మ్యాగీ న్యూడిల్సే అతిపెద్ద హీరో: వర్మ
ముంబై: ట్విట్టర్‌లో తనదైన మార్కు వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు ఏదో హల్‌చల్ చేసే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తాజాగా మ్యాగీ న్యూడిల్స్‌పై పడ్డారు. చెన్నై వరద బీభత్సానికి సంబంధించి అతిపెద్ద హీరోగా బాధిత మ్యాగీ న్యూడిల్సే నిలిచిందని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. చెన్నైలో బాధిత ప్రజలకు సరఫరా అయిన మ్యాగీ న్యూడిల్సే అతిపెద్ద రక్షకురాలిగా నిలిచిందని, ప్రభుత్వం తనను ధ్వంసం చేయాలని చూసినా.. మ్యాగీ న్యూడిల్స్ మాత్రం ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడిందని ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. మ్యాగీకి జై కొట్టారు. ఉన్నట్టుండి వర్మ మ్యాగీ గురించి వ్యాఖ్యలు చేయడంలో అంతర్థారం లేకపోలేదు.
ఇటీవల నిషేధానికి గురైన మ్యాగీ న్యూడిల్స్ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ వర్షాలతో అల్లాడుతున్న చెన్నై ప్రజలకు ముందుస్తుగా అందజేసిన ఆహార పదార్థాలు, పానీయాల జాబితాలో మ్యాగీ న్యూడిల్సే అగ్రస్థానంలో నిలిచింది. సహాయక చర్యల్లో భాగంగా నెస్ట్లే సంస్థ రెండు నిమిషాల్లో సిద్ధమయ్యే మ్యాగీ న్యూడిల్స్ ను తమిళనాడు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అందజేసింది. చెన్నై ప్రజలకు కొరత రాకుండా ప్యాకేజెడ్ ఆహార పదార్థాలు, తాగునీరు బాటిళ్లు అందజేయాలని కేంద్రమంత్రి హర్సిమత్‌కౌర్ బాదల్ పిలుపునిచ్చారు.
దీంతో పలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ప్యాకేజెడ్ ఆహారపదార్థాలు అందజేశాయి. ఈ జాబితాలో 10 మిలియన్ టన్నుల న్యూడిల్స్, 5వేల లీటర్ల టెట్రా ప్యాకేడ్ పాలు, 50వేల కాపీ పొట్లాలతో నెస్ల్టే ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఎంటీఆర్, ఐటీసీ సంస్థలు కూడా భారీమొత్తం ఆహార పదార్థాలు అందజేశాయి.