం చోటు చేసుకుంది. ఏమి జరుగుతుందోనని లోపలికి వెళ్లిన విలేకరులను ఆశ్చర్యపరుస్తూ మామూళ్ల దందా బట్టబయలైంది. ఓ పోలీసు వద్ద డాబా, కల్లుపెంట నిర్వాహకులతో పాటు మరికొందరు గుమికూడారు. ఇదే సమయంలో సీఐ గదిలో ఆయనతో ఎస్ఐ వాగ్వాదానికి దిగడం కనిపించింది. మీడియా రాకతో సీఐ బషిర్ అహ్మద్ అవినీతి చిట్టాను ఎస్ఐ షేక్ కరీముల్లా ఒక్కొక్కటిగా బయటకు కక్కేశారు. ఒక్కో బెల్ట్ షాపు నుంచి రూ.2,500, వైన్స్ షాపు నుంచి రూ.10వేల వరకు, రెన్యూవల్ కోసం ఒక్కో దుకాణం నుంచి రూ.50వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో సీఐ కలుగజేసుకొని ఎస్ఐను బయటకు వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. కానిస్టేబుల్‌ను పిలిచి బయటకు పంపే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న మీడియాతో సీఐ మాట్లాడుతూ ఆయన ఆరోపణలన్నీ అవాస్తవమని చెబుతుండగా.. ఎస్ఐ కలుగజేసుకొని అన్నింటికీ తానే సాక్షినన్నారు. విషయాన్ని జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లగా నీ ఉద్యోగం నీవు చూసుకోమని చెప్పారన్నారు. ఎద్దులదొడ్డిలోని ఒక్కో బెల్ట్‌షాపు నుంచి రూ.2,500 చొప్పున తీసుకుంటున్నారని.. తన విధులకు అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆయన వాపోయారు. స్టేషన్లో తనకు ఏ పనీ చెప్పకుండా వసూళ్లకు పెద్దపీట వేస్తున్నారన్నారు. సీఐ ఆగడాలకు అడ్డుగా ఉన్నాననే కారణంతోనే జిల్లా కార్యాలయానికి పంపారని ఎస్ఐ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయని.. ఉన్నతాధికారులు అవకాశం కల్పిస్తే అన్నీ బయటపెడతానంటూ ఎస్ఐ బయటకు వెళ్లిపోయారు. చివరగా సీఐని వివరణ కోరగా.. ఇవన్నీ మామూలేనంటూ సమర్థించుకోవడం గమనార్హం.