Electronic sector
-
ఎలక్ట్రానిక్ ‘సీమ’
ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ముఖ్యంగా ఎయిర్ కండీషనర్లు, సెల్‌ఫోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్ల తయారీ రంగంలో అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. కోవిడ్ తర్వాత ఎలక్ట్రానిక్ రంగంలో చైనా దిగుమతులను తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) స్కీంను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిపుచ్చుకుంది. ఈ పథకం కింద పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన అనేక కంపెనీలను రాష్ట్రం స్వాగతించి వేగంగా అనుమతులు మంజూరు చేయడంతో అవి ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మే, 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించి కొత్తగా 19 కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించగా, మరో ఐదు కంపెనీలు నిర్మాణాలు పూర్తిచేసుకుని త్వరలో ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తం ఈ 24 కంపెనీల ద్వారా రూ.10,705 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడం ద్వారా 36,205 మందికి ఉపాధి లభించింది. పీఎల్ఐ స్కీం కింద రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వాటిలో డైకిన్, బ్లూస్టార్, యాంబర్, హావెల్స్ ఇండియా వంటి ప్రముఖ సంస్థలున్నాయి. అలాగే, గతేడాది మార్చిలో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించి 23 ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా మరో రూ.15,711 కోట్ల పెట్టుబడులతోపాటు 55,140 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రూ.749 కోట్లతో కొప్పర్తి ఈఎంసీ అభివృద్ధి.. అలాగే, రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ వచ్చాక అప్పటికే ఉన్న తిరుపతి ఈఎంసీ–1, ఈఎంసీ–2, శ్రీసిటీ ఈఎంసీల్లో మౌలిక వసతులను పెంచడంతోపాటు కొత్తగా వైఎస్సార్ జిల్లా కడపలో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)ను అభివృద్ధి చేసింది. కోవిడ్ వంటి మహమ్మారి ఉన్నా రికార్డు కాలంలో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఈఎంసీని రూ.748.76 కోట్లతో అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. వైఎస్సార్ ఈఎంసీ ద్వారా రూ.8,910 కోట్ల పెట్టుబడులు.. 28,250 మందికి ఉపాధి లభించడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక స్వరూపాన్ని మార్చనుంది. ఇప్పటికే డిక్సన్ వంటి కంపెనీలు పీఎల్ఐ స్కీం కింద సీసీ కెమెరాల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేసి ఉత్పత్తి ప్రారంభించగా, టెక్నోడ్రోమ్, సెల్కాన్ రిజల్యూట్, సాఫ్ట్‌సిస్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో పాటు ఈ స్కీం కింద విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్లు రానున్నాయి. వైఎస్సార్ ఈఎంసీ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ఆ జిల్లా స్థూల ఉత్పత్తి 15 శాతం పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం రూ.41,000 కోట్లుగా ఉన్న ఉమ్మడి వైఎస్సార్ కడపజిల్లా స్థూల ఉత్పత్తి విలువ (జీవీఏ) వైఎస్సార్ ఈఎంసీ రాకతో అదనంగా రూ.6,045 కోట్లు పెరిగి రూ.47,045 కోట్లకు పెరుగుతుందని పరిశ్రమల శాఖ అంచనా వేసింది. వైఎస్సార్ ఈఎంసీలో పూర్తిస్థాయిలో పనిచేస్తే ఏటా రూ.33,600 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారవుతాయని అంచనా. వీటిద్వారా 28,250 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించడంతోపాటు పరోక్షంగా 42,780 మందికి ఉపాధి లభించనుంది. మేడిన్ ఆంధ్ర ఏసీలు.. ఇక దేశంలో అమ్ముడయ్యే ప్రతీ రెండు ఎయిర్ కండీషనర్లలో ఒకటి మనం రాష్ట్రంలోనే తయారు కానుండగా, అదే దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే ఏసీ అమ్మకాల్లో 80 శాతం రాష్ట్రంలో తయారయ్యే ఏసీలే ఉండనున్నాయి. దేశంలోని దిగ్గజ ఏసీ తయారీ సంస్థలు రాష్ట్రంలో ఏసీ తయారీ యూనిట్లను ఏర్పాటుచేసి నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసుకుని ఉత్పత్తిని ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) స్కీం కింద శ్రీసిటీలో జపాన్ ఏసీ తయారీ సంస్థ డైకిన్, బ్లూస్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్ వంటి సంస్థలు భారీ తయారీ యూనిట్లను ఏర్పాటుచేశాయి. ఇందులో ఒక్క డైకినే తొలి దశలో ఏటా 10 లక్షల యూనిట్లను తయారుచేసే విధంగా యూనిట్‌ను ఏర్పాటుచేయడమే కాక రెండో దశలో మరో 15 లక్షలు తయారుచేసే విధంగా విస్తరణ చేపట్టనుంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులను ఈ జపాన్ సంస్థ పెట్టింది. అలాగే, బ్లూస్టార్ ఏటా 12 లక్షల యూనిట్లను తయారుచేసే విధంగా యూనిట్‌ను ఏర్పాటుచేస్తోంది. ప్రస్తుతం ఏటా దేశవ్యాప్తంగా 75 లక్షల గృహ వినియోగ ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 50 లక్షలు పైనే ఉంటుందని అంచనా. ఈ విధంగా చూస్తే వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతీ రెండు ఏసీల్లో ఒకటి మన రాష్ట్రంలో తయరైనదే ఉంటుందని అంచనా. మొత్తం ఈ ఆరు యూనిట్లు, వీటికి సరఫరా చేసే ఉపకరణాల యూనిట్లను చూసుకుంటే ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం రూ.3,755 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అలాగే, 10,000 మందికి ఉపాధి లభించనుంది. రూ.749 కోట్లతో వైఎస్సార్ ఈఎంసీ అభివృద్ధి.. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కోసం వైఎస్సార్ ఈఎంసీని 801 ఎకారాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో తొలిదశలో 540 ఎకరాలు, రెండో దశలో 261 ఎకరాలు అభివృద్ధి చేయనున్నాం. తొలిదశలో రూ.749 కోట్లతో వైఎస్సార్ ఈఎంసీని అభివృద్ధి చేశాం. దీని ద్వారా సుమారు రూ.8,910 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాక సుమారు 28,250 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నాం. రానున్న కాలంలో ఎలక్ట్రానిక్ తయారీ హబ్‌గా కొప్పర్తి రూపుదిద్దుకోనుంది. – కోన శశిధర్, ఐటీ శాఖ కార్యదర్శి ఎలక్ట్రానిక్ రంగంలో 36,205 మందికి ఉపాధి.. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక హబ్‌గా తయారవు తోంది. టీవీలు, వాషింగ్ మెషీన్లు, సీసీ కెమెరాలు, సెల్ఫోన్లు, ఏసీలు వంటి అనేక కీలక ఉత్పత్తులకు రాష్ట్రం కేంద్రంగా మారుతోంది. అత్యధిక వినియోగం ఉండే దక్షిణాది రాష్ట్రాలకు చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్ జిల్లాలు దగ్గరగా ఉండటంతో పెట్టుబడులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రభుత్వ హయాంలో ఒక్క ఎలక్ట్రానిక్ రంగంలోనే రాష్ట్రం రూ.10,705 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 36,205 మందికి ఉపాధి కల్పించింది. – సాలికిరెడ్డి కిరణ్, గ్రూపు సీఈఓ, అపిటా -
ఎలక్ట్రానిక్ హబ్‌గా ఏపీ
సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్ రంగంలో రాష్ట్రం శరవేగంగా వృద్ధి చెందుతోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ మార్కెట్ విలువ రూ.30 వేల కోట్లకు చేరుకున్నట్లు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ అంచనా వేసింది. ఇదే సమయంలో రాష్ట్రం నుంచి రూ.761.76 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు జరిగినట్లు వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో 2019–20లో జరిగిన రూ.643.49 కోట్ల ఎగుమతులతో పోలిస్తే 18.37 శాతం వృద్ధి నమోదైంది. ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ (ఈఎంసీ)లను భారీ ఎత్తున అభివృద్ధి చేస్తోంది. దీంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఎలక్ట్రానిక్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో తిరుపతిలో ఈఎంసీ1, ఈఎంసీ2, శ్రీసిటీలో ఈఎంసీ ఉన్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 23 వేల మందికి ఉపాధి లభిస్తోంది. ప్రధానంగా మన రాష్ట్రంలో మొబైల్ ఫోన్లు, సెట్‌టాప్ బాక్సులు, టీవీలు, కెమెరాల్లో ఉపయోగించే లెన్స్ వంటి విడిభాగాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయి. మరో రెండు ఈఎంసీలు ఇప్పుడున్న మూడు ఈఎంసీలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు ఈఎంసీలను అభివృద్ధి చేస్తోంది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలోని ఈఎంసీలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. వైఎస్సార్ ఈఎంసీలో డిక్సన్‌తోపాటు అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే చిత్తూరు జిల్లాలో మాదిరేడు అరణ్యం వద్ద మరో ఈఎంసీని అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇవి అందుబాటులోకి వస్తే వచ్చే రెండేళ్లలో రాష్ట్ర ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమ విలువ రూ.50,000 కోట్ల మార్కును చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
లక్ష్యం.. 70వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాబోయే నాలుగేళ్లలో రూ.70వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి.. ఎలక్ట్రానిక్స్, విద్యుత్ రంగాల్లో 3లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణను ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా మారుస్తామని చెప్పారు. శనివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ ఆరేండ్లలోనే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలోని 250కిపైగా కంపెనీల్లో 1.60 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు. గతంలో 50 వేల మందికే ఉపాధి ఉండేదని.. ఇప్పుడు మొత్తంగా 2.10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని వివరించారు. ఎలక్ట్రానిక్ క్లస్టర్లలో 40 కంపెనీలకు కేటాయింపులు చేశామని, అందులో 40 వేల మందికి కంపెనీలు ఉపాధి కల్పించాయని తెలిపారు. కరోనా కారణంగా ఇబ్బందులున్నా ఆయా కంపెనీలను ఆకర్షించగలిగామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ను ప్రాధాన్య రంగంగా పరిగణిస్తోందని.. తెలంగాణను విశ్వవ్యాప్త ఎలక్ట్రానిక్స్ వ్యవస్థ రూపకల్పన, తయారీ గమ్యస్థానంగా చేసేందుకు కృషి చేస్తోందని ప్రకటించారు. ఆ పరిశ్రమల నిర్దిష్ట అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక ఎలక్ట్రానిక్స్ విధానం ప్రారంభించామన్నారు. విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహం రాష్ట్రంలో విద్యుత్ వాహనాలు, ఇంధన నిల్వ వ్యవస్థను సత్వరమే చేపట్టి తయారీ, పరిశోధనలను పెంచడానికి ‘విద్యుత్ వాహకం 2020–30 ఇంధన నిల్వ’విధానం ప్రారంభించామని కేటీఆర్ చెప్పారు. ఔటర్‌రింగ్ రోడ్డుకు కుడి పక్కన, విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న 912 ఎకరాల్లో రెండు ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లు ఉన్నాయని తెలిపారు. దివిటిపల్లి, చందన్వెల్లిలలో విద్యుత్ వాహనాలు, ఇంధన నిల్వ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి రెండు కొత్త పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించిందని వివరించారు. ఈవీ క్లస్టర్‌గా చందనవెల్లి, సంబం ధిత భాగాల అవసరాలను తీరుస్తోందని.. కొత్త ఇంధన పార్కుగా చేపట్టిన దివిటిపల్లిలో లీథియం–అయాన్ బ్యాటరీల తయారీ, సోలార్ సెల్, మాడ్యూల్ అసెంబ్లింగ్, ఇతర అవసరాలను తీరుస్తోందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. పరిశ్రమల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి స్టేక్ హోల్డర్లతో కలిసి ఎలక్ట్రానిక్స్ విభాగం పని చేస్తోందని కేటీఆర్ వివరించారు. ఇక విద్యుత్ వాహనాల ప్రోత్సాహం కోసం కమిటీని ఏర్పాటు చేశామని.. ఎలక్ట్రానిక్ వాహనాలకు డిమాండ్ పెంచడం, చార్జింగ్ నెట్వర్క్ అభివృద్ధి కోసం ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పారు. స్థానిక యువతకు ఉపాధి పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పనపై చిత్తశుద్ధితో ఉన్నామని కేటీఆర్ చెప్పారు. టాస్క్ ద్వారా ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌లో (ఈఎస్డీఎం) 60 వేల మందికి శిక్షణ ఇచ్చామని, అందులో 30 వేల మందికి ఉపాధి కల్పించామని వివరించారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో ఫ్యాక్టరీ సబ్సిడీలను రూ.2 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు, జీఎస్టీ రీయింబర్స్మెంట్, ట్రాన్స్‌పోర్టు సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో స్థానిక పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎన్ని అవసరమనే దానిపై ముగ్గురు ఎమ్మెల్యేలతో మాట్లాడి చర్యలు చేపడతామని చెప్పారు. ఇప్పటికే ఎంపీ రంజిత్‌రెడ్డి ఒకటి ఏర్పాటు చేస్తున్నారని.. ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తోందని వివరించారు. 100 రోజుల్లో 12,943 భవన నిర్మాణ అనుమతులు భవన నిర్మాణాల అనుమతుల విషయంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేశ్ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఆన్లైన్లోనే వేగంగా భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు టీఎస్ బీపాస్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. 75 గజాల వరకు ఎలాంటి అనుమతి ఇవసరం లేదని, ఒక రూపాయి టోకెన్‌తో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. 650 చదరపు గజాల వరకు స్థలంలో 10 మీటర్ల ఎత్తు వరకు స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతులు ఇస్తున్నామన్నారు. 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తయిన నివాసేతర భవనాలకు సింగిల్ విండో ద్వారా 21 రోజుల్లో పర్మిషన్లు ఇస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు. స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఇస్తున్నామన్నారు. 100 రోజుల్లో 12,943 భవన నిర్మాణ అనుమతులు ఇచ్చామని వివరించారు. హౌజింగ్ బోర్డులో ఇళ్లు కొనుక్కున్న వారి పేరున ఇళ్లు ట్రాన్స్ఫర్ అయ్యాయని తెలిపారు. కూలిపోయిన ఇళ్లను మళ్లీ కట్టుకునేందుకు ఉచితంగా అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. గ్రామకంఠం భూముల సమస్యను పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
సముద్రంలో పడినా పైకి తేలాల్సిందే
మెటామెటీరియల్‌తో వినూత్న ప్రయోగాలు తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎలక్ట్రానిక్ రంగంలో కంటికి కనిపించనంత సూక్ష్మమైన అణువులతో వినూత్న ప్రయోగాలు జరగనున్నాయా? విమానం సముద్రంలో కూలినా పైకి తేలాల్సిందేనా? అవును.. దీనికి ‘మెటా మెటీరియల్స్’ తగిన సమాధానం చెబుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా శనివారం ‘పోటోనిక్స్, మెటామెటీరియల్స్’ అనే అంశంపై సదస్సు జరిగింది. ముంబైలోని టాటా న్యూక్లియర్, అటామిక్ ఫిజిక్స్ విభాగం అధిపతి ప్రొఫెసర్ సుశీల్ మజుందార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ఎస్.అనంతరామకృష్ణ, కోల్‌కతా వర్సిటీ ప్రొఫెసర్ సుబల్ కర్ ప్రసంగించారు. పోటోనిక్స్, మెటామెటీరియల్స్పై విస్తృత పరిశోధన జరుగుతోందని, భారతదేశంలోనూ దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. వివిధ రకాల వస్తువుల సమ్మిళితంగా మెటా మెటీరియల్ తయారవుతుందన్నారు. దీని వల్ల బహుళ ప్రయోజనాలుంటాయని, ప్రస్తుతం దేశంలో మెటామెటీరియల్, మైక్రోవేవ్స్, మిల్లీమీటర్ వేవ్ ఇంజినీరింగ్ వంటి అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. ఉక్కు కన్నా పటిష్టం.. తక్కువ బరువు కార్బన్ నానో ట్యూబ్స్ లేదా కార్బన్ నానోట్యూబ్ గ్రిడ్ పేపర్‌తో తయారయ్యేదే బకీ పేపర్. ఈ నానో ట్యూబ్స్ అనేవి మనిషి వెం ట్రుక కన్నా 50 వేల రెట్లు పలచగా ఉంటాయి. ప్రస్తుతం బకీ పేపర్ జర్మనీలో తయారవుతుంది. 4, 5 సెంటీమీటర్ల పేపరు ధర భారతీయ కరెన్సీలో చెప్పుకోవాలంటే కొన్ని వేల రూపాయలు అవుతుంది. అగ్ని ప్రమాదాల నివారించేందుకు, ఎల్సీడీలు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు, సెల్ఫోన్ల తయారీకి ఈ పేపర్‌ను వినియోగిస్తారు. ఉక్కు కన్నా 500 రెట్లు పటిష్టంగా.. పైగా బరువు చాలా తక్కువ. కూలినా మునగదు.. ఆ మధ్య మలేసియాకు చెందిన ఓ విమానం కూలిపోయింది. కొన్ని నెలల పాటు వెతికినా ఆ విమానం ఆచూకీ తెలియలేదు. ఎక్కడ మునిగిపోయిందో గుర్తించలేకపోయారు. అదే మెటామెటీరియల్‌తో తయారు చేసిన విమానమైతే దానంతట అదే నీటిపై తేలియాడుతుంది. సముద్రంలో కూలినా మునిగిపోయే ప్రసక్తి ఉండదు. మెటామెటీరియల్ వినియోగించి తేలికపాటి విమానాలు, లేజర్ సోనిక్ పరికరాలు, ఇప్పటికన్నా పల్చనైన సెల్ఫోన్లు, ఎల్సీడీలు, బరువు తక్కువ కార్లు తయారుచేయవచ్చు. -
భారీ టెలిస్కోప్.
- ఈసీఐఎల్ చరిత్రలో మరో కలికితురాయి - ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలిస్కోప్ ‘మేస్’ రూపకల్పన హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) చరిత్రలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలిస్కోప్ ‘మేజర్ అట్మాస్ఫెరిక్ చెరింకోవ్ ఎక్స్పరిమెంట్’ (మేస్) రూపకల్పనతో మరోసారి వార్తల్లో నిలిచింది. సూర్యుని నుంచి వెలువడే ‘గామా’ కిరణాలు మన వాతావరణంపై చూపుతున్న ప్రభావానికి సంబంధించి ఈ పరిశోధనలు కొనసాగుతాయని, దీనిద్వారా విశ్వ మానవాళికి ఎంతో ఉపయోగపడే ఫలితాలు రాబట్టవచ్చునని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. దాదాపు 21 మీ.ల ఎత్తు, 180 టన్నుల బరువు ఉండే ఈ టెలిస్కోప్‌లో అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా -26 డిగ్రీల నుంచి 270 డిగ్రీల కోణంలో 27 మీటర్ల వ్యాసార్థ పరిధిలో గామా కిరణాలను చిత్రీకరించి, భూమిపై ఉండే కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. ఈ కంట్రోల్ రూమ్ నుంచే టెలిస్కోప్‌ను నియంత్రిస్తారు. ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో దాదాపు 28మీటర్ల ఎత్తు ఉన్న ‘హెస్’ టెలిస్కోప్ నమీబియాలో ఉంది. ‘లడఖ్’లో ఏర్పాటు... జమ్మూకాశ్మీర్ పరిధిలో ఉన్న ‘లడఖ్’ ప్రాంతంలోని హన్లే వద్ద ఏర్పాటు చేయనున్న ఈ ‘మేస్’ టెలిస్కోప్ ఈ నెల 28న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉత్తర భారతదేశానికి పయనమవుతోంది.