
‘నిఘా’ లోగుట్టేమిటో?, ప్రజాప్రతినిధులకు ఫోన్లపై సర్వత్రా చర్చ
రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు నేరుగా ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్న వైనం రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది.
ప్రజాప్రతినిధులకు ఫోన్లపై సర్వత్రా చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు నేరుగా ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్న వైనం రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది. జీవోఎం నివేదిక తయారీ కసరత్తు కూడా తుది దశకు చేరుకున్న సమయంలో రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులకు నిఘా వర్గాల ఫోన్లు పరిస్థితిని మరింత గందరగోళంలోకి నెట్టడానికేనన్న విమర్శలు వస్తున్నాయి. మొత్తం 294 మంది ఎమ్మెల్యేల నుంచీ సమాచారం సేకరించే పనిలో నిఘా వర్గాలు నిమగ్నమయ్యాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. నిఘా వర్గాల పేరుతో రెండు రోజులుగా పలువురు ప్రజాప్రతినిధులకు ఫోన్లు వచ్చాయి. తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే తనకిలాంటి ఫోన్ రాగా, అవతలివైపు నుంచి మాట్లాడుతున్నది ఎవరో అడిగే ప్రయత్నం కూడా చేయకుండానే తన అభిప్రాయం చెప్పారు. జేఏసీ ప్రతినిధులతో పాటు టీఆర్‌ఎస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీల నేతలకూ ఫోన్లు వచ్చాయంటున్నా వారిలో పలువురు వాటిని ఖండించారు.
తాజాగా కొందరు టీడీపీ నేతలు తమకూ నిఘా వర్గాల నుంచి ఫోన్లు వచ్చాయని చెప్పారు. వారు చెప్పిన మేరకు... తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, తుమ్మల నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్. రమణ, ఉమా మాధవరెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, జి. విజయ రమణారావు తదితరులకు నిఘా అధికారులు ఫోన్ చేశారు. ‘రాయల తెలంగాణ మీకు సమ్మతమేనా? సమ్మతం కాకపోతే ఎందుకు? ప్రత్యేక తెలంగాణ ను ఎందుకు కోరుకుంటున్నారు?’ అంటూ ప్రశ్నించి సమాధానాలను నమోదు చేసుకున్నట్టు సమాచారం. అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి కూడా నిఘా ఫోన్ వచ్చింది. ఇదంతా తాము నిత్యం చేసే అభిప్రాయ సేకరణలో భాగమే తప్ప రాయల తెలంగాణపై పార్టీల అభిప్రాయాలు సేకరించాల్సిందిగా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి తమకెలాంటి ఆదేశాలూ రాలేదని నిఘా అధికారులు చెబుతున్నారు. ఐబీ అధికారులు మాత్రం ఏ అభిప్రాయ సేకరణైనా తాము నేరుగా చేస్తాం తప్ప మరో విభాగానికి అప్పజెప్పబోమంటున్నారు.