కడుపులోని బిడ్డకు తండ్రివి కాదన్నందుకు..
వెల్లింగ్టన్: ప్రెగ్నెన్సీతో ఉన్న గాళ్‌ఫ్రెండ్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో భారతీయ విద్యార్థికి 17 ఏళ్ల కనీస శిక్షతో జీవిత కారాగార శిక్ష పడింది. మంగళవారం ఆక్లాండ్ హైకోర్టు జడ్జి మాథ్యూ పాల్మెర్ ఈ మేరకు తీర్పు చెప్పారు.
ఆకాశ్ (24) అనే విద్యార్థి న్యూజిలాండ్‌లో చదువుకుంటున్నాడు. అతనికి గురుప్రీత్ కౌర్ (22) అనే గాళ్‌ఫ్రెండ్ ఉంది. వీరిద్దరూ ఏడాది పాటు రహస్యంగా డేటింగ్ చేశారు. కాగా గత ఏప్రిల్ 7న ఆకాశ్, కౌర్ ఘర్షణ పడ్డారు. తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రివి నీవు కావని, బంధాన్ని ఇంతటితో తెంచుకుందామని కౌర్.. ఆకాశ్‌కు చెప్పడంతో గొడవ మొదలైంది. తీవ్ర ఆగ్రహం చెందిన ఆకాశ్ కత్తి తీసుకుని 29 సార్లు కౌర్‌ను విచక్షణరహితంగా పొడిచి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి ఆక్లాండ్ దక్షిణ ప్రాంతంలో పొదల్లో పడేశాడు. కౌర్‌ను తాను హత్య చేయలేదని తొలుత బుకాయించిన ఆకాశ్ పోలీసులు విచారణలో నేరం అంగీకరించాడు. కోర్టు ఆకాశ్‌ను దోషిగా నిర్ధారించి శిక్షను ఖరారు చేసింది.