ముంబై: ప్రభుత్వ ఆదాయానికి, వ్యయానికి మధ్య వ్యత్యాసం(ద్రవ్యలోటు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.2 శాతానికి చేరే అవకాశం ఉందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ సోమవారం పేర్కొంది. ద్రవ్యలోటును తగ్గించడానికి భారీ ప్రభుత్వ రంగ కంపెనీలు అధిక డివిడెండ్‌ను చెల్లించాలన్న ప్రతిపాదన సరైనదేనని క్రిసిల్ అభిప్రాయపడింది. ఇది ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా వినియోగపడుతుందని వివరించింది. ప్రభుత్వం ద్రవ్యలోటును 4.8% వద్ద కట్టడి చేయాలని భావిస్తున్నప్పటికీ రెవెన్యూ వృద్ధిలో మందగమనం వల్ల ఈ లోటు 5.1 శాతానికి పెరిగే అవకాశం ఉందని హెచ్‌ఎస్‌బీసీ ఇప్పటికే అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో (ఏప్రిల్-అక్టోబర్) రూ.4.57 లక్షల కోట్లకు చేరినట్లు (బడ్జెట్ లక్ష్యంలో 84%) ఇటీవలి గణాంకాలు వెల్లడించాయి. 2013-14 స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటును రూ.5.42 లక్షల కోట్ల వద్ద (4.8%) కట్టడి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2012-13లో ద్రవ్యలోటు 4.9%గా నమోదయ్యింది.