హైదరాబాద్ పేలుళ్ల సూత్రధారి లగ్జరీ లైఫ్
హైదరాబాద్ పేలుళ్ల సూత్రధారి లగ్జరీ లైఫ్
Published Wed, Dec 14 2016 10:29 AM | Last Updated on Fri, Sep 28 2018 4:48 PM
హైదరాబాద్: ఓ వైపు దిల్ సుఖ్ నగర్ పేలుళ్లను అమలు చేసిన ఇండియన్ మొజాహిద్దీన్(ఐఎమ్) ఉగ్రవాది యాసిన్ బత్కల్ ను జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ) అరెస్టు చేసి ఆఖరి తీర్పుకు కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమౌతుండగా.. మరో వైపు పేలుళ్ల సూత్రధారి, ఐఎమ్ సహవ్యవస్ధాపకుడు రియాజ్ బత్కల్ పాకిస్తాన్ లో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రియాజ్ బత్కల్ కరాచీలోని ఓ గుర్తు తెలియని ప్రదేశంలోని భవనంలో పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ నీడన రాజభోగాలు అనుభవిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ లో పేలుళ్లు చేసినందుకుగాను ఐఎస్ఐ పెద్ద ఎత్తున డబ్బును రియాజ్ బత్కల్ కు ఇచ్చినట్లు ఎన్ఐఏ అధికారులు అంటున్నారు.
ఈ మేరకు దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల చార్జిషీటులో రియాజ్ బత్కల్, అతని సోదరుడు ఇక్బాల్ బత్కల్ లకు ఐఎస్ఐ ఆశ్రయం ఇస్తోందని పేర్కొన్నట్లు తెలిసింది. ఐఎస్ఐకు సాయం చేస్తానని రియాజ్ ఒప్పుకోవడంతోనే ఐఎమ్ లో చీలిక వచ్చిందని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. మాజీ ఐఎమ్ నేత షఫీ అర్మర్ రియాజ్ తో విభేదించి ఐఎస్ లేదా అల్ ఖైదా సంస్ధ పుట్టుకురావడానికి కారణమయ్యాడని చెప్పారు. రియాజ్ వద్ద పాకిస్తాన్ పాస్ పోర్టు కూడా ఉన్నట్లు తెలిసింది.
దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కోసం హవాలా మార్గం ద్వారా ఒకసారి రూ.1.25లక్షలు, మరోసారి యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వెస్ట్ టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ ఫర్ ద్వారా రూ.75 వేలు యాసిన్ బత్కల్ కు రియాజ్ పంపినట్లు చెప్పారు. ముస్లింలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో సాగుతున్న కార్యకలాపాలను అడ్డుకునేందుకు రియాజ్ బత్కల్ పేలుళ్ల కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. పేలుళ్ల కోసం అసదుల్లా అక్తర్ అలియస్ హద్దీ, మహమ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్, జియా ఉర్ రెహమాన్ అలియాస్ వకాస్ లను యాసిన్ బత్కల్ కు పరిచయం చేసి దిల్ సుఖ్ నగర్ తో పాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు చేయాలని పథకం రచించాడు.
పేలుళ్లకు ఒకరోజు ముందు వ్యుహం సఫలీకృతం కావాలని దేవుడిని ప్రార్ధించాలని రియాజ్ బత్కల్, యాసిన్ బత్కల్ ను కోరినట్లు అధికారులు చెప్పారు. పేలుళ్లకు తొలుత పిక్రిక్ యాసిడ్ ను ఉపయోగించాలని యాసిన్ భావించాడని కానీ, సహచరుల సలహాలతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది. పేలుళ్లలో 50 ఇంప్రొవైజ్ డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజెస్(ఐఈడీ)లను ఉపయోగించినట్లు చెప్పారు. పేలుళ్లు పూర్తయ్యేవరకూ యాహు మెసేంజర్ ద్వారా రియాజ్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నట్లు వెల్లడించారు.
Advertisement