
పతాకావిష్కరణ సమయంలో పెట్రోల్ పోసుకొన్న టీచర్
పాఠశాల ఆవరణలో ఆత్మహత్యాయత్నం
బొబ్బిలి : హెచ్.ఎం. తనను వేధిస్తున్నారంటూ ఒక టీచర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం పతాకావిష్కరణ సమయంలో ఆమె స్కూల్ ఆవరణలోనే ఇందుకు యత్నించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వేణుగోపాల ప్రాథమిక పాఠశాలలో శనివారం ఈ సంఘటన జరిగింది. ఆ పాఠశాల హెచ్‌ఎం లక్ష్ముంనాయుడుకు, ఎస్‌జీటీ ఉషారాణిల మధ్య్ల విభేదాలున్నాయి. అవి పెచ్చుమీరి ఆమె ఆత్మహత్యయత్నం చేసే వరకూ వచ్చింది. పతాకావిష్కరణకు సిద్ధమవుతున్న సమయంలో ఉషారాణి శరీరంపై పెట్రోలు పోసుకున్నారు.
అక్కడున్న సిబ్బంది అప్రమత్తమై ఆమె నుంచి పెట్రోల్ క్యాన్‌ను లాగేసుకొన్నారు. అక్కడకు వచ్చిన పిల్లలంతా పరుగులు తీశారు. పతాకావిష్కరణ కూడా ఆగిపోయింది. ఉన్నతాధికారుల ఉత్తర్వులు మేరకు తాను రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణాకార్యక్రమాలకు వెళుతుంటే హెచ్‌ఎం కక్షసాధింపునకు పాల్పడుతున్నారని, తనను చెడ్డగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తూ, మానసికంగా హింసిస్తున్నారని ఉషారాణి వాపోయారు.