కుక్క గోస సమజవుతది..
కుక్క ఓసారి కుయ్యిమంటాది.. మరోసారి భౌభౌమంటాది.. దాని అర్థమేమిటో? అసలు మనం పెంచుకునే కుక్క మన గురించి ఏమనుకుంటుందో.. దాని బాధేమిటో?.. ఇలాంటి డౌట్లతో తెగ ఇబ్బంది పడే యజమానులెందరో.. ఇప్పుడా సమస్య లేదు. ఎందుకంటే.. కుక్క భాష ఇకపై మనకూ అర్థమవుతుంది! స్కాండినేవియాకు చెందిన నార్డిక్ సొసైటీ ఫర్ ఇన్‌వెన్షన్ అండ్ డిస్కవరీ శాస్త్రవేత్తలు కుక్కేమన్నా కనిపెట్టే పరికరాన్ని ఒకదాన్ని తయారుచేశారు. చిత్రంలో కనిపిస్తున్నది అదే. ‘నో మోర్ వూఫ్’ అనే ఈ పరికరం బ్రెయిన్ స్కానింగ్ పరిజ్ఞానం ద్వారా కుక్క ఆలోచనా విధానాన్ని కనిపెట్టి.. దాన్ని మన భాషలోకి తర్జుమా చేస్తాయి! శునకం అరుపుల ఆధారంగా శాస్త్రవేత్తలు ఇప్పటికే కొన్నింటిని అలా తర్జుమా చేశారు. అవి.. ఇది చాలా బాగుంది.. నన్ను ఒంటరిగా వదిలేయ్.. నాకు చాలా అలసటగా ఉంది.. ఆకలిగా ఉంది.. నువ్వెవరు?.. మీరెందుకు నన్ను వదిలి వెళ్లిపోతున్నారు. ఈ పరికరం ప్రాథమిక నమూనా మాత్రమే. దీన్ని అభివృద్ధి పరచాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.