రాజద్రోహం కేసులో హార్దిక్ అరెస్టు
సూరత్: పటేల్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ను రాజద్రోహం కేసులో సూరత్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మొదట.. భారత-దక్షిణాఫ్రికాల మధ్య రాజ్‌కోట్‌లో జరిగిన వన్డే సందర్భంగా జాతీయ పతాకాన్ని అవమాన పరిచిన కేసులో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో రూ.10వేల పూచీకత్తుపై కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే.. రాజద్రోహం కేసులో సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. పటేళ్ల ఉద్యమంలో భాగంగా.. అక్టోబర్ 3న తన అనుచరులతో మాట్లాడుతూ.. ‘ఆత్మహత్యలు చేసుకోవటం ఎందుకు? అవసరమైతే ఇద్దరు పోలీసులను చంపండి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై రాజద్రోహం కేసు పెట్టినట్టు సూరత్ డీసీపీ మార్కండ్ చౌహాన్ తెలిపారు. సాధారణంగా.. రాజద్రోహం కేసులో కనీసం మూడేళ్లు.. గరిష్ఠంగా జీవిత ఖైదు శిక్ష పడుతుంది.