ఎలక్ట్రానిక్‌ ‘సీమ’  | Andhra Pradesh in attracting investment in electronic sector | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రానిక్‌ ‘సీమ’ 

Jan 27 2024 5:09 AM | Updated on Jan 27 2024 2:46 PM

Andhra Pradesh in attracting investment in electronic sector - Sakshi

ఎలక్ట్రానిక్‌ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌  దూసుకుపోతోంది. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ముఖ్యంగా ఎయిర్‌  కండీషనర్లు, సెల్‌ఫోన్‌ కెమెరాలు, సీసీ కెమెరాలు, మొబైల్‌ ఫోన్ల తయారీ  రంగంలో అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. కోవిడ్‌ తర్వాత ఎలక్ట్రానిక్‌  రంగంలో చైనా దిగుమతులను తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) స్కీంను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిపుచ్చుకుంది.  ఈ పథకం కింద పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన అనేక కంపెనీలను రాష్ట్రం స్వాగతించి వేగంగా అనుమతులు మంజూరు చేయడంతో అవి ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి.

సాక్షి, అమరావతి  :  రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మే, 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎలక్ట్రానిక్‌ రంగానికి సంబంధించి కొత్తగా 19 కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించగా, మరో ఐదు కంపెనీలు నిర్మాణాలు పూర్తిచేసుకుని త్వరలో ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తం ఈ 24 కంపెనీల ద్వారా రూ.10,705 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడం ద్వారా 36,205 మందికి ఉపాధి లభించింది.

పీఎల్‌ఐ స్కీం కింద రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వాటిలో డైకిన్, బ్లూస్టార్, యాంబర్, హావెల్స్‌ ఇండియా వంటి ప్రముఖ సంస్థలున్నాయి. అలాగే, గతేడాది మార్చిలో విశాఖ­పట్నం­లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌లో ఎలక్ట్రానిక్‌ రంగానికి సంబంధించి 23 ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా మరో రూ.15,711 కోట్ల పెట్టుబడులతోపాటు 55,140 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

రూ.749 కోట్లతో కొప్పర్తి ఈఎంసీ అభివృద్ధి..
అలాగే, రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ వచ్చాక అప్పటికే ఉన్న తిరుపతి ఈఎంసీ–1, ఈఎంసీ–2, శ్రీసిటీ ఈఎంసీల్లో మౌలిక వసతులను పెంచడంతోపాటు కొత్తగా వైఎస్సార్‌ జిల్లా కడపలో వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)ను అభివృద్ధి చేసింది. కోవిడ్‌ వంటి మహమ్మారి ఉన్నా రికార్డు కాలంలో 801 ఎకరాల్లో వైఎస్సార్‌ ఈఎంసీని రూ.748.76 కోట్లతో అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. వైఎస్సార్‌ ఈఎంసీ ద్వారా రూ.8,910 కోట్ల పెట్టుబడులు.. 28,250 మందికి ఉపాధి లభించడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక స్వరూపాన్ని మార్చ­నుంది.

ఇప్పటికే డిక్సన్‌ వంటి కంపెనీలు పీఎల్‌ఐ స్కీం కింద సీసీ కెమెరాల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేసి ఉత్పత్తి ప్రారంభించగా, టెక్నోడ్రోమ్, సెల్‌కాన్‌ రిజల్యూట్, సాఫ్ట్‌సిస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌­లతో పాటు ఈ స్కీం కింద విద్యుత్‌ ఉపకరణాల తయారీ యూనిట్లు రానున్నాయి. వైఎస్సార్‌ ఈఎంసీ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ఆ జిల్లా స్థూల ఉత్పత్తి 15 శాతం పెరుగుతుందని అంచనా.

ప్రస్తు­తం రూ.41,000 కోట్లుగా ఉన్న ఉమ్మడి వైఎస్సార్‌ కడపజిల్లా స్థూల ఉత్పత్తి విలువ (జీవీఏ) వైఎ­స్సార్‌ ఈఎంసీ రాకతో అదనంగా రూ.6,045 కోట్లు పెరిగి రూ.47,045 కోట్లకు పెరుగుతుందని పరిశ్రమల శాఖ అంచనా వేసింది. వైఎస్సార్‌ ఈఎంసీలో పూర్తిస్థాయిలో పనిచేస్తే ఏటా రూ.33,600 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారవుతాయని అంచనా. వీటిద్వారా 28,250 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించడంతోపాటు పరోక్షంగా 42,780 మందికి ఉపాధి లభించనుంది.

మేడిన్‌ ఆంధ్ర ఏసీలు..
ఇక దేశంలో అమ్ముడయ్యే ప్రతీ రెండు ఎయిర్‌ కండీషనర్లలో ఒకటి మనం రాష్ట్రంలోనే తయారు కానుం­డగా, అదే దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే ఏసీ అమ్మకాల్లో 80 శాతం రాష్ట్రంలో తయారయ్యే ఏసీలే ఉండనున్నాయి. దేశంలోని దిగ్గజ ఏసీ తయారీ సంస్థలు రాష్ట్రంలో ఏసీ తయారీ యూనిట్లను ఏర్పాటు­చేసి నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసుకుని ఉత్పత్తిని ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) స్కీం కింద  శ్రీసిటీలో జపాన్‌ ఏసీ తయారీ సంస్థ డైకిన్, బ్లూస్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్‌ వంటి సంస్థలు భారీ తయారీ యూనిట్లను ఏర్పాటుచేశాయి.

ఇందులో ఒక్క డైకినే తొలి దశలో ఏటా 10 లక్షల యూనిట్లను తయారుచేసే విధంగా యూనిట్‌ను ఏర్పాటుచేయడమే కాక రెండో దశలో మరో 15 లక్షలు తయారుచేసే విధంగా విస్తరణ చేపట్టనుంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులను ఈ జపాన్‌ సంస్థ పెట్టింది. అలాగే, బ్లూస్టార్‌ ఏటా 12 లక్షల యూనిట్లను తయారుచేసే విధంగా యూనిట్‌ను ఏర్పాటుచేస్తోంది. ప్రస్తుతం ఏటా దేశవ్యాప్తంగా 75 లక్షల గృహ వినియోగ ఏసీలు అమ్ముడవుతున్నాయి.

ఇప్పుడు రాష్ట్రంలో ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 50 లక్షలు పైనే ఉంటుందని అంచనా. ఈ విధంగా చూస్తే వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతీ రెండు ఏసీల్లో ఒకటి మన రాష్ట్రంలో తయరైనదే ఉంటుందని అంచనా. మొత్తం ఈ ఆరు యూనిట్లు, వీటికి సరఫరా చేసే ఉపకరణాల యూనిట్లను చూసుకుంటే ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం రూ.3,755 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అలాగే, 10,000 మందికి ఉపాధి లభించనుంది.

రూ.749 కోట్లతో వైఎస్సార్‌ ఈఎంసీ అభివృద్ధి..
ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ కోసం వైఎస్సార్‌ ఈఎంసీని 801 ఎకారాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో తొలిదశలో 540 ఎకరా­లు, రెండో దశలో 261 ఎకరాలు అభివృద్ధి చేయనున్నాం. తొలిదశ­లో రూ.749 కోట్లతో వైఎస్సార్‌ ఈఎంసీని అభివృద్ధి చేశాం. దీని ద్వారా సుమారు రూ.8,910 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాక సుమారు 28,250 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నాం. రానున్న కాలంలో ఎలక్ట్రానిక్‌ తయారీ హబ్‌గా కొప్పర్తి రూపుదిద్దుకోనుంది. – కోన శశిధర్, ఐటీ శాఖ కార్యదర్శి

ఎలక్ట్రానిక్‌ రంగంలో 36,205 మందికి ఉపాధి..
ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీకి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కీలక హబ్‌గా తయారవు తోంది. టీవీలు, వాషింగ్‌ మెషీన్లు, సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్లు, ఏసీలు వంటి అనేక కీలక ఉత్పత్తులకు రాష్ట్రం కేంద్రంగా మారుతోంది. అత్యధిక వినియోగం ఉండే దక్షిణాది రాష్ట్రాలకు చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్‌ జిల్లాలు దగ్గరగా ఉండటంతో పెట్టుబడులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రభుత్వ హయాంలో ఒక్క ఎలక్ట్రానిక్‌ రంగంలోనే రాష్ట్రం రూ.10,705 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 36,205 మందికి ఉపాధి కల్పించింది.     – సాలికిరెడ్డి కిరణ్, గ్రూపు సీఈఓ, అపిటా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement