
స్విస్ ఖాతాదారులకు నోటీసులు
♦ రెండు ప్రముఖ సంస్థలు సహా 10 మందికి జారీ
♦ గెజిట్ విడుదల చేసిన స్విస్ ఫెడరల్ ట్యాక్స్ అధికారులు
♦ 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ/బెర్న్: స్విస్ బ్యాంకుల్లో భారత కంపెనీలు దాచుకున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో మరో అడుగుముందుకు పడింది. భారత్‌లో పన్ను చెల్లించకుండా స్విట్జర్లాండ్ బ్యాంకులో డబ్బుదాచుకున్న పదిమంది ఖాతాలకు సంబంధించిన వివరాలివ్వాలని భారత్ కోరటంతోపాటుగా ఇందుకు సంబంధించిన ఆధారాలను అందజేసింది. దీనికి స్పందించిన స్విస్ పన్ను విభాగం ఆ ఖాతాదారులకు నోటీసులు జారీ చేసింది.
30 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భారత్ వివరాలు కోరిన పది ఖాతాల్లో రెండు లిస్టెడ్‌టెక్స్‌టైల్ కంపెనీలు (నియో కార్పొరేషన్ ఇంటర్నేషనల్, ఎస్‌ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్) ఉండగా కొన్ని ఆర్ట్ క్యురేటర్, కార్పెట్ ఎక్స్‌పోర్టు వ్యాపారుల అకౌంట్లున్నాయి. ఈ కంపెనీలు విదేశాల్లోనూ వ్యాపారం చేస్తున్నట్లు రికార్డుల్లో వెల్లడించాయి. పనామా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ వంటి దేశాల్లో కంపెనీలు స్థాపించిన సంస్థలూ జాబితాలో ఉన్నాయి. అబ్దుల్ రషీద్ మిర్, ఆమిర్ మిర్, సబేహా మిర్, ముజీబ్ మిర్, తబస్సుమ్‌మిర్ పేర్లతోపాటుగా కాటేజ్ ఇండస్ట్రీస్ ఎక్స్‌పొజిషన్, మోడల్ ఎస్‌ఏ, ప్రొగ్రెస్ వెంచర్స్ గ్రూప్‌లు కూడా నోటీసులు అందుకున్న జాబితాలో ఉన్నాయి. ఇందులో పేర్లు కొన్ని పనామా పేపర్స్ లీక్ వ్యవహారంలో తెరపైకి వచ్చాయి.
పక్కా వ్యూహంతో.. భారత్ వివరాలు కోరిన ఖాతాదారులకు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) నోటీసులు జారీ చేసింది. ఇందులో 30 రోజుల్లో వివరణతోపాటుగా వ్యక్తులు/కంపెనీలు తమ ప్రతినిధులను పంపించాలని కోరింది. భారత్‌కు సమాచారాన్ని చేరవేసేముందు ఖాతాదారుల వాదన వినాలనుకుంటున్నట్లు పేర్కొంది. కొంతకాలంగా స్విస్ బ్యాంకు అకౌంట్లున్న వారి వివరాలివ్వాలని, పాలనాపరమైన సహాయం అందించాలంటూ భారత్ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరుతోంది. భారత్‌తో పన్ను ఎగ్గొట్టి ఆ మొత్తాన్ని స్విస్ బ్యాంకులో దాచుకున్నారనే వ్యక్తులు/కంపెనీలపై అనుమానాలను బలపరుస్తూ పలు ఆధారాలనూ అందించింది.