ఉక్కు ఉత్పత్తిలో చైనాను దాటాలి
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
రూర్కెలా స్టీల్ ప్లాంటు విస్తరణ ప్రాజెక్టు జాతికి అంకితం
రూర్కెలా : ప్రపంచంలోనే అత్యధికంగా ఉక్కు ఉత్పత్తి చేసే దేశంగా భారత్ ఎదగాలని, చైనాను అధిగమించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నాణ్యతలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాలని సూచించారు. ఒడిశాలో ఉక్కు దిగ్గజం సెయిల్‌కి చెందిన రూర్కెలా స్టీల్ ప్లాంటు (ఆర్‌ఎస్‌పీ)లో విస్తరణ ప్రాజెక్టును బుధవారం జాతికి అంకితం చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.
ప్లాంటు ఆధునీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన కొత్త ప్లేట్ మిల్ పనితీరును ప్రధాని పరిశీలించారు. రూ. 12,000 కోట్ల పెట్టుబడితో చేపట్టిన తాజా విస్తరణ పనుల కారణంగా ఆర్‌ఎస్‌పీ వార్షికోత్పత్తి సామర్థ్యం (ఎంటీపీఏ) 2 మిలియన్ టన్నుల నుంచి 4.5 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. దివంగత జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత ఆర్‌ఎస్‌పీని సందర్శించిన రెండో ప్రధాని మోదీనే.
దేశ భద్రత, రక్షణ అంశాలతో ముడిపడి ఉన్న ఉక్కు రంగంలో ఎదిగేందుకు భారత్‌కు అపార సామర్థ్యం ఉందని ప్రధాని చెప్పారు. ఉక్కు ఉత్పత్తిలో అమెరికాను భారత్ దాటినప్పటికీ.. ఇంకా చైనాతో పోలిస్తే వెనుకనే ఉందని, త్వరలో దాన్ని కూడా అధిగమించాలని ప్రధాని ఆకాంక్షించారు. ‘మనకు భారీగా వనరులు, ఖనిజాలు ఉన్నాయి. ముడి వస్తువులను ఎగుమతి చేయడం బదులుగా దానికి మరింత విలువ జోడించి, అత్యుత్తమ నాణ్యతా ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లలో విక్రయించవచ్చు’ అని ఆయన చెప్పారు.
భారత్ యుద్ధ నౌకల తయారీపై దృష్టి పెడుతోందని, ఆర్‌ఎస్‌పీ ఉద్యోగులు ఇందులో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. అటు ఈశాన్య రాష్ట్రాలను మరింతగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని చెప్పారు. ప్రపంచదేశాలు భారత్ వైపు ఆశావహంగా చూస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. భారత్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా ఇన్వెస్టర్లను ఆయన ఆహ్వానించారు. టాటా స్టీల్, భిలాయ్ స్టీల్ ప్లాంటు, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తదితర సంస్థలకు ఎక్సలెన్స్ అవార్డులను ఈ సందర్భంగా ఆయన అంద జేశారు.
సెయిల్ విస్తరణ ప్రణాళికలు..
కార్యకలాపాలను సెయిల్ మరింతగా విస్తరించనున్నట్లు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఉక్కు మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. 2025 నాటికి వార్షిక ఉత్పత్తిని 50 మిలియన్ టన్నులకు పెంచుకోనుందని వివరించారు. ఇందుకోసం సుమారు రూ. 1.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే రూ. 72,000 కోట్లతో చేపట్టిన విస్తరణ ప్రాజెక్టుకు ఇది అదనమన్నారు. ఈ పెట్టుబడులతో ప్రస్తుతం 13.8 ఎంటీపీఏగా ఉన్న సెయిల్ ఉక్కు ఉత్పత్తి 23.46 ఎంటీపీఏకి చేరగలదని పేర్కొన్నారు.
సెయిల్ రూపొం దించుకున్న విజన్-2025 ప్రకారం రూ. 36,000 కోట్ల పెట్టుబడులతో ఆర్‌ఎస్‌పీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 10.8 ఎంటీపీఏకి పెంచుకోనుంది. సెయిల్‌కి భిలాయ్, బొకారో, రూర్కెలా, దుర్గాపూర్, బర్న్‌పూర్, సేలంలో ప్లాంట్లు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన తొలి సమీకృత ఉక్కు ప్లాంటు ఆర్‌ఎస్‌పీనే. జర్మనీ సహకారంతో 1960లో ఇది ఏర్పాటైంది. విద్యుత్, చమురు..గ్యాస్, ప్యాకేజింగ్ తదితర పరిశ్రమలకు అవసరమయ్యే ఉక్కును ఇది ఉత్పత్తి చేస్తోంది. ఐఎన్‌ఎస్ విక్రాంత్, అర్జున్ వంటి ట్యాంకుల్లో ఆర్‌ఎస్‌పీ ఉక్కునే ఉపయోగించారు.
బొగ్గు నష్టానికి యూపీఏ వివరణ ఇవ్వాలి..
బొగ్గు గనుల వేలం ద్వారా రూ. 2 లక్షల కోట్లు రాబట్టడాన్ని తమ ప్రభుత్వ విజయంగా మోదీ అభివర్ణించారు. కేవలం 20 బొగ్గు గనుల వేలంతోనే తాము ఇంత మొత్తాన్ని రాబట్టగలిగామన్నారు. అలాంటిది.. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా 204 గనులనూ ఇలాగే వేలం వేసి ఉంటే ఇంతకంటే భారీ మొత్తమే వచ్చి ఉండేదని చెప్పారు. కానీ వేలం వేయకుండా లోపభూ యిష్ట విధానంతో కే టాయించడం మూలంగా ఖజానాకు నష్టం వాటిల్లడంపై యూపీఏ వివరణ ఇవ్వాలన్నారు.