వెనక్కు తగ్గిన ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: నాలుగు నెలలుగా నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్న పాకిస్థాన్ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ వెనక్కుతగ్గారు. తన పోరాటాన్ని విరమించుకున్నారు. పెషావర్ లో ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. తీవ్రవాదంపై ప్రభుత్వం జరిపే పోరుకు సహాయ పడాలని నిర్ణయించుకున్నట్టు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా 126 రోజులుగా చేస్తున్న పోరాటాన్ని విరమించుకున్నామని చెప్పారు. ఎన్నికల అక్రమాలపై ఇప్పటికైనా ప్రభుత్వం నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగస్టు 14న లాహోర్ లో ఆయన ఆందోళన ప్రారంభించారు.