
వచ్చే ఐదేళ్లలో తిరుగులేని ఆర్థిక శక్తిగా భారత్
వచ్చే అయిదేళ్లలో భారత్ తిరుగులేని ఆర్థిక శక్తిగా మారి చైనాను అధిగమించనుందని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు.
2022 నాటికి అందరికీ ఇళ్లు
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి
హైదరాబాద్: వచ్చే అయిదేళ్లలో భారత్ తిరుగులేని ఆర్థిక శక్తిగా మారి చైనాను అధిగమించనుందని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో‘ 56వ నేషనల్ కాస్ట్ కన్వెన్షన్-2015’ సదస్సుకు ఆయన ముఖ్యతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వృద్ధికి పదేళ్లు హాలిడే ప్రకటించారని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం చైనా 3.7 శాతం వృద్ధిని సాధిస్తోందని వచ్చే అయిదేళ్లలో భారత్ 7 శాతం వృద్ధితో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలువనుందని అశాభావం వ్యక్తం చేశారు. దేశం మొత్తం జనాభాలో 60 శాతం మంది యువకులేనని, 25 నుంచి 35ఏళ్ల మధ్య వయస్సు కల్గిన యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. దేశంలో 58 శాతం మంది ప్రజలకు బ్యాంక్ ఖాతాలు లేవని, మోదీ ప్రభుత్వం ప్రకటించిన ‘జనధన్ యోజన’ ద్వారా 21 కోట్ల మందికి ఖాతాలు తెరిచారని చెప్పారు.
మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మారుతుందని భవిష్యత్‌లో అమెరికా ప్రజలు సైతం చికిత్స కోసం ఇక్కడి వచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. 2022 నాటికి అందరికీ పక్కా ఇళ్లు ఉండేలా ప్రణాళిక సిద్దం చేసినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు సదస్సు సావనీర్, జర్నల్, సీడీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ అధ్యక్షుడు ఎ.ఎస్.దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షుడు సీఎంఏ బట్టాడ్, ప్రతినిధులు పాల్గొన్నారు.
ఢిల్లీ పీఠం బీజేపీదే
కార్యక్రమం అనంతరం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ త్వరలో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోనుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, ఆప్‌కీ పెద్ద తేడా లేదన్నారు. ఉత్తమ ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీ రాజకీయాలలో చేరాలనుకున్నప్పుడు ఆమె బీజేపీనే ఎంచుకున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం మార్పుపై మీడియా ప్రశ్నించగా అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రాదని రాష్ట్ర ప్రభుత్వం ఇష్ట ప్రకారం ఏర్పాటు చేసుకుంటుందన్నారు.