‘సీఎస్‌ఈ’ టాప్‌ | First option for engineering students is Computer Science | Sakshi
Sakshi News home page

‘సీఎస్‌ఈ’ టాప్‌

Published Mon, Jan 25 2021 4:17 AM | Last Updated on Mon, Jan 25 2021 4:17 AM

First option for engineering students is Computer Science - Sakshi

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్‌–2020 రెండో విడత కౌన్సెలింగ్‌లో 51 వేల మందికిపైగా విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. ఎక్కువ ఉపాధి అవకాశాలున్న కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ)కే అధిక శాతం మంది మొగ్గు చూపారు. మొదటి ప్రాధాన్యత ఆప్షన్‌గా సీఎస్‌ఈనే నమోదు చేసుకున్నారు. తరువాత స్థానాల్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ కోర్సులకు ప్రాధాన్యతనిచ్చారు. తొలి విడతలో సీట్లు కేటాయింపు పొందిన వారు కూడా రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. తాము కోరుకున్న కాలేజీలో ఆశించిన కోర్సులో సీటు దక్కనివారు రెండో విడత కౌన్సెలింగ్‌లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 90 శాతం మంది కంప్యూటర్‌ సైన్సుకే మొదటి ఆప్షన్‌ ఇచ్చారు. 

నేడు సీట్ల కేటాయింపు
ఏపీ ఎంసెట్‌–2020 పరీక్షలో 1,29,880 మంది అర్హత సాధించగా 91,090 మంది సర్టిఫికెట్ల పరిశీలనకు రిజిస్టర్‌ చేసుకున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 90,206 మంది అర్హులుగా తేలారు. వెబ్‌ ఆప్షన్ల నమోదుకు 85,295 మంది పాస్‌వర్డ్‌లను జనరేట్‌ చేసుకున్నారు.  రెండో విడత వెబ్‌ ఆప్షన్ల నమోదుకు చివరి తేదీ అయిన ఈనెల 23వ తేదీ రాత్రి వరకు 51,731 మంది వరకు ఆప్షన్లను నమోదు చేశారు. చివరి రోజు 14,243 మంది ఆప్షన్లను నమోదు చేసుకున్నారు. వీరికి సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత సీట్లు కేటాయించనున్నారు.

మిగిలిన సీఎస్‌ఈ సీట్లు 1,372 
వెబ్‌ ఆప్షన్లలో ఎక్కువ మంది కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ కోర్సుకే ప్రాధాన్యతనిస్తూ ఆప్షన్లు ఇచ్చారు. అయితే సీఎస్‌ఈ సీట్ల అందుబాటు అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో కలిపి సీఎస్‌ఈ సీట్ల సంఖ్య 22,672 కాగా మొదటి విడతలోనే 21,300 సీట్లు భర్తీ అయ్యాయి. కేవలం 1,372 సీట్లు మాత్రమే రెండో విడత కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా తొలి విడతలో సీట్లు పొంది వేర్వేరు కారణాలతో రద్దు అయిన కొన్ని సీట్లు కలవనున్నాయి.  

మిగులు సీట్లన్నీ ఇతర విభాగాల్లోనే..
మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే ప్రముఖ కాలేజీల్లోని సీఎస్‌ఈ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఎంసెట్‌–2020 ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లు 1,03,766 ఉండగా 72,867 సీట్లు మొదటి విడతలో భర్తీ అయ్యాయి. 30,899 సీట్లు రెండో విడతకు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్‌ సైన్సు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ తదితర కోర్సుల సీట్లు 85 శాతానికి పైగా భర్తీ కాగా తక్కిన విభాగాల్లోని సీట్లే ఎక్కువగా మిగిలాయి. అవి కూడా ప్రైవేట్‌ కాలేజీల్లోని సీట్లే అధికంగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement