
భర్తను తగలబెట్టిన ఎన్నారై భార్యకు 20 ఏళ్ల జైలు
ఇంటిని తగలబెట్టేసి, ఆ మంటల్లోనే భర్తను కూడా కాల్చేసిన భారతీయ మహిళకు అమెరికా కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. శ్రియా పటేల్ (27) అనే మహిళకు ట్రావిస్ కౌంటీ జ్యూరీ విధించిన ఈ శిక్షను జిల్లా జడ్జి డేవిడ్ క్రైన్ నిర్ధారించారు. శ్రియా పటేల్ తన భర్త బిమల్ మీద గ్యాసోలిన్ పోసి తగలబెట్టేసిన కేసులో వాస్తవానికి ఆమెకు మరణశిక్ష విధించాలని పోలీసులు కోరినా, కోర్టులో మాత్రం ఆమెపై మోపిన హత్యానేరం రుజువుకాలేదు. ఆస్తిని తగలబెట్టి, తద్వారా మరణానికి కారణమైనట్లు మాత్రమే రుజువు కావడంతో 20 ఏళ్ల జైలుశిక్ష విధించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమెను అమెరికా నుంచి భారతదేశానికి పంపేస్తారు. తీర్పు వెలువడే సమయంలో కూడా ఆమె ఏమాత్రం నదురు బెదురు లేకుండా చూస్తూనే ఉన్నారు.
శ్రియ మరో వ్యక్తిని ప్రేమించిందని బిమల్ స్నేహితులు ఆరోపించారు. కానీ బిమల్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని, బలవంతంగా ఆమెతో తనపై గ్యాసోలిన్ పోయించుకున్నాడని శ్రియ న్యాయవాదులు వాదించారు. సాక్ష్యాధారాలు ఏమీ లేకపోవడం, సాంస్కృతిక, భాషాపరమైన సమస్యలు కూడా ఉండటంతో విచారణకు చాలా ఇబ్బంది ఎదురైందని డిఫెన్సు న్యాయవాది తెలిపారు. శ్రియాపటేల్ ఉన్నత కుటుంబానికి చెందినవారని, ఆమె ఎప్పుడూ న్యాయానికి, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించలేదని, స్వదేశంలో కూడా ఎప్పుడూ పోలీసు కేసులు లేవని చెప్పారు. లండన్లో చదువుకుని, దుబాయ్లో ఉన్న శ్రియకు తగినట్లుగా భర్త ఎప్పుడూ లేడని, దాంతో నిరాశ చెందిందని అన్నారు. బిమల్కు టెలిమార్కెటింగ్ ఉద్యోగం కూడా పోయిందని, దాంతో ఇంటి అద్దె కట్టడానికి సైతం ఇబ్బంది పడుతున్నాడని చెప్పారు. ఇక కోర్టులో ప్రాసిక్యూషన్ న్యాయవాదుల కథనం ప్రకారం, శ్రియ తమ ఇంటి సమీపంలోని వాల్మార్ట్ మాల్ నుంచి గ్యాసోలిన్, చిన్న ఎర్రటి గ్యాస్ ట్యాంక్, కొవ్వొత్తులు కొని తీసుకొచ్చి.. ఈ హత్య చేసింది.