29 మంది హతం.. కొత్త నగరం స్వాధీనం
ఇరాక్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తూ.. రోజుకో అడుగు చొప్పున ముందుకేస్తున్న సున్నీ తీవ్రవాదులు షియా మిలీషియా వలంటీర్లపై మరోసారి దాడికి తెగబడ్డారు. 29 మంది వలంటీర్లను హతమార్చి, మరో కొత్త నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. షియా వాలంటీర్లు వెళ్తున్న ఓ కాన్వాయ్ మీద దాడిచేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇటీవలి కాలంలో నేరుగా సున్నీ, షియాల మధ్య జరిగిన పోరులో ఇదే మొదటిది కావడం గమనార్హం.
దాదాపు దశాబ్దం క్రితం అమెరికా చేతిలో తుడిచిపెట్టుకుపోయారని అందరూ భావించిన సద్దాం హుస్సేన్ అనుచరులు ఇప్పుడు మళ్లీ బలం పుంజుకుని క్రమంగా షియా ఆధిక్యం ఉన్న ప్రాంతాలపై దాడులు మొదలుపెట్టారు. క్రమంగా ఒక్కో నగరాన్ని వాళ్లు స్వాధీనం చేసుకుంటూ.. తల్ అఫర్ నగరంపై తమ పట్టు సాధించారు.
మరోవైపు.. ఇరాక్లో పరిస్థితి ఏమాత్రం బాగోలేదని భావించిన ప్రపంచ పెద్దన్న అమెరికా.. అక్కడ మరోసారి వేలు పెట్టాలని భావిస్తోంది. బాగ్దాద్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయానికి భద్రత కల్పించేందుకు దాదాపు 275 మందితో కూడిన అమెరికా సాయుధ దళాలను ఇరాక్ పంపాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయించారు. దీంతో ఇరాక్ ప్రధాని నౌరి అల్ మలికిపై అమెరికాకు విశ్వాసం సడలిపోయిందని అందరికీ అర్థమైంది.