కారు నెంబర్ ప్లేట్ ఖరీదు రూ. 60 కోట్లు!
సెలెబ్రిటీలు, కుబేరులు కోట్లాది రూపాయలు పోసి కార్లు కొనడం మామూలే. అలాగే ఫ్యాన్సీ నెంబర్ల కోసం వేలంలో పోటీపడి లక్షలు చెల్లించి సొంతం చేసుకుంటుంటారు. అయితే దుబాయ్లో ఓ భారతీయ కుబేరుడు తన కారు లైసెన్స్ నెంబర్ ప్లేట్ కోసం ఏకంగా 60 కోట్ల రూపాయలు చెల్లించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే.
ప్రభుత్వం శనివారం 'డీ5' నెంబర్ ప్లేట్ను వేలం వేసింది. బల్వీందర్ సహాని అనే వ్యాపారవేత్త తన దగ్గర ఉన్న రోల్స్ రాయిస్ కార్లలో ఒకదానికోసం భారీ మొత్తం చెల్లించి దీన్ని కొనుగోలు చేశారు. మరో నెంబర్ ప్లేట్ను 1.8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. గతేడాది జరిగిన వేలంలో బల్వీందర్ దాదాపు 45 కోట్లు చెల్లించి 'ఓ9' అనే నెంబర్ ప్లేట్ను సొంతం చేసుకున్నారు. తక్కువ అంకెలు ఉండే కారు లైసెన్స్ ప్లేట్ను కలిగివుండటం దుబాయ్లో స్టేటస్ సింబల్గా భావిస్తారు. ఇలాంటి నెంబర్ ప్లేట్ల కోసం కుబేరులు కోట్లాది రుపాయలు చెల్లించేందుకు సిద్ధపడతారు. 2008లో అబుదాబిలో సయీద్ అల్ ఖోరీ అనే వ్యాపారవేత్త ఏకంగా 94 కోట్ల రూపాయలు చెల్లించి నెంబర్ 1 లైసెన్స్ ప్లేట్ను దక్కించుకున్నారు. యూఏఈలో ఇప్పటి వరకు ఇదే రికార్డు.