ఏపీ భవన్‌లో మిస్‌ఫైర్ | In AP Bhavan misfire | Sakshi
Sakshi News home page

ఏపీ భవన్‌లో మిస్‌ఫైర్

Published Fri, Oct 2 2015 5:00 AM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM

ఏపీ భవన్‌లో మిస్‌ఫైర్ - Sakshi

ఏపీ భవన్‌లో మిస్‌ఫైర్

- ఢిల్లీలో తెలంగాణ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌కు గాయం
- ఆయుధం శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు

సాక్షి, హైదరాబాద్:
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో జరిగిన పిస్టల్ మిస్‌ఫైర్‌లో తెలంగాణకు చెందిన ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఉన్న తెలంగాణ బ్లాక్‌లో గురువారం ఈ మిస్‌ఫైర్ సంభవించింది. ఈ ఘటనలో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో ఇన్‌స్పెక్టర్ రవికిరణ్ గాయపడ్డారు.

అంతర్యుద్ధంతో సతమతమవుతున్న కొసావో, సూడాన్ దేశాల్లో మోహరించే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం(యూఎన్‌పీకేఎఫ్)లోకి పలువురు తెలంగాణ పోలీసు అధికారులు డిప్యుటేషన్‌పై వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న పరీక్షల్లో హాజరుకావడానికి నాలుగురోజుల క్రితం వెళ్లారు. గోదావరి బ్లాక్‌లోని 404వ నంబర్ రూమ్‌లో బస చేసిన తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు(టీఎస్‌ఎస్‌పీ) డీఎస్పీ ఏవీ శ్రీనివాస్ గురువారం సాయంత్రం తన 9 ఎంఎం పిస్టల్‌ను శుభ్రం చేయడానికి ఉపక్రమించారు. పొరపాటున ఒక బుల్లెట్ మ్యాగ్జిన్ దాటి చాంబర్‌లోకి వెళ్లిపోవడంతో పిస్టల్ చాంబర్ లోడ్ అయింది. .

దీన్ని సాధారణ పరిస్థితుల్లో గుర్తించడం సాధ్యం కాదు. శ్రీనివాస్ నేల పైకి కాల్చిన సమయంలో చాంబర్‌లో ఉన్న బుల్లెట్ ఫైరైంది. దీంతో బుల్లెట్ బ్యారెల్ నుంచి దూసుకువచ్చే సమయంలో పిస్టల్ కాస్త పైకి లేచింది. అక్కడే ఉన్న సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రవికిరణ్ ఎడమ కాలులోకి అది దూసుకుపోయింది. గాయపడ్డ ఆయనను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తిలక్‌మార్గ్ పోలీసులు కేసు నమోదు చేసి బాధితుడితోపాటు డీఎస్పీ శ్రీనివాస్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని, ఎలాంటి నిర్లక్ష్యం లేదని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఉదంతంపై ఢిల్లీ పోలీసుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అదనపు డీజీ (శాంతిభద్రతలు) సుదీప్ లక్టాకియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement