అమెరికాలో భారత మహిళ విజయభేరి
వాషింగ్టన్: అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో జరిగిన కీలక స్థానిక ఎన్నికల్లో భారత సంతతి ముస్లిం మహిళ విజయభేరి మోగించింది. వలసదారుల వ్యతిరేకత, ముస్లిం వ్యతిరేకత అత్యధికంగా ఉండే మేరీల్యాండ్ రాష్ట్రంలో 23 ఏళ్ల రహీలా అహ్మద్ అద్భుతమైన విజయాన్ని నమోదుచేసింది. రహీలా తండ్రి భారత్‌కు చెందినవారు, కాగా తల్లి పాకిస్థాన్ మహిళ.
మేరీల్యాండ్‌లోని ప్రిన్స్ జార్స్ కౌంటీ స్కూల్ బోర్డ్ ఎన్నికల్లో 15శాతం భారీ మెజారిటీతో సుదీర్ఘకాలం కొనసాగుతున్న సిస్టం అడ్మినిస్ట్రేటర్‌పై రహీలా విజయం సాధించింది. 2012లోనూ ఆమె ఈ ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ విజయం సాధించలేదు. ఆమె కౌంటీలో 80శాతం ఆఫ్రికన్-అమెరికన్ సంతతి ఉన్నప్పటికీ ఈ అద్భుత విజయాన్ని సాధించడం గమనార్హం. ఆమెకు రిపబ్లికన్ నేషనల్ కమిటీ మాజీ చైర్మన్ మైఖేల్ స్టీల్ సైతం మద్దతు పలికారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన సమయంలో హిజాబ్ ధరించి ముస్లిం మహిళ అయిన తాను గెలుపొందడం అమెరికాలో భిన్నత్వానికి తావు ఉందని చాటుతోందని, అమెరికా డ్రీమ్ ఇంకా సజీవంగానే ఉందని రహీలా అహ్మద్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.