ఐటీ రిటర్నులు.. అంతంతే
న్యూఢిల్లీ: మన దేశంలో పన్ను- జీడీపీ నిష్పత్తి చాలా తక్కువగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 2017-18 కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ఆయన ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు తక్కువగా ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు. 4.2 కోట్ల మంది వ్యవస్థీకృత రంగంలో ఉన్నా, కేవలం 1.74 కోట్ల మంది మాత్రమే రిటర్నులు వేస్తున్నారని వెల్లడించారు. 5 కోట్ల మంది వ్యాపారాల్లో ఉన్నా వాళ్లలో 1.81 కోట్లమంది మాత్రమే రిటర్నులు వేస్తున్నారని తెలిపారు. చాలా కంపెనీలు నష్టాలు లేదా సున్నా ఆదాయం చూపిస్తున్నట్లు చెబుతున్నాయని, కేవలం 7781 కంపెనీలు మాత్రమే 10 కోట్ల కంటే ఎక్కువ లాభాలు వచ్చినట్లు చెప్పాయని వెల్లడించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
** 2015-16లో 3.7 కోట్ల మంది వ్యక్తులు పన్ను రిటర్నులు దాఖలు చేశారు. వాళ్లలో 99 లక్షల మంది 5 లక్షల లోపు ఆదాయం చూపారు.
** 1.9 కోట్ల మంది 2.5-5 లక్షల లోపు, 52 లక్షల మంది 5-10 లక్షలు, కేవలం 24 లక్షల మంది మాత్రమే 10 లక్షల పైన ఆదాయం చూపారు
** 76 లక్షల మంది వ్యక్తులు 5 లక్షల పైన ఆదాయం చూపించగా, వాళ్లలో 54 లక్షల మంది ఉద్యోగులే ఉన్నారు
** 50 లక్షల పైన ఆదాయం చూపించినవాళ్లు 1.72 లక్షల మంది మాత్రమే
** కానీ గత ఐదేళ్లలో 1.2 కోట్లకు పైగా కార్లు అమ్ముడయ్యాయి, విదేశాల్లో ప్రయాణించిన వాళ్లు 2 కోట్ల మంది ఉన్నారు
** వీటన్నింటిని బట్టి చూస్తే.. పన్నులు చెల్లించకుండా ఎగవేస్తున్నట్లు తెలుస్తోంది
** ఎక్కువ మంది ఇలా ఎగ్గొడితే.. నిజాయితీపరులైన ఉద్యోగుల మీద ఎక్కువగా భారం పడుతోంది.
** పెద్దనోట్ల రద్దు తర్వాత.. పాత కరెన్సీ డిపాజిట్లు 8 నవంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు 2 లక్షల నుంచి 80 లక్షల లోపు 1.09 కోట్ల ఖాతాల్లో వచ్చాయి. సగటున 5.03 లక్షల డిపాజిట్లు.
** 80 లక్షలకు పైగా 1.48 లక్షల ఖాతాల్లో పడ్డాయి, సగటు డిపాజిట్లు 3.31 కోట్ల రూపాయలు.
** పన్ను విస్తృతిని పెంచి, ఆదాయాన్ని కూడాపెంచుకోవాలని చూస్తున్నాం. ఇది కూడా పెద్ద నోట్ల రద్దు లక్ష్యాల్లో ఒకటి.
** నల్లధనాన్ని ఆర్థిక వ్యవస్థ నుంచి తీసేయాలన్నది మా ఉద్దేశం
** నెట్ టాక్స్ రెవెన్యూ 2013-14లో 11.38 లక్షల కోట్లు
** 14-15లో ఇది 9.4 శాతం పెరిగింది, 15-16లో 17 శాతం పెరిగింది. 16-17లో కూడా 17 శాతం పెరిగింది.
** వ్యక్తులు చెల్లించే అడ్వాన్స్‌డ్ టాక్స్ 34.8 శాతం పెరిగింది. ఇది ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు
సంబంధిత కథనాలు...
2017 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు
బడ్జెట్ లో రైల్వే హైలెట్స్...
గృహ రంగానికి గుడ్న్యూస్
పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు!