కేసులను వెనక్కి తీసుకోవాల్సిందే | India backs Deputy Consul General Devyani Khobragade | Sakshi
Sakshi News home page

కేసులను వెనక్కి తీసుకోవాల్సిందే

Published Fri, Dec 20 2013 1:41 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

కేసులను వెనక్కి తీసుకోవాల్సిందే - Sakshi

కేసులను వెనక్కి తీసుకోవాల్సిందే

న్యూఢిల్లీ: అమెరికాలో భారత సీనియర్ దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే అరెస్ట్ వ్యవహరంపై భారత్ వైఖరి మరింత తీవ్రమైంది. ఆమెపై వేసిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని గురువారం అమెరికాను డిమాండ్ చేసింది. ఆ కేసులు విచారణార్హమైనవే కాదని విదేశాంగమంత్రి సల్మాన్ ఖుర్షీద్ తేల్చిచెప్పారు. ‘రెండు దేశాల మధ్య సంబంధాలను దృష్టిలో పెట్టుకుని సున్నితంగా వ్యవహరించాలి’ అని సూచించారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ కూడా తీవ్రంగా తీసుకున్నారు. సమస్యను పూర్తిగా పరిష్కరించి, దేవయానిపై కేసుల ఉపసంహరణకు కృషి చేయాల్సిందిగా సల్మాన్ ఖుర్షీద్‌ను, జాతీయ భద్రత సలహాదారు శివశంకర్ మీనన్‌ను ఆదేశించారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తనకు ఫోన్‌చేసి ఆ సంఘటనపై విచారం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రధానికి శివశంకర్‌మీనన్ తెలిపారు.

బుధవారం రాత్రి అమెరికా రాజకీయ వ్యవహారాల సహాయ మంత్రి వెండీ షెర్మన్ భారత విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్‌తో దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు. సంఘటనకు సంబంధించిన పూర్త వివరాలను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు తెలిపారు. దేవయాని అరెస్ట్ అరుదైన ఘటనగా, దానివల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకూడదని బుధవారం ఒబామా కార్యాలయం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం తీవ్రరూపం దాల్చడంతో రెండు దేశాలు సామరస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే దేవయానిని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి శాశ్వత మిషన్‌కు బదిలీ చేశారని, దానివల్ల కౌన్సెలర్ అధికారిగా ఆమెకు ఇప్పటివరకు లేని పూర్తిస్థాయి దౌత్య రక్షణ ఇకపై లభిస్తుందని తెలిసింది. దాంతో అక్కడి విచారణ నుంచి కూడా ఆమెకు మినహాయింపు లభిస్తుంది. అయితే, ఇప్పటికే కోర్టు ముందుకు వెళ్లిన వీసా మోసం కేసును ఉపసంహరించుకునే అవకాశంపై స్పష్టత లేదు.

ఈ కేసును వాదిస్తున్న భారత సంతతికి చెందిన అమెరికా న్యాయవాది ప్రీత్ భరార కూడా దేవయానిని అరెస్ట్ చేయడం తప్పేం కాదని వ్యాఖ్యానించారు. దేవయాని పనిమనిషి సంగీత కుటుంబం అమెరికా చేరుకున్న విషయాన్ని కూడా ఆయన ధ్రువీకరించారు. సంగీత నోరు మూయించి, ఆమెను భారత్ తీసుకెళ్లేందుకు చట్టపరమైన ప్రక్రియను భారత్‌లో ప్రారంభించారని ఆరోపించారు. భరార వ్యాఖ్యలు వియెన్నా ఒప్పంద స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని భారత విదేశాంగ శాఖ విమర్శించింది. భారత కోర్టులో కేసు విచారణలో ఉండగా ఆ కుటుంబానికి వీసాలు మంజూరు చేయడాన్ని ప్రశ్నించింది. మరోవైపు, అమెరికా తీరుకు నిరసనగా భారత్ తీసుకున్న చర్యల్లో భాగంగా.. అమెరికా దౌత్యాధికారులు, వారి కుటుంబాలు గురువారం రాత్రి నుంచి ఇక్కడి విమానాశ్రయాల్లో ప్రత్యేక సౌకర్యాలు పొందడం కుదరదు. డిసెంబర్ 23లోగా తమ దగ్గర పనిచేసే భారతీయుల పూర్తి వివరాలు అందించాలని అమెరికా దౌత్యాధికారులను భారత్ ఆదేశించింది. కాగా, తన కూతురిపై వేసిన కేసులను ఉపసంహరించుకోని పక్షంలో నిరాహారదీక్ష చేస్తానని దేవయాని తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి ఉత్తమ్ ఖోబ్రగడే హెచ్చరించారు. ప్రీత్ భరార వ్యాఖ్యలు భారత న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉన్నాయన్నారు.

మా అక్కను మోసం చేసింది: దేవయాని సోదరి శర్మిష్ట
పనిమనిషి సంగీతను తన అక్క సొంత మనిషిలా చూసుకుందని దౌత్యవేత్త దేవయాని సోదరి శర్మిష్ట ఖోబ్రగడే గురువారం ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించింది. దేవయాని శ్రమ దోపిడీకి పాల్పడిందంటూ సామాజిక అనుసంధాన వెబ్‌సైట్లలో వ్యాఖ్యలు, ఆమెకు అభ్యంతరకర మెయిళ్లు వస్తున్నందుకే ఈ వివరణ ఇస్తున్నట్టు చెప్పింది. నిజానికి ఎలాగైనా అమెరికాలో స్థిరపడాలనే దుర్బుద్ధితో సంగీతే తన అక్కను మోసగించిందని, తన అక్కకు భారతీయులంతా మద్దతుగా నిలవాలని కోరింది. సంగీతకు అక్క ఒక మొబైల్ ఫోన్‌తో పాటు ఐపాడ్ కూడా కొనిపెట్టింది. జీతమే కాకుండా అడిగినప్పుడల్లా డబ్బులిచ్చేది. అక్క పిల్లలిద్దరూ స్కూలు వెళ్తారు కాబట్టి వారిని సంగీత నిత్యం చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. వీక్లీ ఆఫ్‌లు, సెలవులు కూడా తీసుకునేది. ఏ లెక్కన చూసినా ఆమె రోజుకు 8 గంటలకు మించి పని చేసిందే లేదు. అన్నీ లెక్కగడితే ఆమెకు అమెరికా చట్టాలు చెబుతున్న గంటకు 9 డాలర్ల కంటే ఎక్కువే ముట్టింది’ అని వివరించింది.

అమెరికా క్షమాపణ చెప్పాలి
హైదరాబాద్, న్యూస్‌లైన్: అమెరికాలో భారత దౌత్యాధికారి దేవయాని పట్ల అవమానకరంగా ప్రవర్తించిన అమెరికా ప్రభుత్వం  క్షమాపణలు చెప్పాలని సీపీఐ డిమాండ్‌చేసింది. లేకుంటే భారత ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించింది. గురువారం హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ వద్ద పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement