సోదరి పుర్రె.. తండ్రి శవం.. ఓ మాజీ టెకీ!
కోల్కతా: ఇదొక ఒళ్లుగగుర్పొడిచే ఘటన. ఒకటి కాదు రెండు ఏకంగా ఆరు నెలలుగా చనిపోయిన తన సోదరి, ఆమె పెంచుకుంటున్న కుక్కల కళేబరాలు, ఎముకలతో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న ఓ మానసిక వికలాంగుడి చర్య. కోల్ కతా నడిమధ్యలోని రాబిన్ సన్ లేన్ అనే వీధిలో ఉంటున్న ఇంటి బాత్ రూములో నుంచి పొగలు బయటకు రావడంతో ఏం జరుగుతుందా అని వెళ్లి చూసిన పోలీసుల కళ్ల ముందు ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. పార్థా డే (47) అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా అసలు కనిపించకుండా ఇంట్లోనే ఉంటూ అనుమానాస్పదంగా కనిపించాడు.
తన ఇంటి బాత్ రూం నుంచి పొగలు వస్తుండటంతో చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేయగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు ఒక కాలిపోయిన పార్థాడే తండ్రి అరబిందా డే(77) మృతదేహం, పుర్రె, ఎముకలతో కూడిన బ్యాగు కనిపించింది. ఈ విషయాలపై అతడిని ఆరా తీయగా తనకు తన కుటుంబమంటే చాలా ఇష్టమని, తన సోదరి అంటే ప్రాణమని, సంగీత పాఠశాలలో ఉపధ్యాయినిగా పనిచేస్తున్న ఆమెకు తాము ముద్దుగా పెంచుకుంటున్న రెండు కుక్కలంటే చాలా ఇష్టమని అవి చనిపోవడంతో తన సోదరి చాలాకాలం భోజనం మానేసి నాలుగు నెలల కిందట ప్రాణాలు విడిచిందని చెప్పాడు.
తన తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడని, వారిని దహనం చేయడం ఇష్టం లేక తనతోనే ఉంచుకున్నానని చెప్పాడు. అంతేకాకుండా, తాను ప్రతిరోజు రాత్రి వారి ఆత్మలతో మాట్లాడాతానని, తనకు వారు కనిపిస్తారని చెప్పాడు. దీంతో అవాక్కయిన పోలీసులు చివరకు పార్థా డేను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు లభించిన పుర్రెను ఒక గుడ్డలో చుట్టి అందులో ఆహారం పెట్టి ఉంచాడు. కాగా, పార్థాడే ఒకప్పుడు ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగి.