సముద్రంలో పడినా పైకి తేలాల్సిందే
మెటామెటీరియల్‌తో వినూత్న ప్రయోగాలు
తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎలక్ట్రానిక్ రంగంలో కంటికి కనిపించనంత సూక్ష్మమైన అణువులతో వినూత్న ప్రయోగాలు జరగనున్నాయా? విమానం సముద్రంలో కూలినా పైకి తేలాల్సిందేనా? అవును.. దీనికి ‘మెటా మెటీరియల్స్’ తగిన సమాధానం చెబుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా శనివారం ‘పోటోనిక్స్, మెటామెటీరియల్స్’ అనే అంశంపై సదస్సు జరిగింది. ముంబైలోని టాటా న్యూక్లియర్, అటామిక్ ఫిజిక్స్ విభాగం అధిపతి ప్రొఫెసర్ సుశీల్ మజుందార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ఎస్.అనంతరామకృష్ణ, కోల్‌కతా వర్సిటీ ప్రొఫెసర్ సుబల్ కర్ ప్రసంగించారు.
పోటోనిక్స్, మెటామెటీరియల్స్‌పై విస్తృత పరిశోధన జరుగుతోందని, భారతదేశంలోనూ దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. వివిధ రకాల వస్తువుల సమ్మిళితంగా మెటా మెటీరియల్ తయారవుతుందన్నారు. దీని వల్ల బహుళ ప్రయోజనాలుంటాయని, ప్రస్తుతం దేశంలో మెటామెటీరియల్, మైక్రోవేవ్స్, మిల్లీమీటర్ వేవ్ ఇంజినీరింగ్ వంటి అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.
ఉక్కు కన్నా పటిష్టం.. తక్కువ బరువు
కార్బన్ నానో ట్యూబ్స్ లేదా కార్బన్ నానోట్యూబ్ గ్రిడ్ పేపర్‌తో తయారయ్యేదే బకీ పేపర్. ఈ నానో ట్యూబ్స్ అనేవి మనిషి వెం ట్రుక కన్నా 50 వేల రెట్లు పలచగా ఉంటాయి. ప్రస్తుతం బకీ పేపర్ జర్మనీలో తయారవుతుంది. 4, 5 సెంటీమీటర్ల పేపరు ధర భారతీయ కరెన్సీలో చెప్పుకోవాలంటే కొన్ని వేల రూపాయలు అవుతుంది. అగ్ని ప్రమాదాల నివారించేందుకు, ఎల్‌సీడీలు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్ల తయారీకి ఈ పేపర్‌ను వినియోగిస్తారు. ఉక్కు కన్నా 500 రెట్లు పటిష్టంగా.. పైగా బరువు చాలా తక్కువ.
కూలినా మునగదు..
ఆ మధ్య మలేసియాకు చెందిన ఓ విమానం కూలిపోయింది. కొన్ని నెలల పాటు వెతికినా ఆ విమానం ఆచూకీ తెలియలేదు. ఎక్కడ మునిగిపోయిందో గుర్తించలేకపోయారు. అదే మెటామెటీరియల్‌తో తయారు చేసిన విమానమైతే దానంతట అదే నీటిపై తేలియాడుతుంది. సముద్రంలో కూలినా మునిగిపోయే ప్రసక్తి ఉండదు. మెటామెటీరియల్ వినియోగించి తేలికపాటి విమానాలు, లేజర్ సోనిక్ పరికరాలు, ఇప్పటికన్నా పల్చనైన సెల్‌ఫోన్లు, ఎల్‌సీడీలు, బరువు తక్కువ కార్లు తయారుచేయవచ్చు.