మ్యాగీ నూడుల్స్ ఔట్ | Image for the news result All nine Maggi variants off the shelves | Sakshi
Sakshi News home page

మ్యాగీ నూడుల్స్ ఔట్

Published Sat, Jun 6 2015 3:46 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

మ్యాగీ నూడుల్స్ ఔట్

మ్యాగీ నూడుల్స్ ఔట్

ఉత్పత్తులపై నిషేధం విధించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
9 రకాల ఉత్పత్తులను మార్కెట్ నుంచి ఉపసంహరించాలని నెస్లేకు ఆదేశం
నిరాధార కారణాల వల్ల ఈ గందరగోళం.. మా ఉత్పత్తులు పూర్తి సురక్షితం: నెస్లే
మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను నిలిపేసిన మధ్యప్రదేశ్
భారత్ నుంచి దిగుమతైన మ్యాగీ ఉత్పత్తులను నిషేధించిన నేపాల్, సింగపూర్

 
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. మ్యాగీ ఇన్‌స్టంట్ నూడుల్స్‌కు చెందిన అన్ని రకాల ఉత్పత్తులను తక్షణమే మార్కెట్ నుంచి ఉపసంహరించాలని మ్యాగీని ఉత్పత్తి చేసే ప్రఖ్యాత స్విస్ సంస్థ నెస్లేను భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) శుక్రవారం ఆదేశించింది. అలాగే, మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తి, అమ్మకాల పైనా నిషేధం విధించింది. సీసం(లెడ్), మోనో సోడియం గ్లూటామేట్(ఎంఎస్‌జీ) అనే హానికర రసాయనాలు పరిమితికి మించి ఉన్నాయని పేర్కొంటూ ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మ్యాగీ నూడుల్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే.

తాజాగా శుక్రవారం మధ్యప్రదేశ్ కూడా మ్యాగీ ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం విధించింది. నిరాధార కారణాల వల్ల ఈ గందరగోళం తలెత్తిందని, దాంతో వినియోగదారుల నమ్మకం సడలిందని, త్వరలోనే మళ్లీ వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొంటామని నెస్లే గ్లోబల్ సీఈఓ పాల్ బల్క్ విశ్వాసం వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన స్విట్జర్లాండ్ నుంచి శుక్రవారం ఢిల్లీ వచ్చారు. నెస్లేకి ఊరటనిచ్చేలా రెండు రాష్ట్రాలు పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలు మాత్రం మ్యాగీ నూడుల్స్‌లో హానికర పదార్థాలేవీ లేవని తమ పరీక్షల్లో తేలిందని, అందువల్ల వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోబోవడం లేదని స్పష్టం చేశాయి.

దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని నెస్లే ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మరోవైపు, భారత్ నుంచి దిగుమతి చేసుకున్న మ్యాగీ నూడుల్స్ అమ్మకాలపై సింగపూర్, నేపాల్ దేశాలు తాత్కాలిక నిషేధం విధించాయి. మ్యాగీ నూడుల్స్‌లో సీసం మోతాదు ఎక్కువుంటోందన్న వార్తల నేపథ్యంలో వాటిపై పరీక్షలు జరపాలని బ్రిటన్ నిర్ణయించింది.
 హానికరం.. సురక్షితం కాదు: ‘మ్యాగీ ఉత్పత్తుల వినియోగం సురక్షితం కాదు. హానికరం.

మ్యాగీ నూడుల్స్‌కు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులను తక్షణమే మార్కెట్ నుంచి ఉపసంహరించుకోండి. వాటి ఉత్పత్తి, దిగుమతి, సరఫరా, అమ్మకాలను నిలిపేయండి. వాటికి మేం ఇచ్చిన అనుమతులను ఎందుకు వెనక్కి తీసుకోకూడదో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వండి. మా ఆదేశాలను అమలు చేస్తామనే అంగీకార పత్రాన్ని 3 రోజుల్లోగా మాకు అందించండి. మీ ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్న ప్రక్రియపై రోజువారీ నివేదిక ఇవ్వండి.

అలాగే, మ్యాగీ ఓట్స్ మసాలా నూడుల్స్‌ను అనుమతి లేకుండానే, భద్రత పరీక్షలు జరపకుండానే మార్కెట్లో ప్రవేశపెట్టారు. తక్షణమే వాటిని మార్కెట్ నుంచి తొలగించండి. ఎంఎస్‌జీ విషయంలో లేబులింగ్ నిబంధనలను ఉల్లంఘించారు. దానిపై వివరణ ఇవ్వండి’ అని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈఓ వైఎస్ మాలిక్ నెస్లేకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
 
వందేళ్లుగా భారత్ మా మార్కెట్
‘మా ఉత్పత్తులకు సంబంధించి మేం ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన భద్రతాప్రమాణాలను, నాణ్యతావిధానాలను పాటిస్తాం. మ్యాగీ పూర్తిగా సురక్షితమని మా పరీక్షల్లో తేలింది. అయినా, మా ఉత్పత్తులను భారతీయ మార్కెట్ నుంచి తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నాం. మా పరీక్షా విధానాలతో పాటు అన్ని అంశాల్లో భారతీయ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాం. వెల్లడి కాని కారణాల వల్ల ఈ గందరగోళం తలెత్తిందని భావిస్తున్నాం. సాధారణంగా లెడ్(సీసం) వాతావరణంలో ఎక్కడైనా ఉంటుంది.

అయితే, మా ఉత్పత్తుల్లో మాత్రం పరిమితికి లోబడే ఉంది. ఎంఎస్‌జీని మేం ప్రత్యేకంగా కలపం. నూడుల్స్ తయారీ ప్రక్రియలో ఉపయోగించే సహజసిద్ధ పదార్థాల ద్వారానే అది తుది ఉత్పత్తిలోకి చేరుతుంది. అందుకే ఎంఎస్‌జీని చేర్చినట్లుగా మా ఉత్పత్తుల ప్యాక్స్‌పై ఉండదు. పలు ప్రయోగ కేంద్రాల్లో మ్యాగీ ఉత్పత్తులను పరీక్షించాం. అన్ని పరీక్షల్లోనూ మా ఉత్పత్తులు సురక్షితమేనని తేలింది’ అని పాత్రికేయుల సమావేశంలో నెస్లే గ్లోబల్ సీఈఓ పాల్ బల్క్ వివరణ ఇచ్చారు.
 
ఆహార భద్రతపై రాజీ లేదు
దేశ ప్రజల ఆహార భద్రతపై రాజీ లేదని కేంద్ర ఆహార మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆహార భద్రత ప్రమాణాలను మ్యాగీ ఉల్లంఘించినట్లు తేలిందన్నారు.
 
వివాదం మొదలైంది ఇలా.. మ్యాగీ.. 2 నిమిషాల్లోనే నూడుల్స్! దేశంలోనే తొలి ఇన్‌స్టంట్ నూడుల్స్ బ్రాండ్ ఇది. ఉత్తరప్రదేశ్‌లో విక్రయిస్తున్న మ్యాగీ నూడుల్స్‌లో సీసం(లెడ్), మోనోసోడియం గ్లుటామేట్‌లు అనుమతించిన మోతాదు కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు గతనెలలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అధికారులు గుర్తించడంతో వివాదం మొదలైంది.
 
గ్లుటామేట్ తో ప్రమాదమే...
గ్లుటామిక్ యాసిడ్, దాని గ్లుటామేట్‌లు(అయాన్లు, లవణాలు) కలిపితే మోనోసోడియం గ్లుటామేట్ రసాయనం ఏర్పడుతుంది. ఆహార పదార్థాలకు రుచి కోసం దీనిని కలుపుతారు. ఆహారంలో ఇది ఎక్కువైతే తలనొప్పి, చికాకు, అసౌకర్యం కలుగుతాయి.  కొంతమందిలో చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్ వస్తుంది. ఈ సిండ్రోమ్ వల్ల.. తలపోటు, ఛాతీ, వెన్ను, వంటి నొప్పులు, మగత కలుగుతాయి. ఛాతీలో మంట, దవడలు బిగుసుకుపోవడం, అలర్జీ వంటి సమస్యలూ రావచ్చు.
 
సీసంతో దుష్పరిణామాలు
ఇది భార లోహం. విషపూరితం. వాతావరణంలో ముఖ్యంగా గాలి, నీటిలో ఉంటుంది. గాలి, నీరు, ఆహారం, ఇతర మార్గాల ద్వారా మనుషుల్లోకి చేరవచ్చు. ఆహార పదార్థాల్లోకి నీటి ద్వారా లేదా ముడి పదార్థాలు, ప్యాకేజింగ్‌ల వల్ల రావచ్చు. శరీరంలోకి ఇది ఎక్కువగా చేరితే కడుపు నొప్పి, తలనొప్పి వస్తాయి. గందరగోళం, చికాకు కలుగుతాయి. రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. మోతాదు మించితే.. మూర్ఛ వస్తుంది. కోమాలోకి వెళతారు. మరణమూ సంభవించవచ్చు.
 
72%
నెస్లే కంపెనీ 1947 నుంచే మ్యాగీ బ్రాండ్ న్యూడుల్స్‌ను విక్రయిస్తోంది. దేశంలో ఇన్‌స్టంట్ నూడుల్స్ అమ్మకాల్లో 72 శాతం వాటా మ్యాగీదే!
 
3,000 కోట్లు
భారత్‌లో నెస్లే కంపెనీ ఉత్పత్తుల మొత్తం టర్నోవర్ రూ. 10 వేల కోట్లు. ఇందులో మ్యాగీ నూడుల్స్‌కే 30 శాతం  అంటే రూ. 3,000 కోట్ల వాటా ఉంది.
 
17.2 పీపీఎం
నీటిలో లేదా మట్టిలో ఒక పదార్థం గాఢతను లెక్కించే  ప్రమాణమే పీపీఎం(పార్ట్స్ పర్ మిలియన్). ఒక పీపీఎం అంటే.. ఒక లీటరు నీటిలో ఒక మిల్లీగ్రామ్ పదార్థాన్ని కలిపితే వచ్చే గాఢతకు సమానం. అయితే, ఆహార పదార్థాల్లో సీసం కనిష్టంగా 0.1 పీపీఎం నుంచి 1.4 పీపీఎం ఉండవచ్చు. గరిష్టంగా 2.5 పీపీఎం మించరాదు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని పలు చోట్ల, కోల్‌కతాలో స్వాధీనం చేసుకున్న మ్యాగీ శాంపిళ్లలో ఏకంగా 17.2 పీపీఎంల సీసం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement