4 నెలల గరిష్టానికి రూపాయి..
ముంబై: తాజాగా జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం.. దీని ప్రభావంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఉరకలేయడంతో రూపాయి కూడా మరింత బలం పుంజుకుంది. సోమవారం ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ సందర్భంగా డాలరుతో రూపాయి మారకం విలువ ఒకానొకదశలో నాలుగు నెలల గరిష్టస్థాయికి(60.84)కి ఎగబాకింది. చివరకు క్రితం ముగింపు 61.41తో పోలిస్తే 28 పైసలు లాభపడి 61.13 వద్ద స్థిరపడింది. ఇది ముగింపులో రెండు నెలల గరిష్టస్థాయి కావడం గమనార్హం. కాగా, వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ రూపాయి లాభాల్లో ముగి యడం విశేషం. స్టాక్స్‌లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహంతోపాటు ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం కూడా దేశీ కరెన్సీకి ఊతమిచ్చాయని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.అంతర్జాతీయంగా పలు ప్రధాన కరెన్సీలతో డాలరు విలువ బలహీనపడటం, ఎన్నికల్లో బీజేపీ హవాయే రూపాయి పుంజుకోవడానికి ప్రధాన కారణమని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈఓ అభిషేక్ గోయెంకా పేర్కొన్నారు.
కాగా, రూపాయి ర్యాలీ తాత్కాలికమేనని, ఆయిల్ మార్కెట్ కంపెనీ(ఓఎంసీ)ల నుంచి డాలర్లకు మళ్లీ డిమాండ్ జోరందుకుంటే దేశీ కరెన్సీ విలువ బలహీనపడే అవకాశం ఉందని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. రూపాయి విలువ ఇప్పుడు వాస్తవ స్థాయికి చేరుకుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ సోమవారం ఇక్కడ విలేకరులతో వ్యాఖ్యానించారు.
నిఫ్టీ 6,000కు పడ్డాకే.. మరింత జోరు
ఎన్నికల ఫలితాల ఊపు ముగిసిన వెంటనే మార్కెట్లు వెనకడుగు వేస్తాయ్. గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు అమ్మకాలు చేపట్టే అవకాశముంది. పలు సానుకూల అంశాలను ఇప్పటికే మార్కెట్లు డిస్కౌంట్ చేసుకున్నందున రానున్న రోజుల్లో నిఫ్టీ 6,000 పాయింట్లకు క్షీణించవచ్చు. అయితే ఆపై పురోగమన బాట పడుతుంది.
- సందీప్ షెనోయ్, మార్కెట్ నిపుణులు, ఆనంద్ రాఠీ
చిన్న షేర్లకూ జోష్..
బీజేపీ ఎన్నికల విజయాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో సెంటిమెంట్ బుల్లిష్‌గా మారింది. దీంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మరో 5 నుంచి 7 శాతం స్థాయిలో పురోగమించేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లలో కనిపిస్తున్న ఈ సానుకూల ట్రెండ్ ప్రధాన ఇండెక్స్‌లకే పరిమితమైపోదు. ఇకపై ఇది నెమ్మదిగా మిడ్, స్మాల్ క్యాప్స్ విభాగంలో షేర్లకూ పాకుతుంది.
- నిర్మల్ జైన్, చైర్మన్, ఇండియా ఇన్ఫోలైన్
నిఫ్టీ 6,415ను పరీక్షిస్తుంది..
ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో సానుకూల పవనాలు వీస్తున్నాయ్. సోమవారంనాటి బులిష్ జోష్ మరికొద్ది రోజులు కొనసాగుతుంది. రానున్న రెండు మూడు రోజుల్లో నిఫ్టీ 6,415 పాయింట్ల స్థాయిని పరీక్షించే వీలుంది. ఈ స్థాయి నిరోధంగా వ్యవ హరి స్తుంది. మరోవైపు 6,290 పాయింట్ల వద్ద నిఫ్టీకి కీలకమైన మద్దతు లభించే అవకాశముంది.
- షేర్‌ఖాన్, స్టాక్‌మార్కెట్ బ్రోకరేజి సంస్థ