నెస్లేకు మళ్లీ మ్యాగీ కష్టాలు! | Nestle India Suffering Again With Maggi Case | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 4 2019 8:27 AM | Last Updated on Fri, Jan 4 2019 8:42 AM

Nestle India Suffering Again With Maggi Case - Sakshi

న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం నాటి మ్యాగీ నూడుల్స్‌ వివాదం నెస్లే ఇండియాను ఇంకా వెంటాడుతోంది. మ్యాగీ నూడుల్స్‌కి సంబంధించి కంపెనీ మీద ఎన్‌సీడీఆర్‌సీలో కేంద్రం పెట్టిన కేసు విచారణపై స్టేను ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసు విచారణ యథాప్రకారం కొనసాగనుంది. మ్యాగీ నూడుల్స్‌ శాంపిల్స్‌పై మైసూరులోని సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఐ) నిర్వహించిన పరీక్షల ఫలితాలు దీనికి ప్రాతిపదికగా ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. మరోవైపు, సుప్రీం కోర్టు ఆదేశాలను నెస్లే స్వాగతించింది. మ్యాగీ నూడుల్స్‌లో సీసం తదితర అవశేషాలు నిర్దేశిత స్థాయిల్లోనే ఉన్నాయని సీఎఫ్‌టీఆర్‌ఐ పరీక్షల్లో తేలినట్లు పేర్కొంది.

అయితే, న్యాయస్థానం ఆదేశాల కాపీ వచ్చిన తర్వాతే తమకు ఉత్తర్వుల పూర్తి వివరాలు తెలుస్తాయని వివరించింది. వివరాల్లోకి వెళితే.. మ్యాగీ నూడుల్స్‌లో హానికారక మోనోసోడియం గ్లూటమేట్‌ (ఎంఎస్‌జీ) అవశేషాలు అధిక మోతాదులో ఉన్నాయంటూ ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2015లో దీన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెస్లే ఇండియా తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇస్తోందని, తప్పుడు లేబులింగ్, అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తోందని ఆరోపిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ 2015లో జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ)లో ఈ కేసు దాఖలు చేసింది. రూ. 640 కోట్ల నష్టపరిహారం డిమాండ్‌ చేసింది.

అయితే, దీన్ని నెస్లే సవాల్‌ చేయడంతో సుప్రీంకోర్టు అప్పట్లో కేసు విచారణపై స్టే విధించింది. మరోవైపు మ్యాగీ నూడుల్స్‌ శాంపిల్స్‌లో సీసం, ఎంఎస్‌జీ స్థాయి లపై పరీక్షలు జరిపి నివేదికనివ్వాలంటూ సీఎఫ్‌టీఆర్‌ఐని 2016 జనవరి 13న సుప్రీంకోర్టు   ఆదేశించింది. 29 శాంపిల్స్‌లో సీసం పరిమాణం నిర్దేశిత స్థాయికి లోబడే ఉందంటూ సీఎఫ్‌టీఆర్‌ఐ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement