రూపాయి, గణాంకాలవైపే చూపు | Indian rupee, economic data to dictate stock market trend this week: experts | Sakshi
Sakshi News home page

రూపాయి, గణాంకాలవైపే చూపు

Published Mon, Sep 9 2013 1:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM

రూపాయి, గణాంకాలవైపే చూపు

రూపాయి, గణాంకాలవైపే చూపు

న్యూఢిల్లీ: డాలరుతో మారకంలో రూపాయి కదలికలతోపాటు, ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్లకు కీలకంగా నిలవనున్నాయి. ఇవికాకుండా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడుల ట్రెండ్‌కూడా మార్కెట్ల దిశను నిర్దేశించనున్నదని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. సోమవారం గణేశ్ చతుర్థి సందర్భంగా మార్కెట్లకు సెలవు కావడంతో ఈవారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా, జూలై నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) వివరాలతోపాటు, రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు గురువారం(12న) విడుదల కానున్నాయి. ఓవైపు ఆర్థిక గణాంకాలు, మరోవైపు అమెరికా కరెన్సీతో రూపాయి మారకం విలువ వంటి అంశాలు మార్కెట్లను ఒడిదుడుకులకు లోనుచేస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు. 
 
 ఈ నెల 20న పాలసీ సమీక్ష
 ఈ నెల 20న రిజర్వ్ బ్యాంకు పాలసీ సమీక్షను చేపట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు గణాంకాలపై దృష్టి నిలుపుతారని విశ్లేషకులు తెలిపారు. అయితే రూపాయి విలువ క్షీణత కారణంగా వడ్డీ రేట్లలో కోతకు అవకాశాలు తక్కువేనని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ అంశాలు, విదేశీ మార్కెట్లు కూడా దేశీయంగా సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని వివరించారు. మరోపక్క సిరియాలో చెలరేగిన అశాంతి కారణంగా ముడిచమురు ధరలపైనా మార్కెట్ దృష్టి పెడుతుందని తెలిపారు. మార్కెట్ ఫండమెంటల్స్‌నుబట్టి చూస్తే రూపాయి క్షీణత సానుకూల అంశమేనని ఇన్వెంచర్ గ్రోత్ అండ్ సెక్యూరిటీస్ చైర్మన్ నాగ్‌జీ కె.రీటా చెప్పారు. అయితే ఆపరేటర్లు, ఇన్వెస్టర్లు చమురు ధర కదలికలకు కూడా ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. కాగా, దేశీయంగా ప్రభుత్వం త్వరలో డీజిల్ ధరలను పెంచనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి.   
 
 కొత్త గవర్నర్ ఎఫెక్ట్
 గత బుధవారం రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్‌గా పదవీ బాధ్యతలను  రఘురామ్ రాజన్ చేపట్టిన చర్యలతో రూపాయి విలువ బలడుతూ వచ్చింది. శుక్రవారం రెండు వారాల గరిష్టం 65.24 వద్ద ముగిసింది. విదేశీ కరెన్సీ డిపాజిట్లను స్వాప్ చేసుకునేందుకు బ్యాంకులకు అవకాశాన్ని కల్పించడంతోపాటు, విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునే పలు చర్యలను రాజన్ ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లు సైతం పుంజుకోవడం తెలిసిందే. గత వారంలో సెన్సెక్స్ 650 పాయింట్లు ఎగసి 19,270 వద్ద నిలిచింది. సిరియా ఆందోళనల నేపథ్యంలో స్వల్ప కాలానికి మార్కెట్లు హెచ్చుతగ్గులను చవిచూడవచ్చునని నిపుణులు తెలిపారు. ఈ నెలాఖరులో ఇటు ఆర్‌బీఐ, ఇటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షలను నిర్వహించనుండటం కూడా దీనికి కారణంకానుందని వివరించారు. ఇక గత శుక్రవారం వెలువడ్డ అమెరికా ఉద్యోగ గణాంకాలు నిరాశపరచడం గమనార్హం.
 
 మళ్లీ ఎఫ్‌ఐఐల కొనుగోళ్ల బాట..
 న్యూఢిల్లీ: గడిచిన నెలలో అత్యధిక రోజులు అమ్మకాలకే పరిమితమైన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) సెప్టెంబర్‌లో యూటర్న్ తీసుకుని నికర కొనుగోలుదారులుగా నిలుస్తున్నారు. వెరసి గత వారం  దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో దాదాపు రూ. 2,600 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. రూపాయిని బలోపేతం చేయడంతోపాటు, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రోత్సాహాన్నిచ్చే బాటలో రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ చేపట్టిన తాజా చర్యలు ఇందుకు దోహదపడ్డాయని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, ఆగస్ట్ నెలలో ఎఫ్‌ఐఐలు అటు ఈక్విటీలు, ఇటు డెట్ సెక్యూరిటీల నుంచి మొత్తంగా రూ. 16,000 కోట్ల(250 కోట్ల డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు విరుద్ధమైన రీతిలో సెప్టెంబర్ తొలి వారంలో నికరంగా రూ. 2,600 కోట్లను(39.2 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. దీనిలో డెట్ మార్కెట్‌లో పెట్టుబడులు రూ. 1,689 కోట్లు(25.6 కోట్ల డాలర్లు)కాగా, ఈక్విటీలలో రూ. 882 కోట్ల(13.5 కోట్ల డాలర్లు)ను ఇన్వెస్ట్ చేశారు. సెబీ  తాజా గణాంకాలివి.
 
 7 బ్లూచిప్స్ విలువకు రూ. 81,554 కోట్లు ప్లస్
 ముంబై: మార్కెట్ క్యాపిటలైజేషన్ రీత్యా టాప్-10 కంపెనీలలో ఏడింటి విలువ రూ. 81,554 కోట్లమేర ఎగసింది. ప్రధానంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలు ఆపి నికర కొనుగోలుదారులుగా నిలవడంతో గత వారం స్టాక్ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 650 పాయింట్లు పుంజుకుంది. వెరసి 7 ప్రధాన బ్లూచిప్ కంపెనీల మార్కెట్ విలువ భారీగా పుంజుకుంది. వీటిలో ఓఎన్‌జీసీ విలువ అత్యధికంగా రూ. 34,093 కోట్లు జంప్‌చేయగా, కోల్ ఇండియా మార్కెట్ క్యాప్‌నకు రూ. 17,023 కోట్లు జమయ్యింది. ఈ బాటలో హెచ్‌డీఎఫ్‌సీ విలువ రూ. 6,880 కోట్లమేర పుంజుకోగా, ఐటీసీ రూ. 6,872 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ రూ. 5,996 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ. 5,437 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 5,253 కోట్లు చొప్పున లాభపడ్డాయి. అయితే మార్కెట్ క్యాప్‌లో టాప్ ర్యాంక్‌లో నిలుస్తున్న టీసీఎస్ మార్కెట్ విలువకు రూ. 6,968 కోట్లమేర చిల్లుపడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement