భారతీయ రైల్వే, ఆర్మీ ఘనత
ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులున్న టాప్-10 సంస్థల జాబితాలో చోటు
డబ్ల్యూఈఎఫ్ అధ్యయనంలో వెల్లడి
* రైల్వేలలో 14 లక్షల మంది, ఆర్మీలో 13 లక్షల మంది ఉద్యోగులు
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులను కలిగివున్న టాప్-10 సంస్థల జాబితాలో రెండు భారతీయ సంస్థలు రైల్వే, ఆర్మీ చోటు సంపాదించాయి. మొత్తం 14 లక్షల మంది సిబ్బందిని కలిగిఉన్న భారతీయ రైల్వేలు ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులను కలిగిఉన్న సంస్థల జాబితాలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది.
మరోవైపు 13 లక్షల ఉద్యోగులతో భారత ఆర్మీ ఆ తరువాతి స్థానం(9వ)లో నిలిచింది. ప్రపంచ ఆర్థిక ఫోరం(డబ్ల్యూఈఎఫ్) ప్రచురించిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ అధ్యయనాన్ని అనుసరించి.. ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులున్న సంస్థగా అమెరికా రక్షణ శాఖ నిలుస్తోంది. ఇది 32 లక్షల మంది ఉద్యోగులను కలిగివుంది. 23 లక్షల మంది ఉద్యోగులతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(చైనా ఆర్మీ) రెండో స్థానంలో నిలిచింది. 21 లక్షల మంది ఉద్యోగులతో అమెరికా సూపర్‌మార్కెట్ జెయంట్ వాల్‌మార్ట్ ఈ జాబితాలో మూడో స్థానం పొందింది. ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులున్న టాప్-10 సంస్థల వివరాలివీ...